తెలంగాణ దేవాలయాల్లో సొన్నాయి కుల వాయిద్య కళాకారులకు అన్యాయం
- డిప్లోమా కోర్సు మెలికతో ఆంధ్రప్రదేశ్ కళాకారులకు ఉద్యోగాలు ఇవ్వడం దుర్మార్గం
- తెలంగాణ సొన్నాయి కుల వాయిద్య కారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు వేముల శ్రీనివాస్
ముషీరాబాద్, జూన్ 1 (విజయక్రాంతి): తెలంగాణలోని దేవాలయాల్లో వాయిద్య కళాకారుల ఉద్యోగాల భర్తీలో తెలంగాణకు చెందిన సొన్నాయి కుల వాయిద్య కళాకారులకు ప్రాధాన్యత ఇవ్వకుండా, ఆంధ్ర ప్రాంతానికి చెందిన వాయిద్య కళాకారులకు ప్రభుత్వం ప్రాధాన్యతను ఇవ్వడం అన్యాయమని తెలంగాణ సొన్నాయి కుల వాయిద్య కారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు వేముల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి కోమండ్ల మనోహర్ పేర్కొన్నారు.
స్థానికులకు ప్రాధాన్యత ఇవ్వకుండా కాలేశ్వరం తదితర దేవాలయాలలో వాయిద్య కళాకారుల నియామకానికి ఇచ్చిన నోటిఫికేషన్లను వెంటనే రద్దు చేయడంతో పాటు కొండగట్టు గుడి ఏర్పాటు నుంచి ఇప్పటివరకు పనిచేస్తున్న వాయిద్య కళాకారులను కాకుండా ఇతర కళాకారుల నియామకాన్ని వెంటనే నిలిపివేయాలని వారు డిమాండ్ చేశారు. తెలంగాణ సొన్నాయి కుల వాయిద్య కారుల సంఘం ఆధ్వర్యంలో సోమవారం అబిడ్స్ బొగ్గులకుంటలోని దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ కార్యాలయం ముందు సన్నాయి వాయిద్యాలతో వినూత్న నిరసన ప్రదర్శన నిర్వహించారు.
అనంతరం తెలంగాణలోని దేవాలయాల్లో తమ కులస్థులకు జరుగుతున్న అన్యాయం, అధికారుల వైఖరిని నిరసిస్తూ దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ డి. కృష్ణ ప్రసాద్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వేముల శ్రీనివాస్, కోమండ్ల మనోహర్ మాట్లాడుతూ తెలంగాణ ప్రాంతంలో గత వందల ఏళ్లుగా దేవాలయాల్లో సన్నాయి వృత్తితో జీవనం సాగిస్తున్నామని తెలిపారు. డిప్లమో కోర్స్ మేలికతో ఆంధ్ర ప్రదేశ్ కళాకారులకు ఉద్యోగాలు ఇవ్వడం అత్యంత దుర్మార్గం అన్నారు. స్థానికత ఆధారంగా ఉద్యోగాలు భర్తీ చేసి, తెలంగాణ ప్రాంత సొన్నాయి వాయిద్య కళాకారులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఈ నిరసన కార్యక్రమంలో సంఘం నేతలు కోమాండ్ల మహేందర్, మహాదేవుని శంకర్, దేవుని చంద్రమౌళి, మెట్టుపల్లి గంగారాం, సుధీర్, మధుకర్, రవి కోరుట్ల, సిద్ధి రమేష్, కొమాండ్ల సత్యనారాయణ, కొండగట్టు అనిల్, రవి, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సొన్నాయి కుల వాయిద్య కళాకారులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.






