24 June, 2026 | 1:15 AM

మహిళల ఆత్మవిశ్వాసాన్ని ప్రతిబింబించేలా ఇందిరమ్మ చీరలు

24-06-2026 12:45 AM

ఎమ్మెల్యే నవీన్ యాదవ్

జూబ్లీహిల్స్, జూన్ 23 (విజయక్రాంతి): మహిళల ఆత్మవిశ్వాసాన్ని ప్రతిబింబించేలా ఇందిరమ్మ చీరలను ప్రభుత్వం రూపొందించిందని జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ అన్నారు. శ్రీనగర్ కాలనీ డివిజన్ పరిధిలోని శాలివాహన నగర్ కమ్యూనిటీ హాల్లో ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఇందిరా మహిళా శక్తి పథకం కింద నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య ఆహ్వానితులుగా హాజరయ్యారు. స్వయం సహాయక బృందాలకు చెందిన మహిళలకు చీరలను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళల గౌరవాన్ని ఇనుమడింపజేసేలా, సంస్కృతి వారసత్వాన్ని ప్రస్ఫుటించేలా చీరల డిజైన్లను ఆకర్షణీయమైన రంగుల్లో ప్రభుత్వం తయారు చేయించిందన్నారు. అంతేకాకుండా ఆకర్షణీయమైన రంగులు, అందమైన డిజైన్లతో అదనపు హంగులను జోడించిందని వివరించారు. మహిళా సంక్షేమం, ఆర్థిక స్వావలంబన, సాధికారతకు కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో డీసీలు ఉమా, సురేశ్, డీపీఓ మాలతి, సీఓ శ్రీనివాస్, వెంకట్, స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.