calender_icon.png 23 August, 2025 | 1:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాఠ్యపుస్తకాల్లో తెలంగాణ తల్లి

11-12-2024 01:34:07 AM

  1. రాష్ర్టగేయం కూడా..
  2. 2025-26 విద్యా సంవత్సరం నుంచి అమలు
  3. 2026-27 నుంచి సిలబస్‌లో మార్పులు
  4. భాషా మాధ్యమంపై విద్యాశాఖ, విద్యాకమిషన్ తలోదారి

హైదరాబాద్, డిసెంబర్ 10 (విజయకాంతి): పాఠ్యపుస్తకాల్లో తెలంగాణ తల్లి చిత్రపటాన్ని, తెలంగాణ గేయం ముద్రించాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఇటీవలే రాష్ర్ట గేయం ‘జయ జయహే తెలంగాణ’, తెలంగాణ తల్లి నూతన విగ్రహాన్ని ప్రభుత్వం ఆమోదించిన నేపథ్యంలో పాఠ్యపుస్తకాల్లో ఈ రెండింటినీ ముద్రించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది.

2025-26 విద్యా సంవత్సరంలో ఇచ్చే పాఠ్యపుస్తకాల్లో వీటిని ముద్రించనున్నారు. దీనిపై ఇప్పటికే కసరత్తు ప్రారంభించినట్టు పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు ఈవీ నర్సింహారెడ్డి మీడియాతో చెప్పారు. అయితే వచ్చే విద్యాసంవత్సరంలో పాఠ్యపుస్తకాలను ఏ మాధ్యమంలో ముద్రించాలన్న అంశంపై విద్యాశాఖ, విద్యాకమిషన్ భిన్నాభిప్రాయాలతో ముందుకెళ్తున్నట్టు తెలుస్తోంది.

రాష్ర్టంలో 1-10 తరగతుల విద్యార్థుల కోసం ద్విభాషా పుస్తకాలను ముద్రిస్తున్న విషయం తెలిసిందే. ఒకే పుస్తకంలో కుడి వైపు పేజీని తెలుగులో, ఎడమ వైపు పేజీని ఇంగ్లిష్‌లో ముద్రిస్తున్నారు. ఈ విధానంతో నష్టం జరుగుతుందన్న భావనలో తెలంగాణ విద్యాకమిషన్ ఉంది.

విద్యార్థులు ఇంగ్లిష్ భాషా నైపుణ్యాలను నేర్చుకోలేకపోతున్నారని, పుస్తకాలు తెలుగులో ఉండటమే ఇందు కు కారణమన్న అభిప్రాయానికి వచ్చింది. పుస్తకాలను ఇంగ్లిష్‌లోనే ముద్రించాలన్న భావనతో కమిషన్ ఉన్నట్టు తెలుస్తోంది. 

వచ్చే ఏడాదికి ద్విభాషా పుస్తకాలు..

కాగా వచ్చే విద్యాసంవత్సరానికి అవసరమైన పాఠ్యపుస్తకాల ముద్రణను విద్యాశాఖ ఇటీవలే ప్రారంభించింది. వచ్చే ఏడాదిలో ద్విభాషా పుస్తకాలను ముద్రించాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వ పాఠ్యపుస్తక ముద్రణ సంస్థకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఒకవైపు పేజీలో తెలుగు, మరోవైపు పేజీలో ఇంగ్లిష్‌లో ఉండే పాఠ్యపుస్తకాలను ముద్రించనుంది.

ద్విభాషా పాఠ్యపుస్తకాల వినియోగంపై ఇటీవలే విద్యాకమిషన్ రాష్ర్టవ్యాప్తంగా సర్వేను సైతం నిర్వహించింది. అయితే తెలుగు మీడియాన్ని పూర్తిగా ఎత్తివేసి, కేవలం ఇంగ్లిష్ మీడియంలోనే పుస్తకాలను ముద్రించాలనే నిర్ణయానికి విద్యా కమిషన్ రావడంపై తీవ్ర వ్యతిరేకత ఎదురైంది.

ఈక్రమంలోనే వచ్చే విద్యాసంవత్సరంలో పాఠ్యపుస్తకాలను తెలుగులోనూ ముద్రించేందుకు నిర్ణయించింది. మరోవైపు 2026 విద్యాసంవత్సరం నుంచి సిలబస్‌ను సైతం మార్పులు చేయనున్నట్లు కమిషన్ పేర్కొన్నది. నూతన జాతీయ విద్యావిధానం (ఎన్‌ఈపీ), నేషనల్ కరికులం ఫ్రేమ్‌వర్క్ (ఎన్‌సీఎఫ్)లో భాగంగా పాఠ్యపుస్తకాల్లోని సిలబస్‌లో కొంతమేర మార్పులు చేయనున్నారు.