26 August, 2026 | 2:37 AM

సమయ పాలన పాటించని ప్రభుత్వ పశు వైద్యశాల అధికారులు,సిబ్బంది

25-08-2026 10:59 PM

పశువులతో వచ్చే రైతులకు తప్పని ఎదురుచూపులు

అధికారుల పర్యవేక్షణ కరువు

బాన్సువాడ,(విజయక్రాంతి): ప్రభుత్వ పశు వైద్యశాలలో నిర్ణయించిన సమయపాలన అమలు కావడం లేదనీ, అధికారులు సిబ్బంది ఇష్టం వచ్చినప్పుడు వస్తుంటారని వైద్యశాలకు వచ్చే రైతులకు ఎదురుచూపులు తప్పవని రైతులు వాపోతున్నారు. ఈ సంఘటన కామారెడ్డి జిల్లా బాన్సువాడ డివిజన్ కేంద్రంలోని ప్రభుత్వ పశువైద్యశాల అధికారుల సిబ్బంది తీరు.వైద్యశాల భవనంపై ఉదయం, మధ్యాహ్నం సేవలు అందించే సమయాలను స్పష్టంగా పేర్కొన్నప్పటికీ, ఆ సమయాలకు అనుగుణంగా వైద్య సిబ్బంది అందుబాటులో ఉండడం లేదని స్థానికులు వాపోతున్నారు.

మంగళవారం మధ్యాహ్నం రెండున్నర గంటల నుండి మూడు గంటల వరకు పశు వైద్యశాల మూసి ఉండడం గదులకు తాళాలు ఉండడం అధికారులు సిబ్బంది అందుబాటులో లేకపోవడం విజయ క్రాంతి తనకిలో బట్టబయలైంది. విజయ క్రాంతి తన కెమెరాలో తాళం వేసిన పశువైద్యశాల గదులను భవనాన్ని క్లిక్ మనిపించింది.పశువులకు అనారోగ్యం, అత్యవసర పరిస్థితులు ఎదురైనప్పుడు చికిత్స కోసం ప్రభుత్వ పశు వైద్యశాలను ఆశ్రయించే రైతులు, సిబ్బంది అందుబాటులో లేక ఇబ్బందులు పడుతున్నారని తెలుస్తోంది.

వైద్యశాలలో కార్యాలయ గది, మందుల నిల్వలు, ఫర్నిచర్ తదితరాలు ఉన్నప్పటికీ సేవల నిర్వహణపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.వైద్యశాల గోడపై పని వేళలను సూచించే వివరాలు ఉన్నప్పటికీ, వాటిని కచ్చితంగా పాటిస్తున్నారా లేదా అన్నది పరిశీలించాల్సిన అవసరం ఉంది. సంబంధిత ఉన్నతాధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించి సిబ్బంది హాజరు, వైద్య సేవల నిర్వహణ, మందుల లభ్యతపై సమగ్రంగా పరిశీలించాలని స్థానికులు కోరుతున్నారు. సమయాపాలన పాటించని అధికారులు సిబ్బందిపై విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.