calender_icon.png 23 August, 2025 | 7:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బరిలో బండి సంజయ్

11-12-2024 01:23:11 AM

  1. సంక్రాంతి తర్వాతే బీజేపీకి కొత్త అధ్యక్షుడు 
  2. సంస్థాగత ఎన్నికల ఆలస్యంతో మారిన ముహూర్తం
  3. తెలంగాణ బీజేపీలో కొనసాగుతున్న సస్పెన్స్ 

హైదరాబాద్, డిసెంబర్ 10 (విజయక్రాంతి): తెలంగాణ బీజేపీ అధ్యక్షుని ఎంపికకు సంక్రాంతి అడ్డుపడింది. సంక్రాంతి లోపు కీడు దినాలు ఉన్నాయని, ఆ తర్వాతే కొత్త అధ్యక్షుని ఎంపిక జరిపే అవకాశం ఉందని పార్టీ నేతలు చెప్తున్నారు.

మరోవైపు రాష్ట్రంలో ఈ నెల 26 లోపు ముగియాల్సిన సంస్థాగత ఎన్నికల ప్రక్రి య ఆలస్యం కావడంతో సంక్రాంతి తర్వాతే కొత్త అధ్యక్షుని నియామకం ఉంటుందని తెలుస్తోంది. అధ్యక్ష ఎన్నిక ఆలస్యం అవుతున్న కొద్దీ తెరపైకి కొత్త పేర్లు వచ్చి చేరు తున్నాయి. 2023లో ఎన్నికల ముందు మార్చిన అప్పటి అధ్యక్షుడు బండి సంజయ్ పేరు మళ్లీ తెరపైకి వచ్చింది.

కేంద్ర మంత్రిగా కిషన్‌రెడ్డి బాధ్యతలు చేపట్టిన రోజు నుంచి కొత్త అధ్యక్షుడు ఎవరు? అనే అంశంపై చర్చ జరుగుతూనే ఉన్న నేపథ్యంలో రాష్ట్రానికి రాబోయే బీజేపీ కొత్త బాస్ ఎవరనే దానిపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. ఇప్పటి వరకు ప్రచారంలో ఉన్న పేర్లు కాకుండా కొత్త పేర్లు తెరపైకి రావడంతో ఆశావహుల్లో కలవరం మొదలైంది.

మరోవైపు బూత్ కమిటీలు డిసెంబర్ 10 నాటికే పూర్తయ్యి.. మండల కమిటీల ఎంపిక ప్రారంభంకావాల్సి ఉన్నప్పటికీ ఇంకా బూత్ కమిటీలు పూర్తి అవ్వలేదు. దీంతో రాష్ర్ట అధ్యక్షుడి ఎంపిక కూడా ఆలస్యమవుతోందని తెలుస్తోంది. 

అనూహ్యంగా బండి సంజయ్ పేరు 

బండి సంజయ్ పీరియడ్‌లో రాష్ట్రం లో బీజేపీకి ఊపు వచ్చిందని.. ఆయనకు మరోసారి అవకాశం ఇస్తే పార్టీ మళ్లీ ఊహించని విధంగా బలపడుతుందని అధిష్ఠానం భావిస్తున్నట్టు పార్టీకి చెందిన ముఖ్య నేతలు చెప్తున్నారు. ఈ నెల 7న  సరూర్‌నగర్‌లో జరిగిన బీజేపీ బహిరంగ సభలో కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన డెడ్‌లైన్ వ్యాఖ్యలు కూడా ఆయన తిరిగి అధ్యక్ష పదవిని చేపట్టేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారనే విధంగా చర్చ జరుగుతోంది.

ఇచ్చిన హామీలను నెరవేర్చకుంటే సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ నాయకులను ఎక్కడికక్కడ అడ్డుకుంటామని బండి హెచ్చరించారు. రాష్ర్ట అధ్యక్షుడు కిషన్‌రెడ్డి డెడ్‌లైన్ విధించాల్సిందిపోయి.. బండి సంజయ్ విధించడం పార్టీ శ్రేణుల్లో చర్చనీయాంశమైంది. 2020 మార్చి 11 నుంచి 2023 జులై 4 వరకు బీజేపీ తెలంగాణ అధ్యక్షునిగా పనిచేసిన సమయంలో బండి సంజయ్..

రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తప్పకుండా తెస్తాడనే విధంగా చర్చ జరిగింది. అయితే కొందరు సీనియర్ నేతలు పార్టీకి నష్టం జరుగుతోందని చెప్పుడు మాటలతో అధిష్ఠానాన్ని ప్రభావితం చేసి ఎన్నికలకు ఆర్నెళ్ల ముందు ఆయన పదవి కోల్పోయేలా చేశారని అప్పట్లో ప్రచారం జరిగింది. బండిని తప్పించడం వల్ల పార్టీకి ఎంత నష్టం జరిగిందో గుర్తించిన అధిష్ఠానం తిరిగి ఆయనకే పట్టం కట్టాలని ఆలోచన చేస్తోందనే చర్చ జరుగుతోంది.

దక్షిణాదిపై ప్రత్యేక దృష్ణి కేంద్రీకరించిన బీజేపీ అధిష్ఠానం తెలంగాణను గేట్‌వేగా మార్చు కుంది. ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో అధికార పార్టీతో సమానంగా ఎంపీ సీట్లు సాధించడంతో తెలంగాణపై ఆశలు పెట్టుకుంది. ఎలాగైనా తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరవేయాలని భావిస్తోంది.

