29-06-2025 12:00:00 AM
మన ఇంట్లో వంటగది అనేది చాలా ముఖ్యమైన చోటు. మనం ఎక్కువ సమయం గడిపే ప్రదేశాల్లో ఇది ఒకటి. వంట చేయడం, కూరగాయలు తరగడం, కొత్త వంటలు ప్రయత్నించడం, శుభ్రం చేయడం లాంటి ఎన్నో పనులు వంటగదిలో జరుగుతుంటాయి. ఈ పనులన్నీ ఒక్కోసారి ఎక్కువ సమయం తీసుకుంటాయి. అయితే కొన్ని సులభమైన చిట్కాలను పాటిస్తే.. ఈ పనులను చాలా వేగంగా, సమర్థవంతంగా చేసేందుకు వెనిగర్ బాగా ఉపయోగపడుతుంది.
మాంసం వండాలనుకున్నప్పుడు అది మెత్తగా ఉడకాలంటే వెనిగర్ బాగా సహాయపడుతుంది. మాంసానికి కొద్దిగా వెనిగర్‌ను రాసి ఉడికిస్తే.. మాంసం త్వరగా మెత్తబడుతుంది.
ముఖ్యంగా మాంసంలో ఉండే కొన్ని హానికరమైన బ్యాక్టీరియాను తొలగించడంలో కూడా వెనిగర్ సాయపడుతుంది. మాంసంపై కనిపించే కొవ్వు, జిగట లాంటి పదార్థాలను కూడా దీనివల్ల సులభంగా తొలగించవచ్చు.
వంటల్లో ఉపయోగించే ఉప్పు, కారం, ధనియాల పొడి లాంటి మసాలాలు చాలా అవసరం. ఇవి త్వరగా పాడైపోకుండా చూసుకోవడం ముఖ్యం. మసాలాలు కుళ్లిపోకుండా లేదా వాటి రుచి పాడవకుండా ఉండాలంటే.. మసాలా డబ్బాల అంచుల్లో కొద్దిగా వెనిగర్‌ను వేసి ఆ డబ్బాను మెల్లగా కదపాలి. ఇలా చేయడం వల్ల వెనిగర్ మసాలాలతో కలిసి వాటిని ఫ్రెష్‌గా ఉంచుతుంది. మసాలాల రుచి కూడా చెక్కుచెదరదు. అవి ఎక్కువకాలం తాజాగా ఉంటాయి.
చీజ్‌ను ఫ్రిజ్‌లో పెడితే గట్టిపడుతుంది. అలా కాకుండా ఉండాలంటే.. చీజ్‌ను తడిబట్టలో చుట్టి ప్లాస్టిక్ కవర్‌లో పెట్టాలి. పాలకూర లాంటి ఆకుకూరలను రెండు కప్పుల నీటిలో ఒక చెంచా తెల్ల వెనిగర్ కలిపి కొద్దిసేపు నానబెడితే అవి తాజాగా ఉంటాయి. ఇలా చేస్తే ఆకుకూరలు త్వరగా పాడవ్వవు.
వంటల్లో పులుపు కావాలంటే ఎప్పుడూ నిమ్మరసం, మజ్జిగ కలుపుతారు. అయితే వాటికి బదులుగా వెనిగర్‌ను కూడా వాడొచ్చు. ఇది వంటకానికి రుచిని తగ్గించకుండా పులుపును ఇస్తుంది. ముఖ్యంగా సలాడ్లు, కొన్ని గ్రేవీ వంటకాల్లో దీన్ని సులభంగా కలపొచ్చు.
వెనిగర్‌ను వంటలకు మాత్రమే కాకుండా.. కట్టింగ్ బోర్డ్, స్టెయిన్ లెస్ స్టీల్ పాత్రలు, గ్లాస్ ఐటమ్స్ మీద ఉండే మరకలు, దుమ్ము, జిడ్డును తొలగించడానికి కూడా వాడొచ్చు.