5 August, 2026 | 1:54 AM

భారత్ మెరుపులు

05-08-2026 12:00 AM

కామన్‌వెల్త్‌గేమ్స్‌లో ఆటలు తగ్గినా మన ఆట తగ్గలేదని భారత అథ్లెట్లు మరోసారి నిరూపించారు. గ్లాస్గో వేదికగా జరిగిన ఈ క్రీడాసంబరంలో భారత్ 39 పతకాలతో మెరిసింది. 2022 బర్మింగ్‌హామ్ గేమ్స్‌తో పోలిస్తే పతకాల సంఖ్య తగ్గినా మన క్రీడాకారుల ప్రదర్శన అత్యుత్తమమైనదిగానే చెప్పాలి. ఎందుకంటే ఈ సారి చాలా క్రీడాంశాలను తొలగించారు. భారత్‌కు ప్రతీసారీ ఖచ్చితంగా పతకాలు వచ్చే రెజ్లింగ్, షూటింగ్, స్కాష్, టెన్నిస్, క్రికెట్, టేబుల్ టెన్నిస్, రగ్బీ వంటి క్రీడాంశాలు ఈ సారి లేవు. నిధుల కొరతతో తక్కువ బడ్జెట్‌లో గేమ్స్ నిర్వహించడంతో ఈ సారి క్రీడాంశాలను పదికే పరిమితం చేశారు. అయితే భారత అథ్లెట్లు మాత్రం అంచనాలకు తగ్గట్టే రాణించారు.

ముఖ్యంగా మహిళా అథ్లెట్లు అద్భుత ప్రదర్శనతో అదరగొట్టారు. కొన్నేళ్లుగా క్రీడారంగంలో భారత మహిళా శక్తి ప్రపంచానికి తెలుస్తూనే ఉంది. తాజాగా గ్లాస్గోలో మరోసారి అది రుజువైంది. బాక్సింగ్‌లో ఏడు స్వర్ణాలు వస్తే అందులో ఐదు మహిళా బాక్సర్లు గెలిచినవే. ప్రీతి పవార్, జాస్మిన్ లంబోరియా, సాక్షి చౌదరి, ప్రియ గంగాస్, అరుంధతి చౌదరి పసిడి పంచ్‌లు విరిసారు. అలాగే పురుషుల విభాగంలో సచిన్ సివాచ్, అంకుశ్ పంగల్ సైతం బంగారు పతకాలు గెలిచారు.

వెయిట్‌లిఫ్టింగ్‌లో మీరాబాయి చాను, జూడోలో అస్మితదే, హర్షసింగ్, పారా అథ్లెటిక్స్‌లో షర్మిల ధనకర్, పుషుల షాట్‌పుట్‌లో సోమన్ రాణా స్వర్ణాలు సాధించారు. ఈ సారి పతకాలు గెలిచిన చాలా మంది క్రీడాకారుల నేపథ్యంలో స్ఫూర్తిదాయకమైనవిగా చెప్పాలి. రైతు కుమారుడు యశ్వీర్ సింగ్ జావెలిన్ త్రోలో సత్తా చాటితే, పారా అథ్లెటిక్స్‌లో నిరుపేద గిరిజన యువకుడు దిలీప్ గవిత్ స్వర్ణం సాధించాడు. కుడి చేయి లేని బాసి ల్ సైతం రజతం గెలిచాడు. పోలియో కాటేసినా అద్భుత ప్రతిభతో పారా పవర్‌లిఫ్టింగ్‌లో ఝండూ కుమార్, బిడ్డకు జన్మనిచ్చినా డిస్కస్ త్రోలో సీమా వంటి అథ్లెట్లు భారత త్రివర్ణ పతాకాన్ని తమ ప్రతిభతో అంతర్జాతీయ వేదికపై రెపరెపలాడించారు.

2010 కామన్‌వెల్త్ గేమ్స్‌లో సెంచరీ కొట్టిన భారత్ తర్వాత ప్రతీ ఎడిషన్‌లో 60కి పైగా పతకాలు గెలుస్తూ టాప్ 5లో నిలుస్తూ వస్తోంది. 2014లో గ్లాస్గో వేదికగానే 64, 2018 గోల్డ్ కోస్ట్‌లో 66 పతకాలు సాధించిన భారత బృందం 2022 బర్మింగ్‌హామ్‌లో 60 పతకాలు గెలిచింది. ఇప్పుడు తక్కువ క్రీడాంశాల్లోనే 39 మెడల్స్‌తో నాలుగో స్థానం తో ముగించింది. వచ్చే కామన్‌వెల్త్ గేమ్స్ అహ్మదాబాద్ ఆతిథ్యమివ్వనున్న నేపథ్యంలో పతకాల వేటలో సెంచరీ కొట్టే అవకాశముంది.