మహిళా వికాస స్ఫూర్తి
తెలుగు సాహిత్యరంగంలో సరిహద్దులు, ప్రాంతీయ భేదాలు లేకుం డా, విశ్వమానవ దృక్పథంతో రచనలు చేసిన రచయితల్లో అగ్రగణ్యురాలు ఇల్లిందల సరస్వతీదేవి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆంధ్రా ప్రాంతం లో పుట్టి, తెలంగాణ ప్రాంతాన్ని మెట్టినిల్లుగా చేసుకుని.. ఆమె రెండు ప్రాం తాల ఆడపడచుగా పేరు తెచ్చుకున్నారు.
ఆమె 1918 జూన్ 15న పశ్చిమ గోదావరి జిల్లాలో జన్మించారు. చిన్ననాటి నుంచే ఆమెకు సాహిత్యంపై మక్కువ కలిగింది. బాల సాహిత్యకారిణిగా సరస్వతీదేవి అనేక నాటికలు రాశారు. తొలిరోజుల్లో ఆమె రాసిన ఎన్నో కథలు రేడియో మాధ్యమంగా నాటికలు ప్రసారమయ్యేవి. సాహిత్యాభిలాషతో సరస్వతీదేవి రామాయణ, మహాభారతాలను అధ్యయనం చేశారు. స్త్రీల పాటలు, జానపద కథలను ఔపోశన పట్టారు.
తను సాహిత్యకారిణిగా గుర్తింపు తెచ్చుకునే నాటికి ఆమె కు సీతారామారావుతో వివాహమైంది. భర్త కూడా సాహిత్యాభిలాషి కావడంతో ఆయన సరస్వతీదేవిని ఎంతో ప్రోత్సహించేవాడు. చదువుపై భార్య కున్న మక్కువను చూసి చదువు చెప్పించాడు. హైదరాబాద్‌లోని శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయానికి వెళ్లి తానే స్వయంగా భార్య కోసం పుస్తకాలు తెచ్చేవాడు. చదువుకుంటున్న సమయంలోనే సరస్వతిదేవి తెలుగులో లబ్ద ప్రతిష్ఠులైన కందుకూరి వీరేశలింగం, గురజాడ అప్పారావు, బెంగాలీ రచయిత శరత్, హిందీ రచయిత ప్రేమచంద్ రచనలన్నింటినీ చదివారు.
వారి రచనల్లోని శిల్పం, వస్తు శైలిని ఆకళింపు చేసుకున్నారు. సాహిత్యం చదువుతున్న క్రమంలో ఆమెకు కథలు రాయా లనే ఆకాంక్ష కలిగింది. ఆమె మొదటి కథ ‘గోలకొండ’ పత్రికలో ప్రచురితమైంది. 1934లో యల్లాప్రగడ సీతాకుమారితో కలిసి సరస్వతీదేవి హైదరాబాద్‌లో ఆంధ్ర యువతి మండలిని స్థాపించారు. ఆ సంస్థ కు సుదీర్ఘకాలం పాటు కార్యదర్శిగా, ఉపాధ్యక్షురాలిగా సేవలందించారు. ఆకాలంలోనే ఆమె జర్నలిజం కోర్సులో డిప్లొమా చేసి, ఇతర మహిళలకూ ఆదర్శంగా నిలిచారు. జీవిత కాలంలో ఆమె 250 కథలు, ఐదు నవలలు రాశారు.
ఐదు వ్యాస సంపుటాలు వెలువరించారు. కృష్ణా పత్రికలో ‘ఇయంగేహే లక్ష్మి’, ఆంధ్రపత్రికలో ‘వనితా లోకం’ శీర్షికలు నిర్వహించారు. దరిజేరిన ప్రాణు లు, ముత్యాల మనసు, స్వర్ణకమలాలు, తులసీ దళాలు, రాజహంసలు పేరిటి కథల సంకలనాలు వెలువరించారు. ఆమె రచనల్లో ‘మన ఆహారము’ అనే తెలుగు అనువాదం ప్రసిద్ధమైనది.
ఆమె ‘స్వర్ణ కమలాలు’ కథల సంకలనానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వరించింది. నీ బాంచను కాల్మొక్త, పెళ్లికూతుళ్లు, అనుపమ నవలలు విమర్శకుల ప్రశంసలందుకున్నాయి. భారత ఆహార సంప్రదాయాలపై కేటీ అచ్చయ్య రాసిన ఆంగ్ల పుస్తకం ‘అవర్ ఫుడ్’ పుస్తకాన్ని సరస్వతీదేవి తెలుగులోకి ‘మన ఆహారము’తో అనువదించారు.
‘నేను కావాలని రచయిత్రిని కాలేదు. మొదట్లో కేవలం పాఠకురాలిగా ఉండాలనుకున్నా. క్రమంగా కథలపై నాకు మక్కువ ఏర్పడింది. అందుకే కథకురాలినయ్యా’నని ఆమె స్వయంగా చెప్పుకొన్నారు. ఆమె సాహితీ ప్రస్థానంలో తెలంగాణ వైతాళికులు రాజబహద్దూర్ వేంకట రామారెడ్డి, మాడ పాటి హనుమంతరావు, సురవరం ప్రతాపరెడ్డి, ఆదిరాజు వీరభద్రరాజు, రావి నారాయణరెడ్డి, మందుముల నరసింగరావు, సంగెం లక్ష్మీబాయి, సుమిత్రాదేవి, యల్లాప్రగడ సీతాకుమారి జీవిత గాథలతో వెలువరించిన ‘తెలంగాణ తేజోమూర్తులు’ పుస్తకం కలికితురాయి.
ఆ పుస్తకం ద్వారా ఆమె తెలంగాణ సమాజానికి అత్యంత ఆప్తురాలయ్యారు. 1958లో ఆమె ఆంధప్రదేశ్ శాసనమండలికి నామినేట్ అయి ఐదేళ్ల పాటు ఎమ్మెల్సీగా కొనసా గారు. ౧99౮ ఆగస్టు ౩1న ఆమె కన్నుమూశారు. ఆమె భౌతికంగా దూరమై ౨౭ ఏళ్లవుతున్నా, ఆమె రచనలు స్ఫూర్తిని రగిలిస్తూనే ఉన్నాయి.






