02-12-2025 06:21:15 PM
జిల్లా అదనపు కలెక్టర్, జిల్లా విద్యాధికారి దీపక్ తివారి..
కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): 2వ సాధారణ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు), జిల్లా విద్యాధికారి దీపక్ తివారి అన్నారు. మంగళవారం జిల్లాలోని దహేగాం మండలం కొత్మర్, దహేగాం గ్రామ పంచాయతీలు, పెంచికల్ పేట మండలంలో నామినేషన్ స్వీకరణ కేంద్రాలను సందర్శించి నామినేషన్ ప్రక్రియ పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ నామినేషన్ ప్రక్రియ నుండి ఎన్నికల ఫలితాలు ప్రకటించే వరకు ఎన్నికల నోటిఫికేషన్, నామినేషన్, నామినేషన్ల పరిశీలన, పోటీలో ఉండే అభ్యర్థుల తుది జాబితా, పోస్టల్ బ్యాలెట్ పంపిణీ, ఫోటో ఓటర్ స్లిప్పుల పంపిణీ, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్, పోలింగ్ కేంద్రాలలో ఏర్పాట్లు, ఓటింగ్ నిర్వహణ ప్రక్రియ, ఫలితాలు వంటి ప్రతి అంశంపై అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.
నామినేషన్ ప్రక్రియలో అభ్యర్థులు సమర్పించిన పత్రాలను ఎన్నికల సంఘం నిబంధనలకు లోబడి క్షుణ్ణంగా పరిశీలించాలని, నిర్ణీత గడువు దాటిన తర్వాత వచ్చే నామినేషన్లను తీసుకోకూడదని, రిజిస్టర్లను సక్రమంగా నిర్వహించాలని తెలిపారు. విధులు కేటాయించబడిన అధికారులు ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా ఎన్నికల ప్రక్రియ సజావుగా నిర్వహించాలని, ఎన్నికల ప్రవర్తన నియమావళి ఖచ్చితంగా పాటించాలని తెలిపారు. దహేగాం మండలంలో ఏర్పాటు చేసిన ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి ఎన్నికల సామాగ్రి నిల్వ, పంపిణీ ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.
దహేగాం మండలం బిబ్రా గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, పెంచికల్ పేట మండలం దరోగాపల్లి గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ను సందర్శించి విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలు, విద్యా బోధన తీరు, వంటశాల, మధ్యాహ్న భోజనం పథకం అమలు, ఆహారం నాణ్యత, పారిశుద్ధ్య నిర్వహణ అంశాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రభుత్వం విద్యార్థులకు సకల సదుపాయాలతో కూడిన నాణ్యమైన విద్యను అందించేందుకు చర్యలు తీసుకుంటుందని, విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఉన్నత స్థానాలకు ఎదగాలని తెలిపారు.
మధ్యాహ్న భోజనంలో మెనూ ప్రకారం సకాలంలో పౌష్టిక ఆహారం అందించి విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించడం జరుగుతుందని తెలిపారు. ఉపాధ్యాయులు విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో విద్యాబోధన చేయాలని, తరగతిలో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్, మండల పంచాయతీ అధికారులు, ఎన్నికల విభాగం అధికారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.