బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం
మహేశ్ కుమార్ గౌడ్ :
బీజేపీ అనుసరిస్తున్న వివక్షను రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. తెలంగాణ ప్రజలు ఎవరినీ మోసం చేయలేదు, కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం పదకొండేళ్లుగా తెలంగాణను మోసం చేస్తూనే ఉంది.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ప్రవేశపెట్టిన 2025--26 బడ్జెట్ దేశ సమగ్ర అభివృద్ధికి కాకుండా కేవలం రాజకీయ ప్రయోజనాలకే నిధులు కేటాయించి నట్టుగా ఉంది. ‘దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్’ అన్న తెలుగు కవి గురజాడ గేయ స్ఫూర్తితో దేశ ప్రజల మంచికోసం పనిచేస్తున్నట్లు గొప్పగా చెప్పుకున్నారు.
కానీ, బడ్జెట్ లో కేటాయింపులు చూస్తే... దేశం అంటే కొన్ని రాష్ట్రాలే అన్నట్లు వ్యవహరించారు. గర్వంగా తెలుగు గేయం వినిపించి...తెలుగువారి ఆకాంక్షలకు, తెలుగునేల అభివృద్ధికి మొండిచే యి చూపించారు. ‘దేశమంటే మనుషులోయ్... దానిలో తెలంగాణ ప్రజలు కూ డా ఉన్నారోయ్’ అని ఆమెకు గుర్తుకు రాకపోవడం ఆశ్చర్యం కలిగించింది. బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు కనీస ప్రాధాన్యత ఇవ్వకపోవడం తెలంగాణ పట్ల వారికున్న సవతి తల్లి ప్రేమను తెలియజేస్తున్నది.
దేశమంటే ఆ రెండు రాష్ట్రాలేనా?
కేంద్ర బడ్జెట్ అంటే... దేశ అభివృద్ధి దృష్టిలో ఉంచుకుని తయారు చేయాల్సిన పవిత్ర కార్యం. కానీ, బీజేపీ ముఖం చూసి బొట్టుపెట్టింది. దేశ అభివృద్ధిని పణంగా పెట్టి, వివిధ రాష్ట్రాల్లో రాబోయే ఎన్నికల్లో రాజకీయ లబ్ధి కోసమే ఈ బడ్జెట్‌ను బీజేపీ వండి వార్చింది.
త్వరలో బీహార్‌లో ఎన్నికలు ఉన్నందున, ఆ రాష్ట్ర అభివృద్ధికి ప్రత్యేకంగా రూ. 26 వేల కోట్ల ఆర్థిక సహాయం, 2,400 మెగావాట్ల పవర్ ప్లాంట్, పారిశ్రామిక కారిడార్, గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్ పోర్టు, మఖాన బోర్డు, మిథిలాంచల్ లో వెస్టర్న్ కోసి కెనాల్, ఐఐటీ పాట్నా విస్తరణ, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ...ఇలా వరాలు జల్లు కురిపించింది. ఈ వారంలోనే ఎన్నికలు జరగనున్న ఢిల్లీకి భారీగా కేటాయింపులు జరిపింది.
ఇటీవలి బడ్జెట్లు చూస్తుంటే... 2024లో ఆంధ్రప్రదేశ్ కోసం, 2025లో ఢిల్లీ, బీహార్ కోసం బడ్జెట్ పెట్టారనిపిస్తుంది. 2026లో ఉత్తరప్రదేశ్ బడ్జెట్, 2027లో గుజరాత్ కోసం బడ్జెట్ పెడతారేమోనని అనుమానం కలుగుతోంది. మరి, యావత్ దేశానికి సరిపోయే బడ్జెట్ ఎప్పుడు పెడతారు? ఈ వైఖరితో బీజేపీ గొప్పగా పలికే ‘వికసిత్ భారత్’ ఎలా సాధ్యమవుతుంది?
దేశ జీడీపీలో 5.1 శాతం తెలంగాణ వాటా ఉన్నది. ఇందులో 2.10 శాతమే తి రిగి తెలంగాణకు వస్తున్నది. జీఎస్టీ, ఇతర పన్నుల రూపంలో రాష్ట్రం నుంచి సు మారు రూ. లక్షల కోట్ల రూపాయలు వసూలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం కనీ సం... 40 వేల కోట్లు కూడా తిరిగి తెలంగాణకు ఇవ్వవడం లేదు.
