2025 కల్లా జపాన్‌ను దాటేస్తాం
నాల్గవ పెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్
నీతి ఆయోగ్ మాజీ సీఈవో అమితాబ్ కాంత్
న్యూఢిల్లీ, మే 12: వివిధ స్థూల ఆర్థిక విభాగాలు మంచి పనితీరును ప్రదర్శిస్తున్నాయని, ఈ నేపథ్యంలో 2025 సంవత్సరానికల్లా భారత ఆర్థిక వ్యవస్థ జపాన్‌ను అధిగమించి, నాల్గవ పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవిస్తుందని జీ20 షెర్పా, నీతి ఆయోగ్ మాజీ సీఈవో అమితాబ్ కాంత్ అంచనా వేశారు. ప్రస్తుతం భారత్ జీడీపీ ప్రపంచ దేశాల్లో 5వ స్థానంలో ఉన్నది. తొలి నాలుగు స్థానాల్లో యూఎస్, చైనా, జర్మనీ, జపాన్‌లు ఉన్నాయి. 2022లో యూకేను దాటిన భారత్ జీడీపీ ముగిసిన ఆర్థిక సంవత్సరంలో 3.7 ట్రిలియన్ డాలర్లు ఉంటుందని అంచనా. దశాబ్దకాలం క్రితం ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో భారత్‌ది 11వ స్థానం.
వృద్ధి జోరును చూపిస్తున్న ఆర్థికాంశాలు
అమితాబ్ కాంత్ విశ్లేషణ ప్రకారం రికార్డుస్థాయిలో వస్తు సేవల పన్ను (జీఎస్టీ) పన్ను వసూళ్లు, గత మూడు త్రైమాసికాలుగా జీడీపీ వృద్ధి 8 శాతంపైగా నమోదుకావడం, వివిధ కరెన్సీలతో పోలిస్తే రూపాయి ట్రేడవుతున్న తీరు, అదుపులోకి వస్తున్న ద్రవ్యోల్బణం వంటివి ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టిస్తున్నాయి. ఉక్కు, సిమెంటు, ఆటోమొబైల్ తయారీ రంగాలు రెండంకెల్లో వృద్ధిచెందడం, డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాలో గ్లోబల్ లీడర్‌గా అవతరించి 134 బిలియన్లకుపైగా లావాదేవీలు నమోదుకావడం, అంతర్జాతీయ డిజిటల్ చెల్లింపుల్లో ఇండియా వాటా 46 శాతానికి చేరడం తదితర అంశాలు భారత్ వృద్ధి సూచిస్తున్నాయని కాంత్ వివరించారు. 2023 ఆర్థిక సంవత్సరం అక్టోబర్ త్రైమాసికంలో భారత్ జీడీపీ 8.4 శాతం వృద్ధిచెందింది. ప్రపంచంలోకెల్లా వేగంగా వృద్ధిచెందుతున్న ఆర్థిక వ్యవస్థగా నిలిచింది.






