15 August, 2026 | 12:45 PM

అమరుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకుని అభివృద్ధి దిశగా అడుగులు

15-08-2026 10:38 AM

అభివృద్ధిలో కందనూల్ టాప్. 

నాగర్‌ కర్నూల్, ఆగస్టు 15 (విజయక్రాంతి): స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకుని తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డా. చిన్నారెడ్డి పిలుపునిచ్చారు. 80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. మహాత్మాగాంధీ, జవహర్‌లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, డా. బీఆర్ అంబేడ్కర్, మౌలానా అబుల్ కలాం ఆజాద్, సుభాష్ చంద్రబోస్, భగత్‌సింగ్ తదితరుల త్యాగాల ఫలితంగానే దేశానికి స్వాతంత్య్రం లభించిందన్నారు. వారి ఆశయాలను కొనసాగిస్తూ సామాజిక న్యాయం, సమానత్వం, ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ఆరు గ్యారంటీలను అమలు చేస్తూ ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తోందన్నారు. మహాలక్ష్మి పథకం ద్వారా జిల్లాలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రూ.500కే గ్యాస్ సిలిండర్, గృహజ్యోతి కింద 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నట్లు తెలిపారు. సన్నబియ్యం పంపిణీ, కొత్త రేషన్ కార్డుల మంజూరు, స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ వంటి కార్యక్రమాలతో కందనూల్ జిల్లా మొట్ట మొదటి స్థానంలో నిలిచిందన్నారు. 

ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.10 లక్షలకు పెంచడంతో జిల్లాలో వేలాది మంది వైద్య సేవలు పొందుతున్నారని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం, భూభారతి, రైతు భరోసా, రైతు బీమా, పప్పుధాన్యాల స్వయం సమృద్ధి, పత్తి ఉత్పాదకత పెంపు వంటి పథకాల ద్వారా ప్రజలు, రైతులకు ప్రభుత్వం అండగా నిలుస్తోందన్నారు. సాగునీటి రంగంలో కల్వకుర్తి, అచ్చంపేట, పాలమూరు-రంగారెడ్డి, మార్కండేయ ఎత్తిపోతల పథకాల పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. వ్యవసాయం, ఉద్యానవనం, మత్స్య, పశుసంవర్ధక, విద్య, వైద్యం, గ్రామీణాభివృద్ధి, మహిళా సంక్షేమం, అటవీ, పరిశ్రమలు, క్రీడా రంగాల్లో జిల్లాలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. జిల్లాలో 2025-26 ఎస్‌ఎస్‌సీ ఫలితాల్లో 99.03 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలో రెండో స్థానం సాధించడం గర్వకారణమన్నారు. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్, ఫరహాబాద్ జంగల్ సఫారీ, మన్ననూర్ జంగల్ రిసార్ట్, ఆక్టోపస్ వ్యూ పాయింట్‌ల ద్వారా పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. 2027 జనాభా గణనలో భాగంగా జిల్లాలో తొలి దశలో ఇళ్ల జాబితా, గణన ప్రక్రియ పూర్తయిందని పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాలు ప్రజలకు సమర్థవంతంగా చేరేలా అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని కోరారు. జిల్లా అభివృద్ధికి సహకరిస్తున్న ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉద్యోగులు, మీడియా ప్రతినిధులు, ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. జైహింద్.. జై తెలంగాణ అంటూ ప్రసంగాన్ని ముగించారు.