24 June, 2026 | 1:15 AM

ఫీజురీయింబర్స్‌మెంట్ వెంటనే విడుదల చేయాలి

24-06-2026 12:44 AM

ఆర్పీఐ(ఏ) జాతీయ కార్యదర్శి పేరం శివ నాగేశ్వరరావు గౌడ్ డిమాండ్

ముషీరాబాద్, జూన్ 23 (విజయక్రాంతి): తెలంగాణలో పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, జీవో నంబర్ 8, 9లను రద్దు చేయాలని, పూర్తి స్థాయి విద్యాశాఖ మంత్రిని నియమించాలని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా(అథావాలే) జాతీయ కార్యదర్శి, తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ ఇన్చార్జ్ పేరం శివ నాగేశ్వరరావు గౌడ్ డిమాండ్ చేశారు. కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ సహాయ మంత్రి, ఆర్పీఐ(ఎ) జాతీయ అధ్యక్షుడు రాందాస్ అథావాలే ఆదేశాల మేరకు ఈ డిమాండ్లు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

రాష్ట్రంలో సుమారు14 లక్షల మంది విద్యార్థులకు రావలసిన రూ.7 వేల కోట్లకు పైగా ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను, మొత్తం రూ.10 వేల కోట్ల పెండింగ్ నిధులను వెంటనే విడుదల చేయాలని కోరారు. జీవో 8, 9లతో బీసీ విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆరోపించారు. అలాగే విద్యార్థులపై కేసులు నమోదు చేసేందుకు ఉపయోగిస్తున్న ఆర్‌ఆర్ యాక్ట్తో పాటు జీవో 8, 9లను రద్దు చేయాలని, విద్యాశాఖలో లోపాలను సరిదిద్దేందుకు సీఎం రేవంత్ రెడ్డి వెంటనే పూర్తి స్థాయి విద్యాశాఖ మంత్రిని నియమించాలని డిమాండ్ చేశారు.

రెండు మూడు రోజుల్లో ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయకపోతే ముఖ్యమంత్రి, మంత్రుల పర్యటనలను అడ్డుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆర్పీఐ(ఎ) రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రఘుపతి ముద్ర పీటర్ నాయుడు, కార్యదర్శి దాచారం శ్రీనివాస్, జాయింట్ సెక్రటరీ రాచమల్ల పోతురాజు, పార్టీ నాయకులు సుద్దాల అశోక్, కొండా జానయ్య గౌడ్, చంద్రశేఖర్, హరీష్ తదితరులు పాల్గొన్నారు.