9 March, 2026 | 10:51 PM

జగజ్జేత భారత్

09-03-2026 03:29 AM

* పొట్టి క్రికెట్‌లో మనకు తిరుగులేదని మరోసారి రుజువైంది. 2024 టీ20 ప్రపంచకప్ గెలిచిన తర్వాత ఈ ఫార్మాట్‌లో పూర్తి ఆధిపత్యం కనబరుస్తున్న భారత జట్టు ఇప్పుడు 2026 వరల్డ్‌కప్‌లోనూ అదరగొట్టింది. అంచనాలకు తగ్గట్టే రాణిస్తూ డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో టైటిల్ నిలబెట్టుకుంది. వరుసగా రెండోసారి, మొత్తంగా మూడోసారి టీ20ల్లో జగజ్జేతగా నిలిచి చరిత్ర సృష్టించింది. సొంతగడ్డపై వరల్డ్‌కప్ సాధించిన తొలి జట్టుగానూ రికార్డులకెక్కింది. బ్యాటింగ్‌లో సంజూ, అభిషేక్, ఇషాన్ విధ్వంసం సృష్టిస్తే.. బౌలింగ్‌లో బుమ్రా, అక్షర్ కివీస్‌ను దెబ్బకొట్టారు.

టీ20 ప్రపంచకప్ మనదే

వరుసగా రెండోసారి ట్రోఫీ కైవసం

ఫైవల్లో న్యూజిలాండ్ చిత్తు

బ్యాట్‌తో దుమ్మురేపిన సంజూ, అభిషేక్, ఇషాన్

బౌలింగ్‌లో అదరగొట్టిన బుమ్రా, అక్షర్ పటేల్

అంచనాలు తప్పలేదు.. సెమీఫైనల్ వరకూ ఎలాంటి బ్యాటింగ్‌తో అదరగొట్టిందో తుది పోరులోనూ భారత్ అదే జోరు చూపింది..టోర్నీ మొత్తం విఫలమైన అభిషేక్ శర్మ ఫామ్‌లోకి వచ్చిన వేళ... సంజూ శాంసన్ తన సూపర్ ఫామ్ కొనసాగిస్తే... ఇషాన్ కిషన్ వీరిద్దరికీ జత కలిసాడు. ఇక చివర్లో ఫినిషర్ రోల్‌లో దూబే మెరుపులతో 255 పరుగుల భారీస్కోరుతో దాదాపుగా విజయాన్ని ఖాయం చేసుకుంది.

తర్వాత బౌలింగ్, ఫీల్డింగ్‌లోనూ విజృంభించి న్యూజిలాండ్‌కు అసలు అవకాశం కూడా ఇవ్వకుండా చిత్తుగా ఓడించింది. దీంతో సొంతగడ్డపై టీ20 ప్రపంచకప్‌ను సగర్వంగా అందుకుంది. భారత్ అద్వితీయమైన విజయంతో యావత్ దేశమంతా సంబరాల్లో మునిగిపోయింది. రాష్ట్రపతి, ప్రధాని నుంచి సినీ, రాజకీయ, కార్పొరేట్ ప్రముఖుల వరకూ టీమిండియా అభినందనలతో ముద్దయింది.

అహ్మదాబాద్, మార్చి 8 : డిఫెండింగ్ ఛాంపియన్ టీమిండియా మరోసారి టీ20 ప్రపంచకప్ గెలుచుకుంది. వరుసగా రెండోసారి, ఓవరాల్‌గా మూడోసారి వరల్ కప్ గెలిచి చరిత్ర సృష్టించింది. మొదట బ్యాటింగ్, తర్వాత బౌలింగ్, ఫీల్డింగ్‌లో అదరగొట్టిన న్యూజిలాండ్‌ను చిత్తు చేసింది. అం దరి అంచనాలకు భిన్నంగా కివీస్ టైటిల్ పోరులో పెద్దగా పోటీనివ్వలేకపోయింది. ఈమ్యాచ్ లో భారత బ్యాటర్లు దుమ్మురేపారు. టాప్ 3 బ్యాటర్లు సంజూ శాంసన్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ ముగ్గురూ హాఫ్ సెంచరీలతో రెచ్చిపోయారు. ఈ టోర్నీ మొత్తం విఫలమై విమర్శలు ఎదుర్కొన్న అభిషేక్ శర్మ ఫైనల్లో మాత్రం అదర గొట్టేశాడు. కేవలం 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అటు సంజూ శాంసన్ కూడా తన సూపర్ ఫామ్ కంటి న్యూ చేశాడు.

పవర్ ప్లేలోనే భారత్ వికెట్ నష్టపోకుండా 92 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ మరింత దూకుడుగా ఆడే క్రమంలో 52 ( 6 ఫోర్లు, 3 సిక్సర్లు) పరుగులకు ఔటయ్యాడు. భారత్ 100 పరుగుల మార్కును కేవలం 7.2 ఓవర్లలోనే అందుకుంది. తర్వాత క్రీజులోకి వచ్చిన ఇషాన్ కిషన్‌తో కలిసి సంజూ శాంసన్ మరింత చెలరేగాడు. భారీ సిక్సర్లతో కివీస్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఫలితంగా భారత్ రన్ రేట్ ఓవర్‌కు 14 కు పైగా సాగింది. ఈ క్రమంలో వరుసగా మూడో హాఫ్ సెంచరీ సాధించిన సంజూ సెంచరీ చేసేలా కనిపించాడు.