అందులో భాగంగా రాష్ర్టంలో పార్టీని బలోపేతం చేసిన బండికే రాష్ర్ట అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తే 2028లో పార్టీ అధికారంలోకి వస్తుందని జాతీయ నాయకత్వంతో పాటు ఆర్‌ఎస్‌ఎస్ భావిస్తున్నట్టు సమాచారం. జాతీయ నాయకత్వం జరిపిన సర్వేలోనూ బండినే అధ్యక్షుడిని చేయాలనే డిమాండ్లు వినిపించినట్టు పార్టీ వర్గాలు చెప్తోన్నాయి. 

అధ్యక్ష పీఠానికి భారీ పోటీ 

సరూర్‌నగర్ వేదికగా బండి సంజయ్ రాష్ర్ట ప్రభుత్వానికి సంక్రాంతి వరకు విధించిన డెడ్‌లైన్ వ్యాఖ్యల వెనక మర్మమేమిటనే ఆలోచనలో పార్టీ శ్రేణులు పడ్డాయి. రాష్ర్ట అధ్యక్షుడిగా బండి సంజయ్‌నే నియమిస్తారేమోననే ప్రచారానికి ఇది బలం చేకూరుస్తోంది. దీంతో అధ్యక్ష పదవి ఆశిస్తోన్న ఆశావహుల గుండెల్లో గుబులు మొదలైంది.

రాష్ర్ట అధ్యక్ష పగ్గాలు ఎవ్వరికి దక్కుతాయోనన్న ఉత్కంఠ పార్టీ శ్రేణులతో పాటు రాజకీయ వర్గాల్లో నెలకొంది. ఈ నేపథ్యంలో రాష్ర్ట అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్న వారి సంఖ్య పెరుగుతోందని తెలుస్తోంది. ఇప్పటివరకు నాలుగైదు పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. ఆశావహులు తమస్థాయిలో అధిష్ఠానం వద్ద లాబీయింగ్ ప్రారంభించారు.

రాష్ర్ట పగ్గాలు తమకే దక్కుతాయని గంపెడాశలు పెట్టుకున్నారు. ఈటల రాజేందర్, డీకే అరుణ, రాంచందర్‌రావు, రఘునందన్‌రావు పేర్లు ఎక్కువగా వినిపిస్తూనే ఉన్నాయి. ఈటలకు బీసీ నేత కావడం ప్లస్ పాయింట్ అయితే, ఇప్పటికే జాతీయ ఉపాధ్యక్షురాలిగా ఉన్న ఎంపీ డీకే అరుణకు కూడా పార్టీలో మంచి పేరుంది.

బీజేపీలో చేరినప్పటి నుంచి ఎలాంటి వివాదాల్లోనూ ఆమె చిక్కుకోలేదు. ఎక్కడా పార్టీ లైన్ దాటలేదు. ఆమె అభ్యర్థిత్వంపైనా ఎవరికీ అభ్యంతరాలు ఉండవని అంటున్నారు. ఇక రాంచందర్‌రావు సైతం బీజేపీ అధ్యక్ష బరిలో గట్టి పోటీదారుగానే ఉన్నారు. 

నత్తనడకన సంస్థాగత ఎన్నికలు 

సంస్థాగత ఎన్నికల ప్రక్రియను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న జాతీయ నాయకత్వం ఈ నెల 10 వరకే బూత్ కమిటీల ఎంపిక పూర్తి చేయాలని ఆదేశించింది. బూత్ కమిటీల ప్రక్రియ ముగిసిన తరువాత ఈ నెల 20లోగా మండల కమిటీలను పూర్తి చేయాలని చెప్పింది. గడువులోగా ప్రక్రియ పూర్తిచేయాలని దిశానిర్దేశం చేసినప్పటికీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియ నెమ్మదిగా సాగుతోంది.

మంగళవారం నాటికి బూత్ కమిటీలు పూర్తికావాల్సి ఉండగా సగం కూడా పూర్తికానట్టు తెలుస్తోంది. మండల కమిటీలు ముగిసిన అనంతరం డిసెంబర్ 20 తర్వాత జిల్లా కమిటీలను ఏర్పాటుచేయాలని అధిష్ఠానం మార్గనిర్దేశం చేసింది. కానీ, ఆ పరిస్థితి లేకుండా పోయింది. ఈ నెల 16 వరకైనా బూత్ కమిటీలను పూర్తి చేయాలని జిల్లా అధ్యక్షులను రాష్ర్ట నాయకత్వం ఆదేశించింది.

బూత్ కమిటీల ప్రక్రియ ముగిసిన తరువాత ఈ నెల 17, 18 తేదీల్లో జిల్లాల్లో వర్క్‌షాప్‌లను నిర్వహించనుంది. 20వ తేదీ నుంచి మండల కమిటీలను ఏర్పాటు చేయాలని ఆదేశించింది. మండల కమిటీలు పూర్తి చేసి 30వ తేదీన అన్ని జిల్లాల అధ్యక్షులను ఎన్నుకోవాలని నిర్ణయించింది. దీంతో రాష్ర్ట అధ్యక్షుడి ఎన్నిక జనవరి కంటే ముందైతే జరిగే పరిస్థితి లేదని పార్టీ వర్గాలు వెల్లడించాయి.