క్యూర్ పరిధిలో పారదర్శకంగా ఇందిరమ్మ టవర్స్ లక్కీడ్రా
ఇందిరమ్మ ఇళ్లపై గుడ్ న్యూస్.. మరో 10 రోజుల్లో రెండో జాబితా
10 ఏళ్ల తర్వాత ఇంటిని అమ్ముకునే హక్కు ఉంది
పారదర్శకంగా లక్కీడ్రాతోనే ఇందిరమ్మ ఇళ్లు
ఇళ్ల రిజిస్ట్రేషన్ కు ఎలాంటి ఛార్జీలు వసూలు చేస్తలే
హైదరాబాద్: మహానగరంలో నిరుపేదల సొంతింటి కలను నిజం చేస్తూ, వారి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచే ఇందిరమ్మ టవర్స్(Indiramma Towers Lucky Draw) నిర్మాణానికి పారదర్శకంగా లబ్దిదారుల ఎంపిక చేపడుతున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Minister Ponguleti Srinivas Reddy) తెలిపారు. అర్హతే ప్రామాణికంగా, కులమతాలు, రాజకీయాలకు అతీతంగా లబ్ధిదారుల ఎంపిక జరుగుతోందని స్పష్టం చేశారు. క్యూర్ ప్రాంతంలో తొలి విడతగా చేపడుతున్న ఇందిరమ్మ టవర్స్‌లో ఫ్లాట్ల కేటాయింపునకు అత్యంత పారదర్శకంగా లక్కీడ్రా నిర్వహిస్తున్నామని పొంగులేటి స్పష్టం చేశారు. మీడియా, అర్హులైన లబ్ధిదారుల సమక్షంలో లక్కీడ్రా నిర్వహిస్తూ, మొత్తం ప్రక్రియను అన్ని సోషల్ మీడియా ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నామని వెల్లడించారు.
శుక్రవారం నాంపల్లి, కుత్బుల్లాపూర్, సికింద్రాబాద్, రాజేంద్రనగర్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇందిరమ్మ టవర్స్ ఫ్లాట్ల కోసం లక్కీడ్రా నిర్వహించారు. నాంపల్లి నియోజకవర్గంలోని రెడ్‌హిల్స్‌లో నిర్మించనున్న ఇందిరమ్మ టవర్స్ ఫ్లాట్ల కేటాయింపునకు వెట్ గార్డెన్స్‌లో, రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని మైలార్‌దేవుపల్లి పరిధికి సంబంధించి లక్ష్మీగూడలో నిర్వహించిన లక్కీడ్రా కార్యక్రమాల్లో మంత్రి పొంగులేటి పాల్గొని డ్రా తీశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. శుక్రవారం నుంచి ఈ నెల 31వ తేదీ వరకు 16 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సుమారు 8 వేల ఫ్లాట్లకు లక్కీడ్రా నిర్వహిస్తున్నామని ప్రకటించారు. రోజుకు నాలుగు నియోజకవర్గాల చొప్పున లక్కీడ్రా ప్రక్రియ కొనసాగుతుందని వెల్లడించారు.
ప్రజాప్రభుత్వం తరుఫున ఇంటి నిర్మాణానికి రూ. 5 లక్షలు ఇస్తున్నామని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. అర్హులైన పేదలకు ఇళ్లు ఇస్తున్నామని తెలిపారు. మరో 10 రోజుల్లో రెండో విడత జాబితా విడుదల చేస్తామన్నారు. 16 నియోజకవర్గాల్లో స్థలాలు సేకరించి టెండర్లు పూర్తి చేశామన్నారు. రెండు, మూడు రోజుల్లో టవర్ల నిర్మాణం ప్రారంభిస్తారని చెప్పారు. ఏడాది లోపే ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి ఆడబిడ్డల పేరుమీద ఇస్తామని సూచించారు. ఇళ్ల రిజిస్ట్రేషన్ కు ఎలాంటి ఛార్జీలు వసూలు చేయట్లేదన్న మంత్రి 10 ఏళ్ల తర్వాత ఇంటిని అమ్ముకునే హక్కు ఉందని తెలిపారు. ఇల్లు రిజిస్ట్రేషన్ అయిన తర్వాత తాకట్టు పెట్టుకునేందుకు అనుమతి ఉందన్నారు. పారదర్శకంగా లక్కీడ్రాతోనే ఇళ్లను కేటాయిస్తున్నామని వివరించారు.