అటు ఇషాన్ కిషన్ కూడా చెలరేగి ఆడి 21 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. వీరిద్దరూ 45 బంతుల్లోనే 105 పరుగుల పార్ట నర్ షిప్ నెలకొల్పారు. అయితే సెంచరీ చేస్తాడనుకున్న సంజూ శాంసన్ 89 పరుగులకు వెనుదిరిగాడు. సంజూ ఇన్నింగ్స్‌లో 5 ఫోర్లు, 8 సిక్సర్లున్నాయి. అయితే సంజూ ఔటైన తర్వాత సూర్యకుమార్ డకౌటవడం, హార్థిక్ పాండ్యా కూడా వెనుదిరగడంతో కాస్త టెన్షన్ నెలకొంది.

భారత్ 230 లోపు పరిమితయ్యేలా కనిపించింది. ఈ దశలో శివమ్ దూబే రెచ్చిపోయాడు. భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. కేవలం 8 బంతుల్లోనే 26 పరుగులు చేశాడు. ఫలితంగా భారత్ 20 ఓవర్లలో 255 పరుగులు చేసింది. కివీస్ బౌలర్లలో అందరూ భారీగా పరుగులు సమర్పించుకున్నారు. జిమ్మీ నీషమ్ 3 వికెట్లు తీసినా 46 రన్స్ ఇచ్చాడు. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉన్నప్పటకీ ఫైనల్లో ఉండే ఒత్తిడిని న్యూజిలాండ్ అధిగమించలేకపోయింది. ఆరంభం నుంచే తడబడింది. తొలి రెండు ఓవర్లలో బాగానే ఆడినా తర్వాత చేతులెత్తేసింది.

పవర్ ప్లేలోనే 3 కీలక వికెట్లు తీసిన భారత బౌలర్లు మ్యాచ్‌ను తమవైపు తిప్పేసుకున్నారు. ఫిన్ అలెన్ (9), ఫిలిప్స్ (5), రచిన్ రవీంద్ర (1), చాప్ మన్ (3) పరుగులకే ఔటవగా..సిఫెర్ట్ దూకుడుగా ఆడుతూ హాఫ్ సెంచరీ చేసి వెనుదిరిగాడు. దీంతో న్యూజిలాండ్ 71 పరుగులకే సగం వికెట్లు కోల్పోయింది. సౌతాఫ్రికాపై సెమీఫైనల్లో కివీస్ ఆట చూసిన తర్వాత ఆ జట్టు గట్టిపోటీ ఇస్తుందేమో అనిపించింది. అయితే భారత బౌలర్లు న్యూజిలాండ్‌కు ఆ అవకాశం ఇవ్వలేదు. అక్షర్ పటేల్ కీలక వికెట్లు తీస్తే.. తర్వాత బుమ్రా కూడా చెలరేగిపోయా డు.

దీంతో న్యూజిలాండ్ క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. 10 ఓవర్లు ముగిసేసరికే మ్యాచ్ ఫలితం అర్థమైపోయింది. తర్వాత మిఛెల్ శాంట్నర్ (43) మెరుపులు మెరిపించినా ఫలితం లేకపోయింది. సాధించాల్సిన రన్‌రేట్ ఇంకా చాలా ఉండిపోవడంతో టెయిలెండర్లు కూడా చేతులెత్తేశారు. ముఖ్యంగా తాను ఎంత అద్భుత మైన బౌలరో బుమ్రా మరోసారి నిరూపించుకున్నాడు. ఒకే ఓవర్లో 2 వికెట్లు తీసిన ఈ స్టార్ పేసర్ తన స్పెల్‌లో కేవలం 15 పరుగులే ఇచ్చి 4 వికెట్లు ఖాతాలో వేసు కున్నాడు. దీంతో న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌కు 159 పరుగులకు తెరపడింది.

భారత బౌలర్లలో బుమ్రా 4, అక్షర్ పటేల్ 3 వికెట్లు పడ గొట్టగా.. హార్థిక్ పాండ్యా, వరుణ్ చక్రవర్తి, అభిషేక్ శర్మ ఒక్కో వికెట్ తీశారు. 96 పరుగులతో భారీ విజయాన్ని అందుకున్న భార త్ చరిత్ర సృష్టించింది. కాగా 2023 వన్డే ప్రపంచకప్ చేజారిన అహ్మదాబాద్ స్టేడియంలోనే భారత్ ఇప్పుడు టీ20 ప్రపంచ కప్ గెలిచి ఆ బాధను దూరం చేసింది. అటు టీ20 వరల్డ్ కప్ నాకౌట్స్‌లో న్యూజిలాండ్‌పై తొలిసారి విజయాన్ని అందుకుంది. 

స్కోరు బోర్డు 

భారత్ ఇన్నింగ్స్ : 255/5 ( సంజూ శాం సన్ 89, అభిషేక్ శర్మ 52, ఇషాన్ కిషన్ 54  

న్యూజిలాండ్ ఇన్నింగ్స్ : 159 ఆలౌట్ (సిఫెర్ట్ 52, శాంట్నర్ 43, మిఛెల్ 17 ; బుమ్రా 4/15, అక్షర్ పటేల్ 3/27 )

ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ : జస్ప్రీత్ బుమ్రా

ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ : సంజూ శాంసన్ (321 పరుగులు)

* ప్రపంచకప్ విజయం దేశం గర్వపడేలా చేసింది. టీ20 ప్రపంచకప్ గెలిచిన భారత్ జట్టుకు నా అభినందనలు. భవిష్యత్‌లో మరిన్ని విజయాలు సాధించాలి

 రాష్ట్రపతి ముర్ము

* టీ20 ప్రపంచకప్ ఫైనల్లో భారత జట్టు అద్భుత ప్రదర్శన చేసింది. ఈ విజయంతో దేశం గర్వపడేలా చేశారు. ప్రపంచకప్ విజయం సమష్టి కృషిని ప్రతిబింబిస్తోంది. 

 ప్రధాని మోదీ