29-06-2025 12:00:00 AM
స్నానం చేసేటప్పుడు సబ్బు ఉపయోగించడం చాలామందికి అలవాటు. అయితే కొంతమంది సబ్బుకు బదులుగా బాడీవాష్, షవర్ జెల్ వాడుతుంటారు. సబ్బు మాదిరిగానే దీన్ని ఉపయోగిస్తారు. బాడీవాష్ ఎంచుకునే ముందు కొన్ని విషయాలు దృష్టిలో ఉంచుకోవాలని చెబుతున్నారు సౌందర్య నిపుణులు. అవేంటో చూద్దాం..
ఏ సౌందర్యోత్పత్తునా చర్మతత్వాన్ని బట్టి ఎంచుకుంటాం. అప్పుడే చర్మంపై ప్రతికూల ప్రభావం పడకుండా ఉంటుంది. బాడీవాష్‌కూ ఇది వర్తిస్తుందంటున్నారు నిపుణులు. జిడ్డు చర్మం, పొడి చర్మం, సున్నితమైన చర్మం.. ఇలా ఆయా చర్మతత్వాలను బట్టి షవర్ జెల్స్ మార్కెట్లో దొరుకుతున్నాయి.
ఈ క్రమంలో పొడి చర్మం ఉన్నవారు.. గ్లిజరిన్, షియా బటర్, కలబంద.. వంటి ఉత్పత్తులతో తయారైన బాడీవాష్‌లు ఎంచుకోవాలి.
అదే సున్నితమైన చర్మమైతే.. సల్ఫేట్లు, పారబెన్స్ లేని.. పరిమళాలు వాడని ఉత్పత్తిని ఎంచుకోవాల్సి ఉంటుంది.
జిడ్డు చర్మంతో బాధపడేవారు.. నూనెలు, మాయిశ్చరైజర్లు ఉన్న వాటిని పక్కన పెట్టేయాలి.
సాధారణ చర్మం కలిగిన వారు.. పైన పేర్కొన్న మూడింట్లో ఏదైనా ఉపయోగించవచ్చు.
స్నానానికి ఉపయోగించే నీళ్లు మరీ చల్లగా, వేడిగా కాకుండా.. గోరువెచ్చగా ఉండేలా చూసుకోవాలి. బాడీవాష్ ఉపయోగించేటప్పుడూ ఇది చాలా ముఖ్యమంటున్నారు నిపుణులు.
సబ్బుతో పోల్చితే షవర్ జెల్ వాడటం వల్ల చర్మ రంధ్రాల్లో పేరుకున్న మురికి మరింత ప్రభావవంతంగా తొలగిపోతుంది. తద్వారా చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది.
లూఫా, స్పాంజి వంటి వాటితో రుద్దుకోవడం వల్ల బాడీ వాష్‌లో ఉండే గ్లిజరిన్, కలబంద వంటి పదార్థాలు చర్మంలోకి ఇంకి.. చర్మం తేమగా, మృదువుగా మారుతుంది.
కొన్ని షవర్ జెల్స్ స్క్రబ్ మాదిరిగా ఉంటాయి. వీటి వాడకం వల్ల అటు స్క్రబ్, ఇటు స్నానం చేసిన ఫీలింగ్ ఒకేసారి కలుగుతుంది. దీనివల్ల కూడా చర్మం మృదువుగా, కాంతివంతంగా మారుతుంది.