జ్యోతిబా ఫూలే గురుకుల పాఠశాల తనిఖీ
మేడ్చల్, జూలై 30 (విజయక్రాంతి): తుర్కపల్లిలోని మహాత్మ జ్యోతిబాపూలే బిసి వెల్ఫేర్ రెసిడెన్షియల్ (బాలుర) ను జిల్లా ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కె. ఆనంద్ గురువారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా నర్సింగ్ అధికారి నిర్వహిస్తున్న ఆరోగ్య రికార్డులు, మందుల లభ్యత, వంటశాల, వసతి గృహంలోని పారిశుద్ధ్య పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలించారు.
విద్యార్థులకు అందిస్తున్న ఆహారం నాణ్యతను,వంటకు ఉపయోగిస్తున్న కూరగాయల నాణ్యత, నిల్వ విధానం, పరిశుభ్రత ప్రమాణాలను తనిఖీ చేశారు. విద్యార్థులకు అందించాల్సిన గుడ్లను సరిగా నిల్వ చేయకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు.వసతి గృహం సామర్థ్యం 783 మంది కాగా, ప్రస్తుతం 679 మంది విద్యార్థులు నివాసం ఉంటున్నట్లు పరిశీలనలో వెల్లడైంది.
విద్యార్థులకు అందించే ఆహారంలో నాణ్యత, పరిశుభ్రత, వంటశాల నిర్వహణ, కూరగాయలు, ఇతర ఆహార పదార్థాల నిల్వ విధానం, హాస్టల్ పరిసరాల పరిశుభ్రతను అత్యున్నత ప్రమాణాలతో నిర్వహించాలని సిబ్బందికి ఆదేశించారు.అదనంగా, విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొంటూ, అవసరమైతే ఆర్బీఎస్కే వైద్య బృందాలను వసతి గృహానికి పంపించి ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తామని, లేదా విద్యార్థులను సమీపంలోని తుర్కపల్లి/శామీర్పేట్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకువచ్చి వైద్య పరీక్షలు నిర్వహించేలా చర్యలు చేపట్టాలని సూచించారు.






