18-07-2025 10:13:56 PM
మహబూబాబాద్,(విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్యా బోధన కోసం వినూత్న కార్యక్రమాలను అమలు చేస్తున్నట్లు మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ తెలిపారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ మహబూబాబాద్ జిల్లా నేల్లికుదురు మండలంలో సుడిగాలి పర్యటన చేశారు. ఈ సందర్భంగా నెల్లికుదురు కేజీబీవీ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, అంగన్వాడి కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసి పరిసరాలను, రికార్డులను పరిశీలించారు. విద్యార్థినీ, విద్యార్థుల అభ్యసన సామర్ధ్యాలు ఫలితాలు, విద్య బోధన తీరు పరిశీలన చేశారు. సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ విద్యా సంవత్సరంలో విద్యార్థుల అభ్యసనా స్థాయిలను పెంచడం కోసం ఖాన్ అకాడమీ, ఫిజిక్స్ వాలా, ఐఐటి, నీట్ శిక్షణ తరగతులు, సైకిల్ పార్ట్ టెస్టులు, న్యూ మెనూ విద్యార్థుల బోధన అభ్యసన కోసం ఐఎఫ్ పీ ని ఉపయోగించడం ద్వారా విద్యార్థుల్లో సాంకేతిక నైపుణ్యం గణనీయంగా అభివృద్ధి చెందుతుందన్నారు. ప్రతి కేజీబీవీ పాఠశాలకు ఇంటర్నెట్ సౌకర్యం కల్పించడం ద్వారా ఆన్లైన్ పాఠలు వినిపించడం జరుగుతుందన్నారు. అంగన్ వాడీ కేంద్రాన్ని సందర్శించి అక్కడి భోదనను పరిశీలించారు. నూతన డైట్ మెనూ ప్రకారం రుచికరమైన ఆహారాన్ని అందించాలని సూచించారు. పి.హెచ్.సి సందర్శించి రికార్డులను పరిశీలించారు. సీజనల్ వ్యాదులకు తగిన అత్యవసర మందులను అందుబాటులో ఉంచుకోవాలని, పేషెంట్ లకు అవసరమయ్యే ల్యాబ్ టెస్టులను చేయించాలని, నిత్యం వైద్యులు అందుబాటులో ఉండి ప్రజలకు వైద్యం అందించాలన్నారు.