18 April, 2026 | 3:54 PM

Breaking News

ఇందిరా మహిళా శక్తి భవనాలు పూర్తి చేయాలి

10-06-2025 12:29 AM
  1. పెట్రోల్ పంప్ ఏర్పాటుకు అనువైన స్థలాలను వెంటనే ఎంపిక చేయాలి
  2. సోలార్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు అనువైన భూములను 10 రోజుల్లో గుర్తించాలి
  3. జూన్ 12న పండగ వాతావరణంలో పాఠశాలల పున:ప్రారంభం చేయాలి.
  4. బడి బాట,ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన మంత్రి సీతక్క

ములుగు, జూన్9 (విజయక్రాంతి): నవంబర్ నాటికి జిల్లాలో చేపట్టిన నూతన ఇందిరా మహిళా శక్తి భవనాలు పూర్తి చేయాలని  రాష్ట్ర పంచాయతీ రాజ్,గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా,  మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు దనసరి అనసూయ సీతక్క అన్నారు.

సోమవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా,  మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు దనసరి అనసూయ సీతక్క,సి.ఎస్ కే. రామ కృష్ణా రావులతో కలిసి బడి బాట,ఇందిరా మహిళా శక్తి కార్యక్రమాలపై జిల్లా కలెక్టర్‌లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.  ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాలు నుంచి పాల్గొన్నారు.

మంత్రి వర్యులు ధనసరి అనసూయ సీతక్క మాట్లాడుతూ, మహిళా శక్తి భవనాలకు ముఖ్యమంత్రి చేతుల మీదుగా గత నవంబర్ మాసంలో శంకుస్థాపన చేసుకున్నామని, చాలా జిల్లాల్లో వీటి పురోగతి ఆశించిన స్థాయిలో లేదని అన్నారు.  పంచాయతీరాజ్ శాఖ ఇంజనీర్ల సమన్వయం చేసుకుంటూ నిర్దేశించుకున్న గడువు లోపు పనులు పూర్తయ్యేలా చూడాలని అన్నారు.

మహిళా సంఘాల ద్వారా ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలకు ఏకరూప దుస్తులు కుట్టు పనులు వేగంగా జరిగాయని, దీనికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి మంత్రి ధన్యవాదాలు తెలిపారు. జూన్ 12న పాఠశాలలో పునః ప్రారంభోత్సవం సందర్భంగా పండగ వాతావరణంలో పిల్లలకు ఏకరూప దుస్తులు, పాఠ్యపుస్తకాలు పంపిణీ చేయాలని మంత్రి ఆదేశించారు.  ప్రభుత్వ పాఠశాలల పునః ప్రారంభోత్సవం సందర్భంగా పారిశుధ్య నిర్వహణకు అధిక ప్రాధాన్యత కల్పించాలని అన్నారు.

పాఠశాల పరిసరాలను పరిశుభ్రం చేయాలని,వర్షపు నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని అన్నారు.అంగన్వాడీలను బలోపేతం చేయాలని, పండుగ వాతావరణంలో ఈ విద్యా సంవత్సరంలో అంగన్వాడీలను ప్రారంభించాలని అన్నారు. తల్లిదండ్రులను ఆహ్వానిం చాలని తెలిపారు. వర్షాకాలం వల్ల కూలిపోయే స్థితిలో ఉన్న కేంద్రాలను తక్షణమే వేరొక చోటికి  మార్చాలని ఆదేశించారు.

అన్ని అంగన్వాడీలలో మౌలిక వసతులు కల్పించాలని,రాష్ట్రంలో త్వరలో 1000 అంగన్వాడీ కేంద్రాలకు సొంత భవనాలు నిర్మించనున్నామని అన్నారు.కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయాలని లక్ష్యం తో సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో అనేక కార్యక్రమాలు చేపట్టామని ఇందులో భాగం గా మహిళా సంఘాల ద్వారా పెట్రోల్ పంప్ లను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. 

జిల్లాలలో పెట్రోల్ పంప్ ఏర్పాటు కు అనువైన స్థలాలను ఎంపిక చేయాలని, ఒక పెట్రో ల్ పంప్ ఏర్పాటు వల్ల 10 కుటుంబాలు బాగు పడతాయని మంత్రి అధికారు లను ఆదేశించారు. మహిళా సంఘాల ద్వారా రైస్ మిల్స్, సోలార్ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ల స్థాపన, ఆర్టీసీ కు అద్దె బస్సులు నడపడం వంటి అనేక కార్యక్రమాల అమలుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.

