గ్రాండ్‌మాస్టర్స్ శిక్షణ శిబిరం షురూ
హైదరాబాద్ సిటీబ్యూరో, మే 3 (విజయక్రాంతి): మెరికల్లాంటి ఆటగాళ్లను తీర్చిదిద్దేం దుకు ఇండియన్ చెస్ మాస్టర్స్, ఏకాగ్ర చెస్ అకాడమీ వారు చేస్తున్న కృషి అభినందనీయమని రత్నగిరి ఫౌండేషన్ వైస్ చైర్మన్ అరుణ్ జూపల్లి అన్నారు. శుక్రవారం హైదరాబాద్ లోని బేగంపేట్‌లో ఇండియన్ చెస్ మాస్టర్స్ కోచింగ్ సెంటర్‌లో వర్ధమాన క్రీడాకారుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక శిబిరాన్ని గ్రాండ్‌మాస్టర్ దీపా చక్రవర్తితో కలిసి అరుణ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు కూడా అవసరమన్నారు. క్రీడల వల్ల శారీరక దారుఢ్యంతో పాటు మానసిక వికాసం కలుగుతుందని చెప్పారు. చిన్న వయసులోనే చదరంగంలో పిల్లలకు మెళకువలు నేర్పితే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో విజయాలు సాధిస్తారని దీపాచక్రవర్తి అన్నారు. ఈ నెల 12 వరకు క్యాంపు ఉంటుందని చెప్పారు.






