6 May, 2026 | 4:12 AM

రాజ్ ప్రభావవంతమెన దర్శకుడు

09-03-2025 12:51 AM

‘23’ సినిమా టీజర్ లాంచ్ 

ఈవెంట్‌లో రిటైర్డ్ ప్రొఫెసర్ బీనా 

‘మల్లేశం’, ‘8 పీఎం మెట్రో’ చిత్రాలతో ప్రశంసలు పొందిన దర్శకుడు రాజ్ ఆర్ వాస్తవ సంఘటనల నుంచి ప్రేరణ పొందిన మరో ఆసక్తికర ప్రాజెక్ట్ ‘23’తో వస్తున్నారు. స్టూడియో 99 నిర్మించిన ఈ చిత్రంలో తేజ, తన్మయి ప్రధాన పాత్రలు పోషించారు. వెంకట్ సిద్దారెడ్డి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా డిస్ట్రిబ్యూషన్ చేస్తోంది. ఈ సినిమా టీజర్ లాంచ్ వేడుక శనివారం హైదరాబాద్‌లో జరిగింది. ఆర్ట్స్ కాలేజీకి చెందిన ప్రముఖ విశ్రాంత ప్రొఫెసర్ బీనా ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ప్రొఫెసర్ బీనా మాట్లాడుతూ.. ‘నాకు సినిమాల గురించి తెలీదు. జైలు గురించి మాట్లాడగలను. రాజ్ ఫోన్ చేసి జైలు గురించి ఒక కథ రాస్తున్నానని చెప్పాడు. కలిసి మాట్లాడాలని అడిగాడు. చాలాసార్లు ఫోన్ చేశాడు. నేను నా అనుభవాలన్నీ చెప్తుంటే చాలా సీరియస్‌గా రాసుకున్నాడు. జైలు వేరే, లోకం వేరే ప్రపంచం.నా మాటలతో చాలా మంది జీవితంలో మార్పు తీసుకురావడం చాలా ఆనందంగా ఉంది. రాజ్ విజన్ చాలా ప్రభావవంతంగా ఉంది’ అన్నారు. చిత్ర దర్శకుడు రాజ్ రాచకొండ మాట్లాడుతూ.. ‘కొన్ని వాస్తవ సంఘటనల్లో చనిపోయిన వారు 23 మంది. అందుకే ఈ సినిమాకు ఈ టైటిల్ పెట్టాం.

ఈ సినిమా హ్యూమన్ రైట్స్ వైపు.. న్యాయం దొరకని వారి తరపున ఉంటుంది. తప్పును తెలుసుకోవడం ఈ సినిమా ఉద్దేశం. హింసకు వ్యతిరేకంగా తీశాం. బీనా మేడమ్ చెప్పిన చాలా విషయాలు ఇందులో చూపించాను’ అన్నారు.  యాక్టర్ ఝాన్సీ మాట్లాడు తూ.. “23’ అద్భుతమైన కాన్సెప్ట్. రాజ్ నిజాయితీగల ఫిలిం మేకర్. ఈ సినిమాలో భాగం కావడం గౌరవంగా భావిస్తున్నా. నిజ జీవిత కథను నిజాయితీగా చెప్పారు.

నిజాయితీగా కథ చెప్తే పవర్ ఉంటుంది. ఈ సినిమాలో దమ్ముంది. ఇలాంటి సినిమాను ప్రేక్షకులు వెతుక్కుంటూ వస్తారనే నమ్మకం ఉంది. చరిత్రలో నిలిచిపోయే గొప్ప సినిమా ఇది’ అన్నారు. నటుడు తేజ మాట్లాడుతూ.. ‘ఇది నా డెబ్యూ ఫిల్మ్. ఇంత ఇంటెన్స్ ప్రాజెక్ట్‌లో అవకాశం రావడం చాలా ఆనందంగా ఉంది’ అన్నారు. నటుడు తాగుబోతు రమేశ్, మిగతా చిత్రబృందం కార్యక్రమంలో పాల్గొన్నారు.