31 July, 2026 | 1:10 AM

ఇంటర్ విద్యార్థులకు సైబర్ క్రైమ్‌పై అవగాహన సదస్సు

31-07-2026 12:00 AM

ఉప్పల్ జూలై 30 విజయక్రాంతి : విద్యార్థుల్లో సైబర్ భద్రతపై అవగాహన పెంపొందించేందుకు నాచారం అర్బన్ ఇంటర్మీడియట్ కళాశాలలో సైబర్ క్రైమ్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సైబర్ నేరాల నివారణ, పోక్సో చట్టం, డ్రగ్స్ దుష్ప్రభావాలు, రోడ్డు భద్రత, వ్యక్తిగత భద్రత తదితర అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న నాచారం పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ధనుంజయ్ గౌడ్ మాట్లాడుతూ విద్యార్థులు విద్యతో పాటు క్రమశిక్షణను అలవర్చుకోవాలని సూచించారు. సోషల్ మీడియాను బాధ్యతాయుతంగా వినియోగించడంతో పాటు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.

సమాజంలో మంచి పౌరులుగా ఎదిగి దేశ అభివృద్ధికి తోడ్పడాలని పిలుపునిచ్చారు.అనంతరం ఎస్‌ఐ మైబెల్లి మాట్లాడుతూ డిజిటల్ అరెస్ట్ స్కామ్స్, ఫేక్ లోన్ యాప్స్, ఓటీపీ మోసాలు, సోషల్ మీడియా మోసాలు వంటి సైబర్ నేరాలపై విద్యార్థులకు వివరించారు. ఎలాంటి సైబర్ మోసానికి గురైనా వెంటనే 1930 హెల్ప్లైన్కు ఫోన్ చేసి, సమీప పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని సూచించారు.కళాశాల ప్రిన్సిపాల్ రామ్ మోహన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. సైబర్ నేరాల నివారణకు సంబంధించిన విలువైన సూచనలు, భద్రతా చర్యలను తెలుసుకుని విద్యార్థులు తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు.