1 July, 2026 | 1:55 PM

పంత్, పాండ్యా ధనాధన్

02-06-2024 12:48 AM

వార్మప్ మ్యాచ్‌లో మెరుపులు

బంగ్లాదేశ్‌పై భారత్ గెలుపు

టీ20 ప్రపంచకప్‌నకు ముందు ఏకైక వార్మప్ మ్యాచ్‌ను టీమిండియా సద్వినియోగ పరుచుకుంది. న్యూయార్క్‌లో తొలిసారి ఫుల్ లెంగ్త్ మ్యాచ్ ఆడిన రోహిత్ సేన.. పిచ్, పరిస్థితులను అర్థం చేసుకుంటూ చక్కటి ప్రదర్శన కనబర్చింది. గాయం కారణంగా సుదీర్ఘ కాలంగా భారత జట్టుకు దూరమైన రిషబ్ పంత్.. ప్రాక్టీస్ పోరులో అర్ధశతకంతో ఆకట్టుకోగా.. స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా తనలోని హిట్టర్‌ను తట్టి లేపాడు. ఇక బౌలర్లు సమష్టిగా సత్తాచాటడంతో బంగ్లాదేశ్‌పై టీమిండియా ఘనవిజయం సాధించింది. 

న్యూయార్క్: పొట్టి ప్రపంచకప్‌లో భారత జట్టు రాణించాలంటే.. రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా సత్తాచాటాల్సిన అవసరం ఉందనే విశ్లేషకులు అంచనాల మధ్య వార్మప్ మ్యాచ్‌లో ఈ జోడీ హిట్టుంది. శనివారం బంగ్లాదేశ్‌తో జరిగిన  ప్రాక్టీస్ పోరులో ఈ ఇద్దరూ దుమ్మురేపడంతో టీమిండియా 60 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌పై విజయం సాధించింది.  టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. రిషబ్ పంత్ (32 బంతుల్లో 53; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) అర్ధశతకంతో మెరవగా.. హార్దిక్ పాండ్యా (23 బంతుల్లో 40 నాటౌట్; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) రాణించాడు. ప్రాక్టీస్ మ్యాచ్ కావడంతో 15 మంది ఆటగాళ్లు బరిలోకి దిగే చాన్స్ ఉండగా.. కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి సంజూశాసంన్ ఓపెనర్‌గా బరిలోకి దిగాడు. అయితే ఈ ఇద్దరూ ఆకట్టుకోలేకపోయారు.

ఆరు బంతులు ఎదుర్కొన్న శాంసన్ ఒక్క పరుగు మాత్రమే చేసి వెనుదిరగగా.. రోహిత్ శర్మ 19 బంతుల్లో 2 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 23 రన్స్ చేశాడు. సుదీర్ఘ ప్రయాణం అనంతరం విశ్రాంతి కొరకు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్‌కు దూరంగా ఉండగా.. అతడి స్థానంలో వన్‌డౌన్‌లో క్రీజులో అడుగుపెట్టిన రిషబ్ పంత్ విజృంభించాడు. రోడ్డు ప్రమాదం అనంతరం తిరిగి కోలుకొని ఇటీవల ఐపీఎల్ ఆడిన పంత్.. ముపుపటి జోరు కనబర్చాడు. తనకే అలవాటైన రీతిలో ఒంటి చేతి సిక్సర్లతో రెచ్చిపోయాడు. మిడిలార్డర్‌లో బ్యాటింగ్ చేసిన సూర్యకుమార్ యాదవ్ (18 బంతుల్లో 31; 4 ఫోర్లు), శివమ్ దూబే (14; ఒక సిక్సర్) ఎక్కువసేపు నిలవలేకపోగా.. ఆఖర్లో పాండ్యా రెచ్చిపోయాడు. ఎడాపెడా సిక్సర్లతో చెలరేగిపోయాడు. ఈ క్రమంలో హార్దిక్ హ్యాట్రిక్ సిక్సర్లు బాదడం విశేషం. అనంతరం లక్ష్యఛేదనలో బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 122 పరుగులు చేసింది. టాపార్డర్ విఫలం కాగా.. సీనియర్ ప్లేయర్లు షకీబ్ అల్ హసన్ (28), మహ్ముదుల్లా (40; 4 ఫోర్లు, ఒక సిక్సర్) పోరాడారు. భారత బౌలర్లలో అర్ష్‌దీప్, శివమ్ దూబే చెరో రెండు వికెట్లు పడగొట్టగా.. బుమ్రా, సిరాజ్, పాండ్యా, అక్షర్ తలా ఒక వికెట్ తీశారు.

సంక్షిప్త స్కోర్లు

భారత్: 20 ఓవర్లలో 182/5 (పంత్ 53, పాండ్యా 40 నాటౌట్; మహ్ముదుల్లా 1/16), బంగ్లాదేశ్: 20 ఓవర్లలో 121/9 (మహ్ముదుల్లా 40, షకీబ్ 28; అర్ష్‌దీప్ 2/12, దూబే 2/13).