calender_icon.png 2 December, 2025 | 7:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను ప్రారంభించాలి

02-12-2025 06:23:11 PM

జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే..

కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): నిరుపేదల సంక్షేమం కోసం ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పథకంలో లబ్ధిదారులకు కేటాయించిన ఇండ్ల నిర్మాణాలను 100 శాతం ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సమావేశం మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) దీపక్ తివారి, జిల్లా గృహ నిర్మాణ శాఖ అధికారి ప్రకాష్ రావులతో కలిసి కాగజ్ నగర్, ఆసిఫాబాద్ మున్సిపల్ పరిధిలో చేపట్టవలసిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలపై మున్సిపల్, గృహ నిర్మాణ, మున్సిపల్ వార్డు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మున్సిపాలిటీలలో మంజూరైన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను ప్రతి లబ్ధిదారులు ప్రారంభించేలా మున్సిపల్, గృహ నిర్మాణ, మున్సిపల్ వార్డు అధికారులు సమన్వయంతో పని చేయాలని తెలిపారు.

కాగజ్ నగర్ మున్సిపాలిటీకి 498 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయడం జరిగిందని, ఇప్పటివరకు 391 ఇండ్ల నిర్మాణ పనులు ప్రారంభించడం జరిగిందని, మిగిలిన 107 మంది లబ్ధిదారులు పనులు చేపట్టలేదని తెలిపారు. ఇందుకు గల కారణాలను తెలుసుకొని పనులు ప్రారంభించేందుకు మెప్మా క్రింద మహిళ సంఘాల నుండి రుణ సదుపాయం అందించేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఆసిఫాబాద్ మున్సిపాలిటీకి 458 ఇండ్లు మంజూరు కాగా ఇంకా 1505 ఇండ్లను ప్రారంభించలేదని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ప్రభుత్వం ఇసుకను ఉచితంగా అందిస్తుందని, ఈ నెల 20వ తేదీలోగా పూర్తి అయిన ఇండ్లకు ప్రారంభోత్సవాలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. అధికారులు సమన్వయంతో పనిచేసి పనులు ప్రారంభించని ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులతో మాట్లాడి త్వరగా పనులు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో గృహ నిర్మాణ శాఖ డి. ఈ. వేణుగోపాల్, ఆసిఫాబాద్, కాగజ్ నగర్ మున్సిపల్ కమిషనర్లు, గృహ నిర్మాణ శాఖ ఇంజనీరింగ్ అధికారులు, వార్డు అధికారులు పాల్గొన్నారు.