11-12-2024 01:28:59 AM
ప్రతీ ఏటా చివరివరకు వేచిచూసి పర్మిషన్
రాష్ట్రంలో మిక్స్‌డ్ ఆక్యుపెన్సీ భవనాల్లో కొనసాగుతున్న అనుబంధ.. గుర్తింపు గడువు ముగిసిన ప్రైవేట్, కార్పొరేట్ ఇంటర్ కళాశాలలు రాష్ట్రంలో దాదాపు 300 వరకు ఉన్నా యి. వీటిలో సుమారుగా 60 వేల నుంచి లక్ష మందివరకు విద్యార్థులు చదువుతున్నారు. వీటికి ప్రభుత్వం గతంలో రెండేళ్ల పాటు ప్రత్యేక అనుమతిని ఇచ్చింది. అయితే ఆయా కాలే జీలకు ఇచ్చిన గడువు 2023-24 విద్యాసంవత్సరంతో ముగిసిపోయింది.
హైదరాబాద్, డిసెంబర్ 10 (విజయక్రాంతి): అటు ఇంటర్ ప్రైవేట్ కాలేజీలది.. ఇటు ప్రభుత్వానిది ఎప్పుడూ ఇదే తీరు. అనుమతుల విషయంలో ముందస్తుగానే ఓ నిర్ణయాన్ని ప్రకటించకుండా ప్రభుత్వానిది చివరివరకు నాన్చుడు ధోరణే. చివరి వరకు వేచిచూసి అప్పుడు మిక్స్‌డ్ ఆక్యుపెన్సీ విషయంలో నిర్ణయాలు తీసుకుంటున్నారనే విమర్శలున్నాయి.
విద్యార్థుల భవిష్యత్ దృష్ట్యా అనుమతులివ్వాలని కొన్నేళ్లుగా కాలేజీ యాజమాన్యాలు కోరడం షరామామూలయింది. ప్రభుత్వం కూడా ఈ విష యంలో ఒకట్రెండేళ్లకు మినహాయింపునిస్తూ వస్తోంది. రాష్ట్రంలో మిక్స్‌డ్ ఆక్యుపెన్సీ భవనాల్లో కొనసాగుతున్న అనుబంధ.. గుర్తింపు గడువు ముగిసిన ప్రైవేట్, కార్పొరేట్ ఇంటర్ కళాశాలలు రాష్ట్రంలో దాదాపు 300 వరకు ఉన్నా యి.
వీటిలో సుమారుగా 60 వేల నుంచి లక్ష మందివరకు విద్యార్థులు చదువుతున్నారు. ఈ మిక్స్‌డ్ ఆక్యుపెన్సీ భవనాల్లో కొనసాగుతున్న ఇంటర్ కళాశాలలకు ప్రభుత్వం గతంలో రెండేళ్ల పాటు ప్రత్యేక అనుమతిని ఇచ్చింది. అయితే ఆయా కాలేజీలకు ఇచ్చిన గడువు 2023 విద్యాసంవత్సరంతో ముగిసిపోయింది. ఈ విద్యాసంవత్సరానికి అనుమతిలేదు.
జూన్ నుంచి విద్యాసంవత్సరం ప్రారంభమై ఆరు నెలలు కావొస్తున్నా అనుమతి విషయంలో విద్యాశాఖ నిర్ణయం తీసుకోలేదు. మార్చిలో ఇంటర్ వార్షిక పరీక్షలు జరగనున్నాయి. అనుమతులుంటేనే విద్యార్థులకు పరీక్షలు రాసే వీలుంది. ఇంతవరకూ గుర్తింపు విషయంలో విద్యాశాఖ నిర్ణయం తీసుకోకపోవడంతో విద్యా ర్థుల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారనుంది.
ఫెనాల్టీతో అవకాశం?
రెండేళ్ల క్రితం ఈ కాలేజీల్లో చదువుతున్న విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని రెండేళ్లపాటు ప్రత్యేక గుర్తింపును ఇంటర్ బోర్డు ఇచ్చింది. కానీ, గతేడాది ఆ కాలేజీల్లో ఫస్టియర్‌లో చేరే విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి మాత్రం అండర్ టేకింగ్ (డిక్లరేషన్) లెటర్‌ను తీసుకోవాలని కాలేజీలకు ఆదేశాలిచ్చింది.
ఇందులో భాగంగానే ‘వచ్చే విద్యాసంవత్సరం కళాశాలకు గుర్తింపు రాకున్నా.. ఈ కాలేజీలో ఇప్పుడు చేరడం మాకిష్టమే’ అని గతేడాది అండర్ టేకింగ్ తీసుకున్నారు. ఈక్రమంలోనే కొన్ని కాలేజీలు విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి లెటర్లు రాయించుకుంటే, మరికొన్ని రాయించుకోలేదని తెలిసింది.
కొంత మంది విద్యార్థులు తెలిసి చేరితే, మరికొందరు విషయం తెలియకుండా చేరారు. ఇప్పుడు ఆ 300 కాలేజీలకు గడువు ముగిసింది. గతేడాది ఫస్టియర్‌లో ప్రవేశాలు పొందిన విద్యార్థులు ఇప్పుడు సెకండియర్‌లో ఉన్నారు. ఇప్పుడు ఆ కాలేజీలకు మిక్స్‌డ్ ఆక్యుపెన్సీ గుర్తింపును ఇంటర్ బోర్డు ఇస్తుందా? లేదా? అన్న అయోమయం నెలకొంది.
ప్రతి ఏడాది ఇదే తీరు..!
రాష్ట్రంలో 1580 ప్రైవేట్, కార్పొరేట్ కాలేజీలున్నాయి. అయితే వీటిలో చాలావరకు బహుళ అంతస్తుల భవనాలు, ఇరుకు ప్రాంతాల్లో కొనసాగుతున్నాయి. ఏదైనా అనుకోని ఘటనలు జరిగితే సహాయ చర్యలు చేపట్టేందుకు వీలుగా లేవు. ఇలాంటివి రాష్ట్రంలో 300 వరకు ఉన్నాయి. వీటిని వేరేచోటుకి తరలించకుండా ఆయా కాలేజీలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయనే విమర్శులు ఉన్నాయి.
అయితే 2024 విద్యాసంవత్సరానికి ప్రైవేట్ జూనియర్ కాలేజీల అఫిలియేషన్ (అనుబంధ గుర్తింపు)కు ఇంటర్ బోర్డు ఫిబ్రవరి 24న నోటిఫికేషన్ విడుదల చేసి దరఖాస్తులను స్వీకరించి గుర్తింపునిచ్చిం ది. గుర్తింపునివ్వని వాటిలో మిక్స్‌డ్ ఆక్యుపెన్సీ కాలేజీలు 300 వరకు ఉన్నాయి. అయితే దీనికి సంబంధించిన దస్త్రం ఇప్పటికే ప్రభుత్వానికి ఇంటర్ బోర్డు పంపించింది.
విద్యాశాఖ సీఎం వద్దనే ఉండడంతో ఆ దస్త్రం సీఎంవో కార్యాలయానికి చేరింది. దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఈ విషయంలో ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంటుందని తెలంగాణ ప్రైవేట్ కాలేజీల జేఏసీ కన్వీనర్ గౌరీ సతీశ్ తెలిపారు. ఫెనాల్టీ విధించి మరో ఒకట్రెండు సంవత్సరాలకు ప్రభుత్వం అనుమతినిచ్చే అవకాశమూ ఉంది.