25-12-2025 01:47:18 PM
చైన మాంజా అమ్మిన, వినియోగించిన కఠిన చర్యలు
జిల్లా ఎస్పీ నితికా పంత్
కుమ్రంభీంఆసిఫాబాద్( విజయక్రాంతి): చైనీస్ మాంజా నైలాన్/సింథటిక్ దారంతో గాజుపొడి పూతతో తయారై ఉండటంవల్ల అత్యంత ప్రాణాంతకమని వాహనదారులు, పాదచారులు అప్రమత్తంగా ఉండాలి జిల్లా ఎస్పీ నితికా పంత్ తెలిపారు. ద్విచక్ర వాహనాలపై వేగంగా ప్రయాణిస్తున్న సమయంలో ఈ దారం మెడకు లేదా ముఖానికి తగిలితే తీవ్రమైన గాయాలు, రక్తస్రావం జరిగే ప్రమాదం ఉందన్నారు. దారం చాలా సన్నగా ఉండటంతో గాలిలో వేలాడుతున్నట్లు కనిపించదని పేర్కొన్నారు.
వాహనదారులు పూర్తిగా ముఖాన్ని కవర్ చేసే విండ్ షీల్డ్ ఉన్న హెల్మెట్ ధరించాలని, ఫ్లైఓవర్లు మరియు గాలిపటాలు ఎక్కువగా ఎగిరే ప్రాంతాల్లో వాహనాల వేగాన్ని తగ్గించాలని సూచించారు. చైనీస్ మాంజా అమ్మకం, వినియోగం చట్టరీత్యా నేరమని, పర్యావరణ పరిరక్షణ చట్టం , భారతీయ న్యాయసంహిత కింద భారీ జరిమానాతో పాటు ఏడేళ్ల వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉందని హెచ్చరించారు. చైనీస్ మాంజా అమ్మకం లేదా రవాణా సంబంధిత సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు నేరుగా లేదా డయల్ 100 ద్వారా తెలియజేయాలని జిల్లా ప్రజలను కోరారు.