కేంద్ర ప్రభు త్వానికే తెలంగాణ ఇస్తున్నదిగానీ, కేంద్రం తెలంగాణకు ఇస్తున్నదేమీ లేదని ఈ బడ్జెట్ మరోసారి నిరూపించింది. తెలంగాణ కడుతున్న జీఎస్టీకి సమానంగా కనీసం రూ. 40వేల కోట్ల నిధులు మన రాష్ట్రానికి కేటాయించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క లేఖ రాసినా పరిగణనలోకి తీసుకో లేదు.
శాసనసభ తీర్మానాలనూ పట్టించుకోలేదు. పద్మ పురస్కారాలతో పాటు, బడ్జె ట్ విషయంలోనూ తెలంగాణ సహా కాం గ్రెస్ పాలిత రాష్ట్రాలపై బీజేపీ చూపిస్తున్న వివక్ష, రాజకీయ కక్షకు ఇవే ఆధారాలు. ఇదేనా వారి సమాఖ్య స్ఫూర్తి?
విభజన నాటినుంచీ అన్యాయమే
తెలంగాణ ఏర్పాటయిన 2014 నుంచి ప్రతి కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి అన్యాయమే జరుగుతున్నది. ప్రతి బడ్జెట్ లో తెలంగాణ పట్ల కేంద్రానికి ఉన్న ద్వేషం బయటపడుతున్నది. 2014లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సమయంలో కేంద్రం ఇచ్చిన హామీలను పదకొండేళ్లు దాటినా అమలు కాకపోవడమే దీనికి అద్దం పడుతున్నది.
ప్రత్యేకంగా, విభజన చట్టం ప్రకారం ఇచ్చిన నిధులు ఇప్పటివరకూ తెలంగాణకు విడుదల చేయలేదు.. గిరిజన యూనివర్సిటీకి నిధులు లేవు. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, రైల్వే ప్రాజెక్టులు, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు జాతీయ హోదా, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ, ఐఐఎం, లక్షల ఉద్యోగాలు కల్పించగల హైదరాబాదు ఐటీ ఇన్వెస్ట్‌మెంట్ రీజియన్ వంటి హామీలకు ఈ గురించి బడ్జెట్ లో కనీసం ప్రస్తావన కూడా రాలేదు.
ఈ బడ్జెట్‌లో ప్రధానమంత్రి ధన్-ధాన్య కృషి యోజన పథకాన్ని కేవలం 100 జిల్లాలకే పరిమితం చేశారు. ఇందులో తెలంగాణ రైతులకు ఏ ప్రయోజనం లేదు. కాటన్ ప్రొడక్టివిటీ మిషన్‌లోనూ ధర, కొనుగోలు హామీల గురించి ప్రస్తావించలేదు. గ్రామీణ ప్రాంతాలు, పంచాయితీ లకు శిక్షణ ఇచ్చే వ్యవస్థ ఎన్‌ఐఆర్‌డీ మన తెలంగాణలోనే ఉంది.
దీనికోసం రూ.77 కోట్ల కేటాయించాలని ప్రతిపాదన పంపితే ఒక్క పైసా ఇవ్వలేదు. ఆహార భద్రతను మరింత బలోపేతం చేయాల్సిన సమయంలో దానికి కూడా తూట్లు పొడిచింది. తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోవడానికే ఈ బడ్జెట్ ప్రతిపాదించినట్లు ఇట్టే అర్థమవుతుంది.
