గ్రామీణ వైద్యుల కేంద్రాలపై తనిఖీలు నిలిపివేయాలి
ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావుకు ఆర్‌ఎంపీ, పీఎంపీ సంఘం వినతి
చర్ల, మే 28: (విజయ క్రాంతి): గ్రామీణ వైద్యుల ప్రథమ చికిత్స కేంద్రాలపై జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేసి జరిమానాలు విధించడాన్ని నిలిపివేయాలని కోరుతూ ఆర్‌ఎంపీ, పీఎంపీ, సీపీ అండ్ ఈపీ సంఘం నాయకులు గురువారం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావుకు వినతిపత్రం అందజేశారు. జిల్లా అధ్యక్షులు పి. వెంకటేశ్వర్లు, మండల గౌరవ అధ్యక్షులు కొప్పుల రాంబాబు, మండల అధ్యక్షులు తాళ్లూరి రంగారావు, ప్రధాన కార్యదర్శి ఎడారి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో వినతిపత్రం ఇచ్చారు.
ఉన్నత చదువులు చదివి, అనుభవజ్ఞులైన వైద్యుల వద్ద 5-10 ఏళ్లు పనిచేసి గ్రామీణ ప్రాంతాల్లో 20-30 ఏళ్లుగా ప్రథమ చికిత్స అందిస్తున్నామని, ఆకస్మిక తనిఖీలతో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామీణ వైద్యులను గుర్తించి ప్రభుత్వం ప్రత్యేక శిక్షణ ఇచ్చి, కొత్త వ్యాధులపై అవగాహన కల్పించి సేవలను ఉపయోగించుకోవాలని వినతిపత్రంలో కోరారు. ఈ కార్యక్రమంలో పోచం అనంతరాములు, బత్తుల వెంకటేశ్వర్లు, పుప్పాల రంజిత్ కుమార్, కిరణ్, దాగం శ్రీనివాసరావు, బోళ్ల వెంకటేశ్వర్లు, ఇర్పా మురళి, సాధనపల్లి మహేష్, చింత కృష్ణ తదితరులు పాల్గొన్నారు.






