24-12-2025 01:07:30 PM
ముంబై: మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం(Maharashtra politics) చోటుచేసుకుంది. 20 ఏళ్ల తర్వాత ఠాక్రే సోదరులు ఏకమవుతున్నారు. ఈ సందర్భంగా ఠాక్రే సోదరులు బాల్ ఠాక్రే సమాధి వద్ద నివాళులర్పించారు. చేతులు కలిపిన శుభ సందర్భంగా రాజ్ ఠాక్రే, ఉద్ధవ్ ఠాక్రే మీడియా సమావేశం నిర్వహించారు. ఠాక్రే సోదరులు కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. జనవరి 15న జరగబోయే మున్సిపల్ ఎన్నికల కోసం వారు బుధవారం పొత్తును ప్రకటించారు. శివసేన, ఎంఎన్ఎస్ పార్టీలు మున్సిపల్(BMC elections) ఎన్నికల్లో కూటమిగా పోటీచేయనున్నాయి. శివసేన (ఠాక్రే వర్గం), మహారాష్ట్ర నవనిర్మాణ సేన మధ్య పొత్తు ఏర్పాటుపై చాలా రోజులుగా చర్చలు జరుగుతున్నాయి.
శివసేన (యూబీటీ) నాయకుడు సంజయ్ రౌత్(Sanjay Raut) మాట్లాడుతూ, "ఉద్ధవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రే ఈరోజు ఒక ఎన్నికల పొత్తును ప్రకటించడానికి ఏకమవుతున్నారు. ఇది మహారాష్ట్రకు, మరాఠీ ప్రజలకు ఆనందకరమైన క్షణం. బాలాసాహెబ్ ఠాక్రే ఇక్కడి స్థానిక ప్రజల కోసం శివసేనను స్థాపించారు. 20 సంవత్సరాలుగా ఠాక్రే సోదరులు కలిసి లేరు, దానివల్ల మహారాష్ట్ర చాలా నష్టపోయింది. ఇప్పుడు, బీజేపీకి బుద్ధి చెప్పడానికి, ముంబైలో జరుగుతున్న దోపిడీని ఆపడానికి ఉద్ధవ్, రాజ్ ఠాక్రే ఏకమయ్యారు. మేము ముంబైలోని 10 మున్సిపల్ కార్పొరేషన్లలో కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తాము." అని సంజయ్ రౌత్ అన్నారు.