20-02-2026 12:38:19 AM
కరీంనగర్, ఫిబ్రవరి 19 (విజయ క్రాంతి): కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి టి జీవన్ రెడ్డి దారెటూ అన్న చర్చ రాజకీయవర్గాల్లో కొనసాగుతుంది. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ తో ఏర్పడ్డ రాజకీయ వివాదం ముదిరి పాకాన పడింది. సంజయ్ కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటి నుంచి జీవన్ రెడ్డి జీర్ణించుకోలేక అసమ్మతిగళం మొదలు పెట్టారు. పార్టీ నిర్ణయాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ ఫైర్ బ్రాండ్ గా మారారు.
తాజాగా మున్సిపల్ ఎన్నికల్లో తన వర్గాన్ని నిలబెట్టి సత్తాచాటి తన గొంతును మరింత పెంచారు. జగిత్యాల వ్యవహారంపై తరచూ అధిష్టానం సూచనలు చేసినప్పటికీ సంజయ్, జీవన్ రెడ్డి మధ్య సయోధ్య కుదరకపోవడంతో ఇటీవల ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాలనుండి కూడా పిలుపు రావడం మరోమారు చర్చకు దారితీసింది.
జీవన్ రెడ్డి ఇటీవల ప్రెస్ మీట్ పెట్టి కాంగ్రెస్ లో ఉండడం ఎందుకనే సందేశం ఇవ్వడంపై ఆయన పార్టీ మారతారన్న చర్చ జోరందుకుంది. జీవన్ రెడ్డి కాంగ్రెస్లోనే ఉంటారని, ఆయనకు రాజ్యసభ ఆఫర్ వచ్చిందనే చర్చ పార్టీ వర్గాల్లో కొనసాగుతున్న క్రమంలోనే ఆయనకు బీజేపీ, బీఆర్‌ఎస్ ల నుండి పిలుపు రావడం విశేషం. జీవన్ రెడ్డి అంటే గౌరవించే బీజేపీ నాయకులు, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ నుండి పిలుపు రావడం, ఆయన ఫోన్ చేసి మాట్లాడడం చర్చకు దారితీసింది. ప్రధాని మోడీతో మాట్లాడి సీనియర్ నాయకుడు కనుక గవర్నర్ పదవి వచ్చే విధంగా కృషి చేస్తానని అరవింద్ మాట ఇచ్చినట్లు ప్రచారం జరుగుతుంది. ఇదిలా ఉండగా బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నుండి కూడా పిలుపు వచ్చినట్లు తెలిసింది.
అయితే జీవన్ రెడ్డి జగిత్యాలపై జెండా ఎగురవేసేందుకు బీఆర్‌ఎస్ లో చేరతారా, లేకుంటే గవర్నర్ కోసం బీజేపీలో చేరతారా, కాంగ్రెస్ వారు బుజ్జగిస్తే రాజ్యసభతో సరిపెట్టుకుంటారా అన్న చర్చ ఆయన అనుచరవర్గంలో సాగుతుంది. జీవన్ రెడ్డి మాత్రం తన నిర్ణయాన్ని ఇంకా బాహటంగా ప్రకటించలేదు.
ఆయన తన నిర్ణయం తీసుకునే ముందు జగిత్యాల జిల్లాలోని తన అనుచరులతో సమావేశమయ్యే అవకాశం ఉంది. ఏది ఏమైనా జీవన్ రెడ్డి వ్యవహారంపై కాంగ్రెస్ అధిష్టానం ఎటూ తేల్చుకోలేక పోతుంది. తెలంగాణలో ఖాళీ అవుతున్న రెండు రాజ్యసభ సీట్లకు పోటీ ఎక్కువగా ఉండడంతో జీవన్ రెడ్డికి వస్తుందా, రాదా అన్న సస్పెన్షన్ నెలకొంది. రాజ్యసభ ఆఫర్ ఇవ్వకుంటే పార్టీ మారే అవకాశం మాత్రం ఖాయంగా కనిపిస్తుంది.