20 August, 2026 | 2:18 AM

తొలి టెస్ట్ మనదే

20-08-2026 01:16 AM

గాలేలో భారత్ ఘన విజయం

లంకను తిప్పేసిన సుతార్

సిరీస్‌లో భారత్‌కు 1-0 ఆధిక్యం

పడిక్కల్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్

మొదట బ్యాటింగ్‌లో అదరగొట్టి, తర్వాత బౌలింగ్‌తో లంకను బెదరగొట్టినా వర్షం రోజూ అడ్డుపడి టెన్షన్ పెట్టింది. అయితే చివరి రోజు భారత బౌలర్లు వరుణుడికి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా, లంక ఇన్నింగ్స్ ముగించారు. ఫలితంగా గాలే టెస్టులో ఘన విజయం సాధించిన టీమిండియా సిరీస్ లో 1-0 ఆధిక్యాన్ని అందుకుంది. యువ స్పిన్నర్ మానవ్ సుతార్ 10 వికెట్లతో ఈ విజయంలో కీలక పాత్ర పోషించాడు.

గాలే , ఆగస్టు 19: 84/4 ఓవ్నట్ స్కోర్‌తో ఆఖరి రోజు ఆటను కొనసాగించిన శ్రీలంక తొలి సెషన్‌లో పోరాడింది. డిసిల్వా, సోనాల్ దినుషా భారత బౌలర్ల సహనాన్ని పరీక్షించినా.. జడేజా ఈ జోడీని విడదీసి ఐదో విట్‌కు నమోదైన 95 పరుగుల భాగస్వామ్యానికి తెరదించాడు. కేశర నువాంతతో కలిసి సోనాల్ దినుషా పోరాడినా.. మానవ్ సుతార్ దెబ్బతీసాడు.

వరుస బంతుల్లో సోనాల్ దినుషా, ప్రబాత్ జయసూర్యను పెవిలియన్ చేర్చాడు. ధనంజయ డిసిల్వా (151 బంతుల్లో 7 ఫోర్లతో 59), సోనాల్ దినుషా (129 బంతుల్లో 8 ఫోర్లు, సిక్సులతో 84) హాఫ్ సెంచరీలతో రాణించగా.. మిగతా బ్యాటర్లు విఫలమయ్యా రు. చివర్లో సుతార్ లాహిరు కుమార, కేశర నువాంతలను ఔట్ చేసి భారత్ విజయలాంఛనాన్ని పూర్తి చేశాడు. దీంతో భారత్ 165 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. యువ స్పిన్నర్ మానవ్ సుతార్(6/55, 4/76)10 వికెట్లతో భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఇన్నిం గ్స్‌లో 462 పరుగులకు ఆలౌట్ అయింది. దేవదత్ పడిక్కల్ (167) సెంచరీతో రాణించగా.. కేఎల్ రాహుల్ (82) శతకాన్ని చేజార్చుకున్నాడు. ధ్రువ్ జురెల్(51) హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు. లంక బౌలర్లలో ప్రభాత్ జయసూర్య (4/109) నాలుగు వికెట్లు తీయగా.. కేశర నువాంత (3/175) మూడు వికెట్లు పడగొట్టాడు. అసితా ఫెర్నాండో (2/63) రెండు వికెట్లు తీసాడు. అనంతరం శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 79.4 ఓవర్లలో 284 పరుగులకు కుప్పకూలింది. సో నాల్ దినుషా (100) సెంచరీతో చెలరేగగా.. నిరోషన్ డిక్వెల్లా (80) హాఫ్ సెంచరీతో రాణించాడు. మానవ్ సుతార్ (4/76), రవీంద్ర జడేజా (3/57) లంక బ్యాటింగ్‌ను దెబ్బ తీశారు.

భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 48.5 ఓవర్లలో 193 పరుగులకు ఆలౌటైంది. రిషభ్ పంత్ (66) హాఫ్ సెంచరీతో సత్తా చాటగా.. దేవదత్ పడిక్కల్ (44) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. శ్రీలంక బౌలర్లలో అసితా ఫెర్నాండో (4/31) నాలుగు వికెట్లు తీయగా.. ప్రబాత్ జయసూర్య (3/43) మూడు వికెట్లు పడగొట్టాడు. కేశర నువాంత ఒక వికెట్ తీయగా.. లాహిరు కుమార్ 2 వికెట్లు పడగొట్టాడు. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 178 పరుగల భారీ ఆధిక్యం సాధించడంతో శ్రీలంక ముందు 372 పరుగుల భారీ లక్ష్యం నమోదైంది. నాలుగో రోజు చివరి సెషన్ లోనే భారత్ లంక టాపార్డర్‌ను పెవిలియన్‌కు పంపారు. చివరి రోజు లంక కాసేపు పోరాడినా మానవ్ సుతార్ స్పిన్ మ్యాజిక్‌కు రెండో సెషన్‌లో చేతులెత్తేసింది.

స్కోరు బోర్డు 

భారత్ తొలి ఇన్నింగ్స్ : 462 ఆలౌట్ (దేవదత్ పడిక్కల్ 167, కేఎల్ రాహుల్ 82, ప్రబాత్ జయసూర్య 4/109)

శ్రీలంక తొలి ఇన్నింగ్స్ : 284 ఆలౌట్ (సొనాల్ దినుషా 100, నిరోషణ్ డిక్వెల్లా 80 ; సుతార్ 4/76, జడేజా 3/57 )

భారత్ రెండో ఇన్నింగ్స్ : 193 ఆలౌట్(రిషభ్ పంత్ 66, దేవదత్ పడిక్కల్ 44 :  ఫెర్నాండో 4/31)

శ్రీలంక రెండో ఇన్నింగ్స్ :  206 ఆలౌట్ (ధనంజయ డిసిల్వా 59, సోనా ల్ దినుషా 84, సుతార్ 6/55 )