2 July, 2026 | 2:39 AM

గుడిసెవాసులకు ఇందిరమ్మ ఇండ్లు నిర్మించాలి

02-07-2026 01:53 AM

సీపీఐ డిమాండ్

ఇబ్రహీంపట్నం, జూలై 1 (విజయక్రాంతి): నిరుపేద గుడిసెవాసులకు ఇళ్ల పట్టాలిచ్చి, పక్కా ఇళ్లను నిర్మించి ఇవ్వాలని సీపీఐ నియోజకవర్గ ఇంచార్జి ముత్యాల యాదిరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కుంట్లూరు రెవెన్యూ భూదాన్ భూముల్లో (సర్వే నం. 215224) నాలుగేళ్లుగా వందలాది పేద కుటుంబాలు కరెంట్, నీరు లేకపోయినా గుడిసెలు వేసుకుని జీవిస్తున్నాయని, ఆర్‌ఎన్‌ఆర్ కాలనీ ఫేజ్-3 వాసులతో సహా వీరందరికీ ఇందిరమ్మ ఇండ్లు నిర్మించాలని కోరారు.

2007లో రామోజీ ఫిల్మ్ సిటీ సర్వే నంబర్ 189, 203లలో 650 కుటుంబాలకు అప్పటి ప్రభుత్వం ఇళ్ల పట్టాలు ఇచ్చినా, ఇంతవరకు స్థలాన్ని (పొజిషన్) చూపించలేదని.. వెంటనే వారికి పొజిషన్ అప్పగించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఐ, సీపీఎం నేతలు ఆందోజు రవీంద్రా చారి, కావలి నర్సింహ, నీలమ్మ, కొంతం మాధవరెడ్డి, సామిల్, జంగయ్య తదితరులు పాల్గొన్నారు.