గ్రామీణ ప్రాంతాలు, గిరిజన ప్రాంతాల్లో మహిళలకు అవగాహన కల్పిస్తూ నూతన మహిళ సంఘాలను ఏర్పాటు చేయాలని, పేదరికం అధికంగా ఉండే ప్రాంతాలలో అవగాహన కల్పిస్తూ మహిళా గ్రూపుల వల్ల కలిగే ఉపయోగాలపై అవగాహన కల్పించాలని అన్నారు. ప్రతి జిల్లాలో మహిళా సంఘాల ద్వారా విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు కోసం సబ్ స్టేషన్ పరిధిలో 8 ఎకరాల అనువైన భూమి 10 రోజుల్లో గుర్తించాలని అన్నారు.

10వ తరగతి ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు తప్పనిసరిగా పై చదువులు చదివేలా జిల్లా కలెక్టర్లు ప్రత్యేక చోరువ చూపాలని సీఎస్ సూచించారు. పాఠశాలలు ప్రారంభించిన మొదటి రోజే పాఠ్య పుస్తకాలు, ఏక రూప దుస్తుల పిల్లలకు పంపిణీ చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అన్నారు.

బడి బాట కార్యక్రమం ద్వారా ఇంటింటికి వెళ్ళి ప్రభుత్వ పాఠశాలలో కల్పిస్తున్న సదుపాయాలు, ఏఐ టూల్స్ ద్వారా అందిస్తున్న ప్రాథమిక విద్య, డిజిటల్ తరగతులు, పాఠశాలల్లో వచ్చిన మార్పులను వివరిస్తూ ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్స్ పెంచాలని అన్నారు. స్వశక్తి మహిళా సంఘాలతో ప్రత్యేక సమావేశంలో నిర్వహించే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు గురించి చర్చించాలని అన్నారు.

ప్రభుత్వ పాఠశాలల్లో 20 లక్షలపైగా విద్యార్థులు చదువుతున్నారని,పిల్లలు ఏం నేర్చుకుంటున్నారు బడులలో అనే అంశం పట్ల మనం మరింత మెరుగ్గుపర్చుకోవాల్సి ఉంటుందని అన్నారు. తొలిమెట్టు కార్యక్రమం మరింత సమర్థవంతంగా అమలు చేయాలని, దీనిపై కలెక్టరులు ప్రత్యేక శ్రద్ధ వహించి రెగ్యులర్ గా తనిఖీలు చేయాలని సీఎస్ ఆదేశించారు.

2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణను రూపొందించాలని పెట్టుకున్న లక్ష్యం నెరవేరాలంటే మహిళల ను భాగస్వామ్యం చేయడం చాలా కీలకమని సీఎస్ పేర్కోన్నారు.  ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం క్రింద వివిధ వాణిజ్య వ్యాపార యూనిట్ల మహిళలచే గ్రౌండింగ్ చేయాల్సి ఉంటుందని అన్నారు ప్రభుత్వ పాఠశాలల ఏకరూప దుస్తులు కుట్టిన మహిళలందరికి కుట్టు కూలీ 75 రూపాయల ప్రభుత్వం విడుదల చేసిందని, ఈ నిధులను సంబంధిత మహిళలకు త్వరగా చేరేలా చూడాలని అన్నారు.

110 కోట్ల రూపాయలతో 22 నూతన జిల్లాలో ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి భవనాలను నిర్మిస్తుందని, వీటిలో ప్రభుత్వం 19 కోట్ల రూపాయల విడుదల చేసిందని, కలెక్టర్ స్థానిక పంచాయతీ రాజ్ శాఖ అధికారులతో రివ్యూ నిర్వహించి పనులు వేగవంతం చేయాలని, నవంబర్ 19 నాటికి ఇందిరా మహిళా శక్తి భవనాల నిర్మాణం పూర్తి కావాలన్నారు.

వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్., మాట్లాడుతూ జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఏకరూప దుస్తుల కుట్టు పనులు చివరి దశకు చేరుకున్నాయని తెలిపారు. పెండింగ్ లో ఉన్న కుట్టు పనులు వేగంగా పూర్తవుతున్నాయని అన్నారు. నవంబర్ నాటికి ఇందిరా మహిళా శక్తి భవన నిర్మాణం పూర్తి చేయుటకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు సంపత్ రావు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.