రికార్డు స్థాయిలో పోలింగ్
- పశ్చిమబెంగాల్‌లో 91.78 శాతం, తమిళనాడులో 84.69 శాతం
- బెంగాల్‌లో తొలివిడత 152, తమిళనాడులో ఒకే విడతలో 234 స్థానాలకు ఎన్నికలు
- బీజేపీ నాయకులు, కార్యకర్తల పరస్పర దాడులు
- ప్రజాస్వామ్యంలో ‘సూపర్ థ్రస్ డే’ సీఈసీ జ్ఞానేష్ కుమార్
కోల్‌కతా/చెన్నై, ఏప్రిల్ 23: పశ్చిమ బెంగాల్, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో గురువారం భారీగా ఓటింగ్ జరిగింది. బెంగాల్లో మొదటి దశ ఎన్నికల్లో మొత్తం 294 స్థానాలకుగాను 152 స్థానాలలో ఓటింగ్ జరగ్గా 91.78శాతం పోలింగ్ నమోదైంది. ఏప్రిల్ 29న 142 స్థానాలకు గాను రెండో విడతలో పోలింగ్ జరగనుంది.
తమిళనాడులోని మొత్తం 234 స్థానాలకు రికార్డు స్థాయిలో 84.69 శాతం పోలింగ్ నమోదైంది. రెండు రాష్ట్రాల చరిత్రలో 1952లో ఎన్నికలు ప్రారంభమైనప్పటి నుంచి నమోదైన అత్యధిక ఓటింగ్ శాతం ఇదే కావడం గమనార్హం. బెంగాల్ తొలివిడతలో 16 జిల్లాల్లోని 152 స్థానాలకు గాను 1,452మంది అభ్యర్థులు పోటీపడ్డారు. కాగా ఇరు రాష్ట్రాల్లో అధికారం తమదంటే తమదేనంటూ ఎవరికి వారే ధీమా వ్యక్తం చేస్తున్నారు. మే 4న ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి.
బెంగాల్‌లో హింసాత్మక ఘటనలు..
పశ్చిమ బెంగాల్ ఓటింగ్ సందర్భంగా పలుచోట్ల హింసాత్మక ఘర్షణలు చోటు చేసుకున్నాయి. దక్షిణ మిడ్నాపూర్‌లోని కుమార్‌గంజ్ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి సువెందు అధికారిని కొందరు వెంబడించి దాడిచేశారు. దాడిచేసిన వారిలో పోలీసులు ఐదుగురిని అరెస్టు చేశారు. మరికొంతమంది కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పశ్చిమ బర్ధమాన్ జిల్లాలో అసన్సోల్ సౌత్ బీజేపీ అభ్యర్థి అగ్నిమిత్ర పాల్ కారుపై దాడి రాళ్ల జరిగింది. టీఎంసీ దుండగుల దుశ్చర్యగా అగ్నిమిత్ర అభివర్ణించారు. బీర్‌భూమిలోని బోధ్పూర్ గ్రామంలో ఒక ఈవీఎం పనిచేయకపోవడంతో, ప్రజలు పోలీసులు, కేంద్ర బలగాలపై కొందరు దుండగులు రాళ్లు రువ్వారు. ఒక పోలీసు వాహనాన్ని ధ్వంసం చేశారు.
ఈ ఘటనలో పలువురు భద్రతా సిబ్బందికి గాయాలయ్యాయి. బుధవారం అర్ధరాత్రి ముర్షిదాబాద్‌లోని నౌడాలో జరిగిన బాంబు దాడిలో పలువురు గాయపడ్డారు. టీఎంసీ బహిష్కృత నేత, ఆమ్ జనతా ఉన్నయన్ పార్టీ (ఏజేయూపీ) అధినేత హుమాయున్ కబీర్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆయన మద్దతుదారులకు, టీఎంసీ కార్యకర్తలకు మధ్య ఘర్షణ చెలరేగి దాడుల వరకు వెళ్లింది. దీంతో పోలీసులు లాఠీలకు పనిచెప్పారు. సిలిగురిలోని జగదీష్ చంద్ర విద్యాపీఠం వద్ద బీజేపీ, టీఎంసీ కార్యకర్తల మధ్య ఘర్షణ చెలరేగింది. బూత్ బయట ఇరు పార్టీల కార్యకర్తలు వాగ్వాదానికి దిగడంతో భద్రతబలగాలు రంగంలోకి దిగాయి.
