calender_icon.png 4 February, 2026 | 3:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సేంద్రియ, గ్రామీణ ఉపాధి యూనిట్ల పరిశీలన

04-02-2026 01:47:54 AM

పాల్వంచ, ఫిబ్రవరి 3, (విజయక్రాంతి): జిల్లాలో అమలవుతున్న సేంద్రియ వ్యవసాయం, కౌజు పిట్టల పెంపకం, కొర్రమీను చేపల సాగు వంటి వినూత్న వ్యవసాయ మరియు గ్రామీణ ఉపాధి కార్యక్రమాలను జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్, పశుసంవర్ధక శాఖ అడిషనల్ డైరెక్టర్ అమయ్ కుమార్ మంగళవారం పరిశీలించారు.

పర్యటనలో భాగంగా పాల్వంచ మండలం కొత్తూరు గ్రామంలో ఏర్పాటు చేసిన చరిత సేంద్రియ కౌజు పిట్టల పెంపకం యూనిట్ను వారు సమగ్రంగా పరిశీలించారు. యూనిట్లో అమలవుతున్న సేంద్రియ విధానాలు, కౌజు పిట్టల పెంపకం విధానాలు, పరిశుభ్రత ప్రమాణాలు, ఉత్పత్తి, ప్యాకేజింగ్, మార్కెటింగ్ విధానాలను సమీక్షించి తగిన సూచనలు ఇచ్చారు.

యూనిట్లో సేంద్రియ పద్ధతిలో తయారుచేసే ఉత్పత్తుల్లో మునగాకు ఆధారిత ఉత్పత్తులు, చిరుధాన్యాలతో తయారుచేసిన ఆహార పదార్థాలు, ఇప్ప లడ్డు, ఇప్ప నూనె, లెమన్ టీ, వివిధ రకాల కారం పొడులు, పచ్చళ్ళు, హెర్బల్ సబ్బులు మొదలైన మొత్తం 102 రకాల ఉత్పత్తులు ఉన్నాయి.

గ్రామీణ వనరులను సమర్థవంతంగా ఉపయోగిస్తూ, సోలార్ సిస్టమ్ ద్వారా ఉత్పత్తులను ఎండబెట్టి, రసాయన రహిత విధానంలో ప్రజలకు అందించడం ఈ యూనిట్ ప్రత్యేకత. అనంతరం, దమ్మపేట మండలం నాగుపల్లి గ్రామంలో మహిళా సంఘ సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కౌజు పిట్టల పెంపకం యూనిట్ను కూడా పరిశీలించారు. గుడ్ల ఉత్పత్తి, గుడ్లను పొదిగించడం, పిల్లల పెంపకం వంటి ప్రక్రియలను యూనిట్ నిర్వాహకులు వివరిం చారు. 

లింగాలపల్లి గ్రామంలో గిరిజన యువ రైతు చాపా బాలకృష్ణ ఉడయ్ ఆక్వా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొర్రమీను చేపల పెంపకం యూనిట్ను కూడా పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.  ఎంపీడీఓ రవీంద్ర రెడ్డి, గ్రామ సమాఖ్య సభ్యులు, స్థానిక సర్పంచులు, మహిళలు, రైతులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.