ఆద్యంతం ఉత్కంఠ రేపే మహేంద్రగిరి వారాహి
సుమంత్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘మహేంద్రగిరి వారాహి’. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో రాజశ్యామల ఎంటర్‌టైన్‌మెంట్స్, బ్రిడ్జ్ ఫిలిమ్స్ బ్యానర్లపై మధు కాలిపు, లక్ష్మణ్ నిర్మిస్తున్నారు. మాళవికా నాయర్, ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి గోసామి, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, రాజీవ్ కనకాల, కమల్ కామరాజు, సత్యసాయి శ్రీనివాస్, వంశీ చాగంటి, మంజు భార్గవి ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీ టీజర్ విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది.
ఈ కార్యక్రమానికి దర్శకుడు అనిల్ రావిపూడి, నిర్మాత సుప్రియ యార్లగడ్డ ముఖ్యఅతిథులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. “మహేంద్రగిరి వారాహి సినిమా విజయం సాధిస్తుందనిపిస్తుంది. సుమంత్ ఈ సినిమాతో మరో బిగ్గెస్ట్ హిట్ కొట్టాలని కోరుకుంటున్నా” అన్నారు.
చిత్ర కథానాయకుడు సుమంత్ మాట్లాడుతూ.. “ఒక శాపం వెనుక ఉన్న రహస్యాన్ని, ఒక ఊరిలో జరుగుతున్న వరుస చావుల మిస్టరీని ఛేదించే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ పాత్రను నేను పోషిస్తున్నా. ముఖ్యంగా వారాహి అమ్మవారి ఉగ్రరూపం షాట్స్ ప్రేక్షకులకు గూస్‌బంప్స్ తెప్పిస్తాయి. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది” అన్నారు. మిగతా చిత్రబృందం కూడా ఈ కార్యక్రమంలో మాట్లాడారు.






