2 May, 2026 | 6:28 AM

అజాతశత్రువుకు అవమానం

08-02-2025 12:09 AM

ఆచార్య మసన చెన్నప్ప :

కళాశాలల్లో పనిచేసే ఆచార్యుల బోధనలో ఎవరి ప్రత్యేకత వారిదే. సి.నారాయణరెడ్డి పాఠం అంటే ఇష్టపడని వారుండరు. అనురక్తి జనకంగా, ఆకర్షణీయంగా, అలంకార సమన్వితంగా పాఠం చెప్పడంలో ఆచార్య సినారెను మించిన వారు లేరు. మా విశ్వవిద్యాలయంలో సినారెతో అత్యంత సాన్నిహిత్యం కలిగిన ఆచార్యులు ఇరివెంటి కృష్ణమూర్తి.

వారిరువురూ కళాశాలలోనేకాక జంటనగరాలలో జరిగే అనేక సభలలో కలిసి పాల్గొన్న సందర్భాలున్నాయి. సినారెకు చెప్పడమెంత ఇష్టమో రాయడమూ అంతే ఇష్టం. కాని, ఇరివెంటి వారికి రాయడం కంటే చెప్పడం ఇష్టం. సినారె రాతకూడా అందమైంది. ఇరివెంటి వారి రాత అంత అందంగా ఉండేది కాదు.

బోర్డుమీద రాయాలంటే ఇరివెంటికి కొంచెం ఇబ్బందిగా ఉండేది. పొట్టివారు కనుక ఆయన బోర్డు పై భాగంలో రాసేవారు కారు. ఐతే, క్లాసులో పాఠం చెప్పడంలోనైతే ఇరివెంటి మహా ఘనాపాఠి. కవి సమయాలమీద పరిశోధనలు చేసిన ఆయన తాను స్వయంగా ఎన్నో విషయాలను కల్పించి, హాస్యరసాన్ని రంగరించి పాఠం చెప్పేవారు.

ఆయనకు పుస్తకం అవసరం లేదు. మస్తకమే ఆయన పుస్తకం. అది ఒక విజ్ఞాన సర్వస్వం. అనంత విశ్వ జ్ఞానాన్ని కైవసం చేసుకోవాలన్న కోరిక వారిది. అందుకే, ఆయన క్లాసును మేం విడిచిపెట్టే వాళ్లం కాదు.

సాధారణమైన దుస్తుల్లో, నిర్మలమైన మనస్సుతో వ్యవహరించే ఇరివెంటి మా విద్యార్థులందరితో కలిసి పోయేవారు. నేను వారి ఇంటికి ఎప్పుడు వెళ్లినా ఒక కొత్త పుస్తకం నా చేతిలో పెట్టేవారు. “చిరంజీవి చెన్నప్పకు శుభాశీస్సులతో..” అని రాసి తెలుగులో సంతకం పెట్టి, తేదికూడా వేసి ఇచ్చేవారు. ఓసారి ఆయనతో అన్నాను

“మీరు ఇంటికి వచ్చినప్పుడల్లా నాకు ఒక పుస్తకం ఇస్తున్నారు..” అని. 

“నేను సాధారణంగా ఎవరైనా రచయితలు పుస్తకాలిస్తే రెండు అడిగి తీసుకుంటాను. అందులో ఒకటి నీవంటి మంచి విద్యార్థికి ఇస్తాను..” అన్నారాయన. 

ఆచార్యులలో ఇంత మంచివారు ఉంటారా! అట్లా వారు నాకిచ్చిన పుస్తకాలు ఎన్నో ఇప్పటికీ నా లైబ్రరీలో భద్రంగా ఉన్నాయి. ఇరివెంటి వారు అజాతశత్రువు అన్నది అక్షరాల నిజం. ఏ సహాధ్యాపకునితోను, మరే విద్యార్థితోనూ గొడవ పెట్టుకునే వారు కారు. అందరితో ఎంతో వాత్సల్యంతో ఉండేవారు. అందుకేనేమో, సినారె కూడా కృష్ణమూర్తి వారంటే బాగా ఇష్టపడేవారు. సి.నారాయణరెడ్డికి ఇరివెంటి వారితో ఎంత స్నేహమంటే తాను ఏ రచన చేసినా దానిని మొదట ఇరివెంటి వారికే వినిపించేవారట. 

“జ్ఞానపీఠ పురస్కారం పొందిన ‘విశ్వంభర’ కావ్యానికీ ప్రప్రథమ శ్రోత ఇరివెంటి వారే” అని స్వయంగా సినారె చెప్పగా నేను విన్నాను. 