తెలంగాణ ఏం తప్పు చేసింది? బీజేపీకి 8 ఎంపీ సీట్లు ఇచ్చింది. కానీ, తెలంగాణకు బీజేపీ గాడిదగుడ్డు ఇచ్చింది! తెలంగాణ నుంచి కేంద్ర మంత్రులుగా ఉన్న కిషన్ రెడ్డి, బండి సంజయ్ తెలంగాణకు అవసరమైన నిధులు తీసుకురావడంలో విఫ లమయ్యారు. పదే పదే కాంగ్రెస్ ప్రభుత్వా న్ని విమర్శించే బీజేపీ ఎంపీలు బడ్జెట్‌లో తెలంగాణకు జరిగిన అన్యాయంపై పల్లెత్తు మాట కూడా మాట్లాడటం లేదు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఆర్థికమంత్రి నిర్మల సీతారామన్ తో మాట్లాడి, తెలంగాణకు అవసరమైన నిధులు ఎందుకు రాబట్టలేదో, వారి నిస్సహాయతకు కారణం ఏం టో తెలంగాణ ప్రజలు తెలుసుకోవాలనుకుంటున్నారు. ఇప్పటికైనా బీజేపీ నాయ కులకు తెలంగాణ మీద ప్రేమ, చిత్తశుద్ధి ఉంటే, అవసరమైన నిధులు సమకూర్చేందుకు, విభజన హామీల అమలుకు కృషి చేయాలి.
రైతులు, నిరుద్యోగ ప్రస్తావనే లేదు
ఈ బడ్జెట్ దేశ ప్రజలను దృష్టిలో పెట్టుకుని తయారు చేసిందని కొంతమంది బీజేపీ నాయకులు మసిపూసి మారేడుకాయ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. నిజానికి వారు దేశ ప్రజలకు మంచికోసం కూడా చేసిందేమీ లేదు. రైతులు కోరుకుంటున్న కనీస మద్దతు ధర అనే పదానికే నిర్మలమ్మ ప్రసంగంలోనే చోటు ఇవ్వలేదు.
ప్రకృతి వ్యవసాయం వైపు కోటి మంది రైతులను మారుస్తామని గొప్పగా చెప్పి..బడ్జెట్‌లో రూ.616 కోట్లనే కేటాయించారు. మన దేశం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య నిరుద్యోగం. దీని గురించి కూడా బడ్జెట్ లో మాట్లాడలేదు. విద్యారంగ అభివృద్ధికి గతేడాది 2.60 శాతం నిధులు కేటాయిస్తే... ఈసారి దానిని 2.53 శాతానికి కుదించారు.
గ్రామాలు పట్టుగొమ్మలని చెప్తూనే... గ్రామీణ అభివృద్ధికి గతేడాది 5.51 శాతం కేటాయి స్తే, ఈసారి దానిని 5.26 శాతానికి కుదించారు. దేశంలో రోడ్లు అధ్వాన్నంగా తయా రయ్యాయి. కానీ, రోడ్ల కోసం ఈ బడ్జెట్‌లో రూ.2.87లక్షల కోట్లే కేటాయిం చారు. గతేడాదితో పోలిస్తే 2.41 శాతం మాత్రమే అధికం. ఇదేనా దేశ అభివృద్ధి అంటే?
‘సబ్ కా సాత్, సబ్ కా వికాస్’ అని గొప్పలకు పోయే బీజేపీకి దేశంలో ఉన్న 140 కోట్ల ప్రజలు, వారి సమస్యలు కనపడకపోవడం విడ్డూరం. ఎన్నికల జరగబో యే రాష్ట్రాల కోసం బడ్జెట్ తయారు చేశారు తప్ప దేశ సమ్మిళిత వృద్ధిని కొంచెం కూడా పట్టించుకోలేదు. బీజేపీ తన రాజకీయ అవసరాల కోసం కేంద్ర బడ్జెట్ ను ఉపయోగించుకుంటూ, రాష్ట్రాలను విడదీస్తూ జాతి సమగ్రతను పక్కన పెట్టింది.
ముఖ్యంగా కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు కేటాయింపులు లేకపోవడం, ఎలాంటి ప్రత్యేక నిధులు అందకపోవడం రాష్ట్ర ప్రజలను తీవ్ర నిరాశకు గురిచేసింది. బీజేపీ అనుసరిస్తున్న వివక్షను రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. తెలంగాణ ప్రజ లు ఎవరినీ మోసం చేయలేదు, కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం పదకొండేళ్లుగా తెలంగాణను మోసం చేస్తూనే ఉంది. ఈ విషయంలో తెలంగాణ ప్రజలు బీజేపీని ఎప్పటికీ క్షమించరు!
వ్యాసకర్త పీసీసీ అధ్యక్షులు






