24 April, 2026 | 2:16 AM

భారత్, చైనాలు ‘నరక కూపాలు’

24-04-2026 12:44 AM
  1. ఈ దేశాల వలసదారులు ‘ల్యాప్‌టాప్‌లతో ఉన్న గ్యాంగ్‌స్టర్లు’
  2. అమెరికన్ రేడియో హోస్ట్ మైఖెల్ సావేజ్ వివాదాస్పద వ్యాఖ్యలను రీపోస్ట్ చేసిన ట్రంప్
  3. ఆ దేశాలు నాగరికతలకు పుట్టినిల్లు.. ట్రంప్‌నకు ఇరాన్ కౌంటర్

వాషింగ్టన్, ఏప్రిల్ 23: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. భారత్, చైనా వంటి దేశాలను ‘నరక కూపాలు’ అని సంబోధిస్తూ, అక్కడి వలసదారులపై జాత్యహంకార వ్యాఖ్యలు చేసిన ఒక పోస్టును ఆయన తన ‘ట్రూత్ సోషల్’ మీడియాలో రీపోస్ట్ చేశారు. దీంతో ఆయనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే భారత్, చైనా దేశాలు నాగరికతలకు పుట్టినిల్లు అని ట్రంప్‌నకు హైదరా బాద్‌లోని ఇరాన్ ఎంబసీ కౌంటర్ ఇచ్చింది.

ఇరాన్ నాగరికతను నాశనం చేస్తానన్న ట్రంప్ దేశమే అసలైన నరకమని పేర్కొంది. అమెరికన్ రేడియో హోస్ట్ మైఖెల్ సావేజ్ రాసిన ఈ పోస్టులో అమెరికాలో పుట్టుకతో పౌరసత్వం కల్పించే చట్టంపై ట్రంప్ తీవ్ర వ్యతిరేకత వ్యక్తపరిచారు. భారత్, చైనా వంటి దేశాల నుంచి ప్రజలు గర్భంతో ఉన్న తొమ్మిదో నెలలో అమెరికాకు వచ్చి పిల్లల్ని కంటున్నారని, తద్వారా ఆ పిల్లలు తక్షణమే అమెరికా పౌరులుగా మారుతున్నారని ఆయన ఆరోపించా రు. ‘ఇక్కడ పుట్టిన బిడ్డ తక్షణమే పౌరుడు అవుతాడు.

ఆ తర్వాత వాళ్లు చైనా, భారత్ లేదా భూమిపై ఉన్న మరో నరకకూపం నుంచి తమ పూర్తి కుటుంబాన్ని ఇక్కడికి తీసుకొస్తారు’ అని సావేజ్ తన లేఖలో రాశారు. అంతటితో ఆగకుండా భారత్, చైనా వలసదారులను ‘ల్యాప్‌టాప్‌లతో ఉన్న గ్యాంగ్‌స్టర్లు’ అని అభివర్ణించారు. ట్రంప్ ఈ లేఖను పోస్ట్ చేయడానికి ఒక రోజు ముందు, అమెరికా మినహా ప్రపంచంలో ఏ దేశంలోనూ పుట్టుకతో పౌరసత్వం ఇచ్చే విధానం లేదని ఓ ఇంటర్వ్యూలో తప్పుడు ప్రకటన చేశారు.

అయితే ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలపై హైదరాబాద్‌లోని ఇరాన్ కాన్సులేట్ కౌంటర్ ఇచ్చిం ది. భారత్, చైనాలు నాగరికతలకు పుట్టినిల్లు అని పేర్కొంది. వాస్తవానికి, ఇరాన్ నాగరికతను నాశనం చేస్తానని ఏ యుద్ధ నేరస్థుడైన అధ్యక్షుడు (ట్రంప్) బెదిరింపులకు పాల్పడుతున్నాడో అక్కడే (అమెరికా) నరకం ఉందని ఇరాన్ కాన్సులేట్ ‘ఎక్స్’ వేదికగా ట్వీట్ చేసింది. ట్రంప్‌ను ఉద్దేశిస్తూ హైదరాబాద్‌లోని ఇరాన్ కాన్సులేట్ వరుస ట్వీట్లు చేసింది. విభజించి, పాలించు అనే సూత్రం ఉందని, కానీ ట్రంప్ మాత్రం ఎలాంటి పద్ధతి లేకుండా విభజిస్తున్నారని ఆరోపిస్తూ మరో పోస్టు చేసింది. ట్రంప్ నిత్యం ఏదో ఒక పోస్టుతో తనలోని అంతులేని అమానవీయతను రుజువు చేస్తున్నారని, ఇది అసలైన జాత్యాహంకారం అని ఇంకో పోస్టు ద్వారా విమర్శించింది.