4 July, 2026 | 2:34 AM

క్యూ1లో 7.5 శాతం వృద్ధి

22-05-2024 01:20 AM

రిజర్వ్‌బ్యాంక్ బులెటిన్ అంచనా

ముంబై, మే 21: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం క్యూ1లో (ఏప్రిల్ ) దేశ జీడీపీ 7.5 శాతం వృద్ధి చెందవచ్చని రిజర్వ్‌బ్యాంక్ మంగళవారం విడుదల చేసిన బులెటిన్‌లో అంచనా వేసింది. గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ పెరగడం, ఆహారేతర ఉత్పత్తుల కొనుగోళ్లు ఊపందుకుంటున్నందున ఆర్థిక వ్యవస్థ వృద్ధిచెందుతుందని తెలిపింది. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల కారణంగా సరఫరా అడ్డంకులు ఏర్పడినప్పటికీ, భారత ఆర్థిక వ్యవస్థ నిలదొక్కుకుందని ఆర్బీఐ మే నెల బులెటిన్‌లో వివరించింది. ఎకనామిక్ యాక్టివిటీ ఇండెక్స్ ప్రకారం ఏప్రిల్ నెలలో ఆర్థిక వ్యవస్థ ఊపందుకున్నదని, దీనితో 2024 క్యూ1లో 7.5 శాతం వృద్ధి రేటు నమోదు కావొచ్చన్న ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ మైఖల్ దేబబ్రత పాత్ర నేతృత్వంలోని బృందం ఆర్థిక వ్యవస్థపై ఈ అంచనాల్ని వెల్లడించింది. 2024 జనవరి మార్చి త్రైమాసిక జీడీపీ గణాంకాలు, 2023 ఆర్థిక సంవత్సరపు ప్రొవిజినల్ అంచనాల్ని, తలసరి ఆదాయాన్ని మే 31న కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తుంది. 2023 ఆర్థిక సంవత్సరం జూన్ త్రైమాసికంలో 8.2 శాతం, సెప్టెంబర్ క్వార్టర్లో 8.1 శాతం, డిసెంబర్ త్రైమాసికంలో 8.4 శాతం చొప్పున భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధిచెందింది. 

గ్రామాల్లో అధికంగా పెరిగిన ఎఫ్‌ఎంసీజీ అమ్మకాలు

గత రెండేండ్లలో తొలిసారిగా ఈ ఏప్రిల్ నెలలో ఫాస్ట్ మూవింగ్ కన్జూమర్ గూడ్స్ (ఎఫ్‌ఎంసీజీ)కి గ్రామాల్లో డిమాండ్ పట్టణాల్ని అధిగమించిందన్నది. మొత్తంగా ఎఫ్‌ఎంసీజీ అమ్మకాల పరిమాణం 6.5 శాతం వృద్ధిచెందగా, గ్రామాల్లో ఈ వృద్ధి 7.6 శాతం, పట్టణాల్లో 5.7 శాతం ఉన్నదని వివరించింది. 2024 ఏప్రిల్ నెలలో టోల్ వసూళ్లు 8.6 శాతం పెరిగాయని, ఆటోమొబైల్స్ అమ్మకాలు 25.4 శాతం వృద్ధిచెందాయని, పాసింజర్ వాహనాలు రికార్డు నెలవారీ అమ్మకాల్ని నమోదు చేశాయని, ఈ గణాంకాలు ఎకానమీ జోరుకు సంకేతమని ఆర్బీఐ పేర్కొంది. ఇప్పటివరకూ లిస్టెడ్ కంపెనీలు వెల్లడించిన ఫలితాల ప్రకారం 2024 జనవరి త్రైమాసికంలో రికార్డుస్థాయి త్రైమాసిక ఆదాయాం నమోదైనట్టు ఆర్బీఐ తెలిపింది.

ఏడాది కనిష్ఠానికి జీడీపీ వృద్ధి రేటు! 

ఇక్రా అంచనా

భారత ఆర్థికాభివృద్ధి రేటు 2023 జనవరి నాలుగో త్రైమాసికంలో ఏడాది కనిష్ఠస్థాయికి తగ్గుతుందని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనా వేసింది. వ్యవసాయ రంగం వృద్ధి మందగించనున్న కారణంగా క్యూ4లో జీడీపీ వృద్ధి రేటు 6.7 శాతమే ఉంటుందని ఇక్రా మంగళవారం విడుదల చేసిన అంచనాల్లో పేర్కొంది.  క్యూ4 జీడీపీ వృద్ధి అధికారిక అంచనాలు మే 31న వెలువడనున్నాయి. 2024 ఆర్థిక సంవత్సరం క్యూ3లో 8.4 శాతం వృద్ధి నమోదయ్యింది. అయితే ముగిసిన మార్చి త్రైమాసికంలో వ్యవసాయ రం గం గ్రాస్ వాల్యూ యాడెడ్ (జీవీఏ) వృద్ధి వరుసగా రెండో దఫా తగ్గుతుందని, గోధు మ మినహా మిగిలిన రబీ పంటల దిగుబడి తగ్గడం ఇందుకు కారణమని వివరించింది. నాలుగో త్రైమాసికంలో జీవీఏ మొత్తంగా అంతక్రితం త్రైమాసికంతో పోలిస్తే 6.5 శాతం నుంచి 5.7 శాతానికి క్షీణిస్తుందన్నది. పారిశ్రామిక రంగం జీవీఏ 10.4 శాతం నుంచి 7.9 శాతానికి, సర్వీసుల రంగం జీవీ ఏ 7 శాతం నుంచి 6.2 శాతానికి తగ్గుతుందని ఇక్రా అంచనా వేసింది. జీడీపీ, జీవీఏ వృద్ధి మధ్య వ్యత్యాసం 185 బేసిస్ పాయిం ట్ల నుంచి 100 బేసిస్ పాయింట్లకు తగ్గుతుందని పేర్కొంది. నికర పన్నుల వసూళ్ల లో వృద్ధి మందగించడం జీడీపీ మధ్య వ్యత్యాసం తగ్గుదలకు దారితీస్తుందని వివరించింది. 2023 పూర్తి ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధి 7.8 శాతం, జీవీఏ వృద్ధి 7 శాతం చొప్పున నమోదవుతాయని ఇక్రా అంచనాల్లో పేర్కొంది.