calender_icon.png 24 December, 2025 | 3:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భారత్ మరోసారి సత్తా చాటింది

24-12-2025 11:07:18 AM

న్యూఢిల్లీ: ఎల్వీఎం3-ఎం6 రాకెట్ ప్రయోగం విజయవంతం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. ప్రపంచంలోనే అత్యుత్తమ ప్రయోగాల్లో ఇది ఒకటన్నారు. భారత అంతరిక్ష ప్రయాణంలో మరో కీలక మైలురాయిగా నిలిచిందని ప్రధాని హర్షం వ్యక్తం చేశారు. ప్రపంప వాణిజ్య ప్రయోగాల్లో భారత్ మరోసారి సత్తా చాటిందని ప్రధాని మోదీ కొనియాడారు. అంతరిక్ష రంగంలో భారత్ అత్యున్నత స్థానానికి ఎదుగుతూనే ఉందని సూచించారు. ఈ విజయం.. ఆత్మనిర్భర్ భారత్ వైపు మన ప్రయత్నాలను ప్రతిబింబిస్తుందని తెలిపారు. "భారత అంతరిక్ష రంగంలో ఇది ఒక కీలక ముందడుగు. భారత గడ్డపై నుంచి ప్రయోగించిన అత్యంత బరువైన ఉపగ్రహమైన, అమెరికాకు చెందిన బ్లూబర్డ్ బ్లాక్-2 అంతరిక్ష నౌకను దాని నిర్దేశిత కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టిన ఎల్వీఎం3-ఎం6 ప్రయోగం, భారతదేశ అంతరిక్ష ప్రస్థానంలో ఒక గర్వించదగిన మైలురాయిని సూచిస్తుంది," అని ప్రధాని మోదీ ఎక్స్‌లో ఒక పోస్ట్‌లో పేర్కొన్నారు.

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (Indian Space Research Organisation) బుధవారం అమెరికాకు చెందిన ఏఎస్టీ స్పేస్‌మొబైల్‌కు చెందిన బ్లూబర్డ్ బ్లాక్-2 అంతరిక్ష నౌకను దాని హెవీ-లిఫ్ట్ లాంచ్ వెహికల్ LVM3-M6, 'బాహుబలి' రాకెట్ ద్వారా ప్రయోగించింది. ఇది అంతరిక్ష సంస్థ వాణిజ్య పురోగతికి ఒక మైలురాయిగా భావిస్తున్నారు. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రంలోని లాంచ్ ప్యాడ్ నుండి బుధవారం ఉదయం 8.55 గంటలకు అంతరిక్ష నౌక నింగిలోకి ఎగిరింది. అంతరిక్ష సంస్థ ప్రకారం, ఆ తర్వాత ఉపగ్రహాన్ని విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. ఈ ప్రయోగం ఇస్రోకు కూడా చాలా ముఖ్యమైనది. ఎందుకంటే 6,100 కిలోల బరువున్న బ్లూబర్డ్ బ్లాక్-2 ఉపగ్రహం, అంతరిక్ష సంస్థ ఎల్వీఎం3 రాకెట్ ద్వారా తక్కువ భూమి కక్ష్యలో (LEO) ప్రవేశపెట్టిన అత్యంత బరువైన పేలోడ్ ఇదే కావడం విశేషం.