తెలంగాణ పబ్లిక్ స్కూల్ నిర్మాణ పనుల పరిశీలన
06-07-2026 09:24 PM
మల్లాపూర్,(విజయక్రాంతి): మల్లాపూర్ మండలంలోని సాతారం గ్రామంలో నిర్మాణ దశలో ఉన్న తెలంగాణ పబ్లిక్ స్కూల్ నిర్మాణ పనులను రాష్ట్ర విద్యాశాఖ జాయింట్ డైరెక్టర్ ఉషారాణి పరిశీలించారు. పాఠశాల భవన నిర్మాణ పనుల పురోగతిని, నిర్మాణ నాణ్యతను, కల్పిస్తున్న మౌలిక వసతులను ఆమె క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా నిర్మాణ పనులు నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా సాగాలని, ప్రభుత్వ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సంబంధిత అధికారులకు సూచించారు. నిర్ణీత గడువులోగా నిర్మాణ పనులను పూర్తి చేసి విద్యార్థులకు అన్ని సౌకర్యాలతో కూడిన ఆధునిక పాఠశాల భవనాన్ని అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు.ఈ పరిశీలన కార్యక్రమంలో మల్లాపూర్ మండల విద్యాధికారి (ఎంఈఓ) దామోదర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.






