కరువు తీరేనా!
నేటి నుంచి టీ20 ప్రపంచకప్
ఫేవరెట్‌గా టీమిండియా
పుష్కర కాలంగా ఐసీసీ ట్రోఫీ కోసం కండ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న టీమిండియాకు మరో చక్కటి అవకాశం! నిరుడు స్వదేశంలో జరిగిన వన్డే ప్రపంచకప్ చివరి మెట్టుపై బోల్తా కొట్టిన భారత జట్టు.. పొట్టి ఫార్మాట్‌లోనైనా ప్రపంచ చాంపియన్‌గా నిలవాలని భావిస్తోంది. అప్పుడెప్పుడో టీ20 క్రికెట్ పెద్దగా జనాదరణ పొందని సమయంలో 2007లో తొలిసారి నిర్వహించిన వరల్డ్‌కప్‌లో విజేతగా నిలిచిన టీమిండియా ఆ తర్వాత ఏడు ప్రయత్నాల్లోనూ కప్పు కొల్లగొట్టలేకపోయింది. మరి నేటి నుంచి ప్రారంభం కానున్న తొమ్మిదోఎడిషన్‌లోనైనా రోహిత్ సేన కల నెరవేరుతుందా, కరువు తీరుతుందా చూడాలి!
క్రికెట్‌ను మతంగా భావించే మన దేశంలో టీ20 ఫార్మాట్‌కు ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ప్రపంచంలో ఏ మూలలో భారత జట్టు బరిలోకి దిగుతున్నా.. అభిమానులు బ్రహ్మరథం పట్టడం పరిపాటే. మరి అలాంటిది వరల్డ్‌కప్ అంటే క్రేజ్ మామూలుగా ఉండదు. ఐసీసీ ప్రతి రేండేళ్లకోసారి నిర్వహించే టీ20 వరల్డ్‌కప్‌నకు నేడు తెరలేవనుండగా.. రోహిత్ సేన మరోసారి ఫేవరెట్ ట్యాగ్‌తో బరిలోకి దిగనుంది. ఆతిథ్య అమెరికా, కెనడా మధ్య జరగనున్న తొలి పోరుతో మెగాటోర్నీకి అంకురార్పణ జరగనుండగా.. మరో మ్యాచ్‌లో పపువా న్యూ గినియాతో వెస్టిండీస్ తలపడనుంది.
విజయక్రాంతి, ఖేల్ విభాగం
మరో క్రికెట్ పండగకు సమయం ఆసన్నమైంది. వేసవి సెలవుల్లో ఐపీఎల్‌ను ఆస్వా దించిన అభిమానులకు నేటి నుంచి విశ్వసమరం మజాను పంచనుంది. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న తొమ్మిదో టీ20 ప్రపంచకప్ నేడు ప్రారంభం కానుంది. దాదాపు నెల రోజుల పాటు జరగనున్న ఈ మెగాటోర్నీలో 20 జట్లు నాలుగు గ్రూప్‌లుగా తలపడనున్నా యి. దాయాది పాకిస్థాన్, ఐర్లాండ్, అమెరికా, కెనడాతో కలిసి గ్రూప్ ఉన్న టీమిండియా బుధవారం జరగనున్న తమ తొలి పోరులో ఐర్లాండ్‌తో కప్పు వేటను ప్రారంభించనుంది. ఐపీఎల్లో సహచరులే ప్రత్యర్థులుగా మారి ఒకరిపై ఒకరు కత్తులు దూసుకోగా.. ఇప్పుడు జట్టంతా కలిసి నీలిరంగులో సత్తాచాటేందుకు సమయాత్తమవు తోంది. ఐపీఎల్ చివరి దశలోనే అమెరికా చేరుకున్న భారత ఆటగాళ్లు న్యూయా ర్క్ పరిస్థితులకు అలవాటు పడటంతో పాటు ప్రాక్టీస్ సెషన్లలో నూ పాల్గొన్నారు.
ఏకైక వార్మప్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో తలపడ్డ టీమిండియా.. మూడు రోజుల విరామం అనంతరం అసలు పోరుకు సిద్ధం కానుంది. 2007 నుంచి భారత జట్టులో ఉన్న కెప్టెన్ రోహిత్ శర్మకు దాదాపు ఇదే చివరి ప్రపంచకప్ కాగా.. చాన్నాళ్లుగా పొట్టి ఫార్మాట్‌కు దూరంగా ఉన్న విరాట్ కోహ్లీ కూడా వచ్చే ఎడిసన్‌లో దర్శనమిచ్చే అవకాశాలు తక్కువే. అనిశ్చితికి మారుపేరైన టీ20 ఫార్మాట్‌లో ఆస్ట్రేలియా, వెస్టిండీస్, ఇంగ్లండ్, దక్షిణా ఫ్రికా, న్యూజిలాండ్, పాకిస్థాన్ వంటి జట్లను దాటుకొని ముందంజ వేయడం కష్టమై న పనే అయినా.. ఈసారి కప్పు కొట్టాలనే లక్షంతోనే రోహిత్ సేన ముమ్మర సాధన చేస్తోంది. ఈ సారి వెస్టిండీస్, అమెరికా సంయుక్తంగా ప్రపంచకప్‌నకు ఆతి థ్యమిస్తున్నాయి. తొలి రోజు పోటీల్లో కెనడాతో అమెరికా, పపువా న్యూ గినియాతో వెస్టిండీస్ అమీతుమీ తేల్చుకోనున్నాయి.
కరీబియన్ల వేట!
పొట్టి ఫార్మాట్‌లో అత్యంత ప్రమాదకర జట్టుగా గుర్తింపు సాధించిన వెస్టిండీస్ వరల్డ్‌కప్ తొలి మ్యాచ్‌లో పపువా న్యూ గినియాతో తలపడనుంది. ప్రాక్టీస్ మ్యాచ్‌లో పటిష్ట ఆస్ట్రేలియాను మట్టికరిపించిన కరీబియన్ల ముందు పపువా న్యూ గినియా నిలవగలదా అనేది ప్రధాన సమస్య. ప్రపంచ వ్యాప్తంగా లీగ్‌ల ద్వారా అపార అనుభవం గడించిన వెస్టిండీస్ ఆటగాళ్లు.. జట్టుగా ఎలా ఆడతారో చూడాలి మరి. రావ్‌మన్ పావెల్ సారథ్యంలో రస్సెల్, హెట్‌మైర్, హోప్, కింగ్, చార్లెస్, పూరన్‌తో విండీస్ జట్టు శత్రు దుర్బేధ్యంగా కనిపిస్తోంది. మరోవైపు పపువా న్యూ గినియా మాత్రం ఈ టోర్నీ ద్వారా తమ ఉనికి చాటుకోవాలని చూస్తోంది.
ఇక మరో మ్యాచ్‌లో ఆతిథ్య అమెరికా కెనడాను ఢీకొట్టనుం ది. ఈ రెండు జట్లలో అత్యధిక భాగం భారత సంతతి ఆటగాళ్లే ఉండగా.. అమెరికాలో క్రికెట్ క్రేజ్ పెరిగేందుకు ఈ మెగాటోర్నీ దోహదం పడుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరి ప్రపంచ కప్‌లో బోణీ ఎవరు కొడతారో చూడాలి. భారత కాలమానం ప్రకారం అమెరికా, కెనడా మధ్య మ్యాచ్ ఉదయం 6 గంటలకే ప్రారంభం కానుండగా.. వెస్టిండీస్, పపువా న్యూ గినియా పోరు రాత్రి 8 గంటలకు జరగనుంది.