పశ్చిమ బెంగాల్‌లో అత్యధిక ఓటింగ్ జరిగిన జిల్లాలు..
అత్యధికంగా దక్షిణ దినాజ్‌పూర్ 94.77 శాతం, కూచ్ బెహార్, 94.40, బీర్భూమి 93.61, జల్పాయిగురి 93.01, మాల్దాలో 92.22, ముర్షిదాబాద్‌లో 92.88, ఉత్తర దినాజ్‌పూర్‌లో 92.04, ఝార్గ్రామ్‌లో 91.78, అలీపుర్దువార్, బంకురా, పశ్చిమ మేదినీపూర్, తూర్పు మేదినీపూర్ వంటి జిల్లాల్లో కూడా 89 నుంచి 91 శాతం ఓటింగ్ నమోదైంది.
తమిళనాడులో ఓటేసిన ప్రముఖులు
తమిళనాడు ఎన్నికల్లో ప్రముఖులంతా ఉదయాన్నే తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. నటుడు అజిత్, నటుడు, టీవీకే పార్టీ అధినేత విజయ్ నీలన్కరైలోని కార్పొరేషన్ పాఠశాలలో, సూపర్ స్టార్ రజనీకాంత్ చెన్నైలోని స్టెల్లా మారిస్ కళాశాలలో, కమల్‌హాసన్, శృతిహాసన్, నటుడు శివకార్తీకేయన్, ఆయన భార్య, నటుడు చియాన్ విక్రమ్, నటుడు సూర్య, నటి జ్యోతిక, కవిన్, సూరి, భరత్, దర్శకుడు అట్లీ, సంగీత స్వరకర్త అనిరుధ్, నటి త్రిషా కృష్ణన్, ధనుష్, ప్రభుదేవా తదితర తమిళ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
కోల్‌కతా ప్రధాన ఎన్నికల అధికారి మనోజ్ అగర్వాల్ మాట్లాడుతూ.. ఈసారి పోలింగ్ కేంద్రాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశాం. ప్రజలు నిర్భయంగా ఓటువేసేందుకు రావడంతో ఓటింగ్ శాతం పెరిగింది. ఈసారి పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో ప్రజలు తమ ఉదాసీనతను వీడారు. ప్రతీ ఇంటి నుంచి ఓటువేసేందుకు తరలిరావడం హర్షించదగ్గ పరిణామం.
చెదురుమదురు ఘటనలు..
తిరువణ్ణామలై జిల్లాలోని కలసప్పక్కం నియోజకవర్గం కిల్పలూరు పంచాయతీలో గల పోలింగ్ బూత్ నంబర్ 193లో ఓటింగ్ యంత్రాన్ని ఏజెంట్లమని లోపలికి వచ్చిన దుండగులు పగులుగొట్టడంతో ఉద్రిక్తత ఏర్పడింది. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న కలెక్టర్, అదనపు బలగాలు ఓటింగ్ సజావుగా కొనసాగేలా చర్యలు చేపట్టారు. నిందితులను గుర్తించే పనిలో పోలీసులున్నారు.
సూపర్ థర్స్ డే: సీఈసీ
రెండు రాష్ట్రాల ఎన్నికల్లో పాల్గొన్న ఓటర్లకు భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ వందనాలు. పెద్ద మొత్తంలో పోలింగ నమోదు కావడం భారత చరిత్రలో ఓ రికార్డు. ‘ప్రజాస్వామ్యంలో సూపర్ థర్స్ డే’ గా అభివర్ణించారు.