విద్యార్థులకు బోధించడం అన్నది ఒక కళ. నిజంగా ఇరివెంటి ఆ కౌశలం, ఉపన్యాస శైలి మమ్మల్ని ఎంతగానో ఆకర్షించేవి. 

అంత మాత్రానికే నిలేయాలా?

నేను అప్పుడు ఎంఏ ద్వితీయ సంవత్సరం విద్యార్థిని. నర్సయ్య అనే ఒక మిత్రుడు ఎంఏ మొదటి సంవత్సరం విద్యార్థి. క్లాసులో ఒకనాడు ఇరివెంటి వారు ఏవో కొన్ని వాక్యాలు రాయడానికి బోర్డును ఉపయోగించుకున్నారు. ఆ వాక్యాల్లో ఒక అక్షరం తప్పయింది. వా క్యం కూడా కురదలేదు. దాన్ని అందరు విద్యార్థులు చూసి ఊరుకున్నారు. కానీ, నర్సయ్య మాత్రం లేచి అన్నాడు

“మీకు చెప్పడానికి వస్తుంది కాని, రాయడం రాదు సార్. బోర్డ్‌పై తప్పు రాశారు...” 

అందరి ముందు వారిని నిలదీసినంత పనిచేశాడు. ఇరివెంటి వారు బోర్డును చూడకుండానే తనను తాను సమర్థించుకున్నారు. అప్పటికీ నర్సయ్య ఊరుకుంటే పోయేది. కానీ, మళ్లీ లేచాడు

“ఎవరైనా తప్పులు రాసి సమర్థించుకుంటారా సార్?” అన్నాడు.

అప్పుడు ఇరివెంటి వారు బోర్డువైపు చూశారు. ఏం మాట్లాడాలో తెలియక అవాక్కయ్యారు. తాను రాసిన తప్పును గుర్తించారు. అయితే, క్లాసులో అందరి ముందూ ఒక విద్యార్థి తనను వేలెత్తి చూపడం అవమానంగా భావించినట్టున్నారు. ఏం మాట్లాడకుండా నిశ్శబ్దంగా క్లాసు నుంచి బయటకు వచ్చేశారు, కళ్లు తుడుచుకుంటూ.

క్లాసులో జరిగిన ఈ సంఘటనకు ఇరివెంటి సార్‌తోపాటు నాకూ ఎంతో బాధే సింది. రెండు మూడు రోజుల దాకా నిద్ర పట్టలేదు. ఒకరోజు కళాశాలలో నర్సయ్య ను కలిశాను. జరిగిందంతా అతని మాటల్లో మళ్లీ విన్నాను. అతని దృష్టిలో ‘ఆచార్యులకు రాయడమే రాదన్న’ అభిప్రాయం చోటు చేసుకుంది. అది నాకు నచ్చలేదు. ఆ భావనను  తొలగించాలనుకున్నాను

“చూడు మిత్రమా! మనం విశ్వవిద్యాలయంలో చదువుకోవడానికి వచ్చాం. ఇతరుల దోషాలను లెక్క పెట్టి చూపడానికి కాదుగా. ఇరివెంటి సార్ సున్నితమైన మనస్సు గలవారు. ప్రేమాస్పదులు. విద్యార్థులంటే ఎంతో వాత్సల్యం కురిపిస్తారు. మీరు ఆయనను క్లాసులో ఇబ్బంది పెట్టడం బాగోలేదు. మనం వీలైతే ఆచార్యులతో స్నేహ సంబంధాలను పెంపొం దించుకోవాలి. ఎందుకంటే, ఈ ఆచార్యులే రేపు మనల్ని ఇంటర్వ్యూ చేసి లెక్చరర్లుగా నియమిస్తారు. ఈ విషయం నీకు తెలుసో లేదో అని చెబుతున్నాను..” అన్నాను.

ఆ తర్వాత తెలిసింది నాకు, నర్సయ్య మారిపోయి, ఇరివెంటి వారికి ప్రియుశిష్యులయ్యారు. ఆ సంవత్సరం క్లాసులో అత్యధికంగా మార్కులు తెచ్చుకుని ఫస్టు ర్యాంకు సాధించారు. గురువులను ద్వేషించడానికి బదులు గౌరవిస్తే, మనకు వారి ఆశీర్వాదం లభిస్తుంది. ఆ బలమే అన్ని బలాలకంటే గొప్పది కాగలదు కూడా.

వ్యాసకర్త సెల్: 9885654381