బంగ్లాపై భారత్ విజయం

01-05-2024 01:20:17 AM

సిల్హెట్: బౌలర్ల సమష్టి కృషికి.. హేమలత మెరుపులు తోడవడంతో బంగ్లాదేశ్‌పై మరోసారి భారత మహిళల జట్టుదే పైచేయి అయింది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా మంగళవారం జరిగిన రెండో టీ20లో భారత్ డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో 19 పరుగుల తేడాతో విజయం సాధించింది. తద్వారా సిరీస్‌లో 2 ఆధిక్యంలోకి వెళ్లింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్  మహిళల జట్టు.. 20 ఓవర్లలో 119 పరుగులకు ఆలౌటైంది. ముర్షిదా ఖాతూన్ (49 బంతుల్లో 46; 5 ఫోర్లు) టాప్ స్కోర. భారత బౌలర్లలో రాధా యాదవ్ 3 వికెట్లు పడగొట్టగా.. దీప్తి శర్మ, శ్రేయాంక పాటిల్ చెరో రెండు వికెట్లు తీశారు.

అనంతరం 120 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన మహిళల జట్టు వర్షం పడే సమయానికి 5.2 ఓవర్లలో వికెట్ నష్టానికి 47 పరుగులు చేసింది. దయాలన్ హేమలత (24 బంతుల్లో 41 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడింది. డక్‌వర్త్ లూయిస్ ప్రకారం ఐదు ఓవర్లు ముగిసేసమయానికి భారత్ 28 పరుగులు చేయాల్సి ఉంది. అప్పటికే 19 పరుగులు ముందంజలో ఉండడంతో భారత్ విజయం సాధించినట్లు అంపైర్లు ప్రకటించారు. దయాలన్ హేమలత ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికైంది. టోర్నీలో భాగంగా ఇరుజట్ల మధ్య మూడో టీ20 గురువారం జరగనుంది.