calender_icon.png 25 December, 2025 | 3:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పండగపూట మున్సిపల్ కార్మికులు పస్తులా...?

25-12-2025 01:44:51 PM

సీఐటీయూ జిల్లా సహాయక కార్యదర్శి వెలిశాల కృష్ణమాచారి

కుమ్రం భీం ఆసిఫాబాద్(విజయక్రాంతి): కాగజ్‌నగర్ పట్టణ మున్సిపల్ కార్యాలయం ఎదుట మున్సిపల్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై సీఐటీయూ ఆధ్వర్యంలో నాలుగో రోజు కార్మికులు ఖాళీ ప్లేట్లతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా సహాయక కార్యదర్శి వెలిశాల కృష్ణమాచారి మాట్లాడుతూ కాగజ్‌నగర్ మున్సిపాలిటీలో పనిచేస్తున్న కార్మికులకు గత నాలుగు నెలలుగా వేతనాలు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. అలాగే బకాయిగా ఉన్న పీఎఫ్, ఈఎస్‌ఐ నిధులు సుమారు కోటి యాభై లక్షల రూపాయలు చెల్లించాలని జిల్లా కలెక్టర్‌, మున్సిపల్ కమిషనర్‌కు పలుమార్లు వినతిపత్రాలు ఇచ్చినప్పటికీ ఎలాంటి స్పందన లేకపోవడం దురదృష్టకరమన్నారు.

గత నాలుగు నెలలుగా వేతనాలు అందక మున్సిపల్ కార్మికులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, పనిచేసిన కాలానికి తగిన వేతనాలు చెల్లించాలంటూ ఆందోళన చేస్తే తప్ప అధికారుల నుంచి స్పందన రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే ప్రతినెల క్రమం తప్పకుండా వేతనాలు చెల్లించాలని ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా అధికారుల తీరు మారడం లేదని విమర్శించారు. కార్మికుల పెండింగ్ వేతనాలు తక్షణమే చెల్లించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో సమ్మెను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ యూనియన్ జిల్లా కార్యదర్శి శంకర్, మున్సిపల్ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ సంజీవ్, మల్లేశ్, రమేష్, ఈ. లక్ష్మి, ఈశ్వరమ్మ, దుర్గమ్మ, శోభ, ప్రియదర్శిని, తిరుపతి, బాపు, లక్ష్మణ్, మహేందర్, రాకేష్‌, మున్సిపల్ కార్మికులు  సంఖ్యలో పాల్గొన్నారు.