మధ్యాహ్న భోజన కార్మికుల వెతలు తీరేదెప్పుడు?
పాఠశాలల్లో విద్యార్థుల కడుపు నింపే మధ్యాహ్న భోజన ఏజెన్సీ నిర్వాహకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోజురోజుకూ నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ప్రభుత్వం చెల్లిస్తున్న బిల్లులు పెరిగిన ధరలకు ఏమాత్రం సరిపోవడం లేదు. దీంతో పాఠశాలల్లో వంట చేయడం తీవ్ర ఆర్థిక భారంగా మారుతోందని ఏజెన్సీ నిర్వాహకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలనే ఉద్దేశంతో పనిచేస్తున్నప్పటికీ, ప్రభుత్వం ఇచ్చే బిల్లులు ప్రస్తుత మార్కెట్ ధరలతో పొంతన లేకుండా ఉన్నాయి.
పశ్చిమాసియా ఉద్రిక్తతల ప్రభావంతో ఇంధన ధరలు, రవాణా ఛార్జీలు విపరీతంగా పెరిగాయి. దీనికితోడు వాతావరణ పరిస్థితుల వల్ల కూరగాయల దిగుబడి బాగా తగ్గింది. బయట మార్కెట్లో టమాటో, బెండకాయ, బీన్స్, క్యారెట్, ఆకుకూరల ధరలు మండిపోతున్నాయి. పప్పులు, వంటనూనె, కారం, పసుపు, మసాలా దినుసుల ధరలు సైతం పెరిగాయి. గ్యాస్ సిలిండర్ ధర పెరుగుదల ఏజెన్సీల నిర్వహణను మరింత కష్టతరం చేస్తోంది. ఇటీవలి కాలంలో కోడిగుడ్ల ధరలూ పెరిగాయి.
బహిరంగ మార్కెట్‌లో ఒక్కో కోడిగుడ్డు ధర రూ.8 నుంచి రూ.9 వరకు పలుకుతోంది. ప్రభుత్వం మాత్రం ఒక్కో గుడ్డుకు కేవలం రూ.6 మాత్రమే చెల్లిస్తోంది. పిల్లలకు పెద్ద సైజు కోడిగుడ్డు అందించాల్సి రావడంతో ప్రతి గుడ్డుపై రూ.2 నుంచి రూ.3 వరకు నిర్వాహకులే సొంతంగా నష్టపోవాల్సి వస్తోంది. నిబంధనల ప్రకారం వారంలో వడు రోజులు కోడిగుడ్డు కచ్చితంగా వడ్డించాల్సి ఉండటంతో, ఈ అదనపు భారం ఏజెన్సీలపై పడుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వేల సంఖ్యలోని ప్రభుత్వ పాఠశాలల్లో పీఎం పోషణ్ పథకం కింద మధ్యాహ్న భోజన కార్యక్రమం నడుస్తోంది. ఇందులో కేంద్ర ప్రభు త్వం 60 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం నిధులను భరిస్తున్నాయి.
గ్రామాల్లో, పట్టణాల్లో వంట ఏజెన్సీలుగా పనిచేస్తున్న కార్మికులు రోజువారీ మెనూ ప్రకా రం వంటలు చేసి విద్యార్థులకు వడ్డిస్తున్నారు. ప్రభుత్వం ప్రస్తుతం రోజువారీ ఛార్జీల కింద 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ప్రతి విద్యార్థికి రూ.10.17 చెల్లిస్తోంది. ఉన్నత పాఠశాలల్లో 9, 10 తరగతుల విద్యార్థులకు రూ.13.17 మాత్రమే ఇస్తోంది. కుక్స్, హెల్పర్లకు పారితోషికంగా నెలకు రూ.3 వేలు చెల్లిస్తున్నారు.
పౌరసరఫరాల శాఖ పాఠశాలలకు ఉచితంగా సరఫరా చేసే సన్నబియ్యం మినహా మిగిలిన సరుకులన్నీ ఏజెన్సీలే సొంతంగా కొనుగోలు చేయాల్సి వస్తోంది. ప్రభుత్వం నిర్ణయించిన మెనూ ప్రకారం ప్రతిరోజూ పప్పులు, సాంబారు, కూరగాయలు, ఆకుకూరలతోపాటు చిక్కీలు వంటి పోషకాహారాన్ని విద్యార్థులకు వడ్డించాలి. నిత్యావసరాల ధరలు పెరిగినప్పటికీ ఆహార నాణ్యతలో రాజీ పడకూడదని నిర్వాహకులు ప్రయత్నిస్తున్నా రు.
ప్రభుత్వం ఇచ్చే అరకొర బిల్లులు చాలక, ప్రతి నెలా బయట వడ్డీలకు అప్పులు చేసి భోజనం పెట్టాల్సిన దుస్థితి ఏర్పడిందని వారు వాపోతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద, మధ్యతరగతి విద్యార్థులకు పౌష్టికాహారం దక్కాలంటే ప్రభుత్వం వెంటనే స్పందించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం ప్రస్తుత వంట ఛార్జీలను పునఃసమీక్షించాలి. పెరిగిన ధరలకు అనుగుణంగా ప్రతి విద్యార్థికి మెస్ ఛార్జీని రూ.25గా నిర్ణయించాలి.
ప్రతి నెలా ఆర్థిక భారంగా మారిన కోడిగుడ్లు, వంటగ్యాస్‌ను ప్రభుత్వమే నేరుగా పాఠశాలలకు సరఫరా చేయాలి. ఈ సమస్యల పరిష్కారం కోసం వంట ఏజెన్సీ సంఘాలు జిల్లాల వారీగా కలెక్టర్లకు, విద్యాశాఖ అధికారులకు వినతిపత్రాలు సమర్పిస్తున్నాయి. ధర్నాలు, ఆందోళన బాట పడుతున్నాయి. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి మధ్యాహ్న భోజన కార్మికుల వెతలను తీర్చాల్సి ఉంది.
వ్యాసకర్త సెల్: 9848445134






