ఓస్ట్‌ఫాలియా యూనివర్సిటీతో శాతవాహన అవగాహన ఒప్పందం
ముకరంపుర,(విజయక్రాంతి): శాతవాహన విశ్వవిద్యాలయం అంతర్జాతీయ విద్యా ప్రమాణాల దిశగా ఒక కీలక అడుగు వేసింది. జర్మనీకి చెందిన ప్రముఖ 'ఓస్ట్‌ఫాలియా యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ సైన్సెస్'తో శాతవాహన విశ్వవిద్యాలయం అధికారికంగా అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ద్వారా ఉభయ విశ్వవిద్యాలయాల మధ్య అంతర్జాతీయ విద్యా సహకారం, విద్యార్థులు, అధ్యాపకుల మార్పిడి కార్యక్రమాలు పరిశోధనలు, సాంకేతిక రంగాలలో పరస్పర సహకారం పెంపొందనున్నాయి.
ఆచార్య ఉమేష్ కుమార్ మాట్లాడుతూ ఓస్ట్‌ఫాలియా యూనివర్సిటీతో కుదిరిన ఈ అవగాహన ఒప్పందం శాతవాహన విశ్వవిద్యాలయ చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయమని అన్నారు. ఈ భాగస్వామ్యం ముఖ్యంగా పరిశోధనలు, సాంకేతిక ఆవిష్కరణలు, అంతర్జాతీయ స్థాయి నైపుణ్యాలను పెంపొందించుకోవడంలో ఇక్కడి విద్యార్థులకు ఎంతగానో దోహదపడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే విశ్వవిద్యాలయాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడానికి నిరంతరం శ్రమిస్తున్న ఉప కులపతికి రిజిస్ట్రార్ సతీష్ కుమార్, ఓ ఎస్ డి టు వీసీ డా. హరికాంత్, డీన్స్, ప్రిన్సిపాల్స్,విశ్వవిద్యాలయ అధికారులు, అధ్యాపక బృందం, భోదనేతర సిబ్బంది ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.






