calender_icon.png 18 September, 2025 | 1:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

664 బిలియన్ డాలర్లకు భారత్ విదేశీ రుణాలు

26-06-2024 12:12:20 AM

న్యూఢిల్లీ, జూన్ 25: భారత్ విదేశీ రుణాలు 2024 మార్చినాటికి 663.8 బిలియన్ డాలర్లకు పెరిగినట్టు రిజర్వ్‌బ్యాంక్ మంగళవారం వెల్లడించింది. గత ఏడాదికంటే 39.7 బిలియన్ డాలర్ల మేర అధికమయ్యిందని పేర్కొంది. కరెన్సీ విలువల్ని పరిగణనలోకి తీసుకుంటే ఈ పెరుగుదల 48.4 బిలియన్ డాలర్లని పేర్కొంది. విదేశీ రుణం పెరిగినప్పటికీ, డెట్ టూ జీడీపీ రేషియో 19 శాతం నుంచి 18.7 శాతానికి తగ్గిందని పేర్కొంది. విదేశీ రుణంలో ప్రభుత్వ, ప్రభుత్వేతర రుణాలు కలిసి ఉంటాయి. రిజర్వ్‌బ్యాంక్ తాజా గణాంకాల ప్రకారం ప్రభుత్వ విదేశీ రుణం జీడీపీలో 4.2 శాతంకాగా, ప్రభుత్వేతర రుణాలు (కార్పొరేట్లు, ఇతర ఏజెన్సీలు తీసుకునేవి) 14.5 శాతంగా ఉన్నాయి.

భారత్ విదేశీ రుణాల్లో అధికభాగం 53.8 శాతం డాలర్ల రూపంలో పొందినవే. రూపాయిల్లో పొందిన విదేశీ రుణాలు 31.5 శాతం వరకూ ఉన్నాయి. జపాన్ యెన్ రుణాలు 5.8 శాతం, ఎస్‌డీఆర్‌లు 5.4 శాతం, యూరో రుణాలు 2.8 శాతం ఉన్నాయని ఆర్బీఐ ప్రకటించింది. విదేశీ రుణాల్లో33.4 శాతం రుణ రూపంలో ఉండగా, 23.3 శాతం కరెన్సీ, డిపాజిట్ల రూపంలో ఉన్నాయి. ట్రేడ్ క్రెడిట్, అడ్వాన్సులు 17.9 శాతంకాగా, డెట్ సెక్యూరిటీల ద్వారా సమీకరించిన మొత్తం 17.3 శాతం ఉన్నది. ఒక ఏడాది తరువాత దీర్ఘకాలంలో మెచ్యూరిటీ అయ్యే రుణం 541.2 బిలియన్  డాలర్లని ఆర్బీఐ తెలిపింది.