5 July, 2026 | 8:19 AM

రేపటి నుంచి ఇంటర్ సప్లమెంటరీ పరీక్షలు షురూ

23-05-2024 09:33 PM

హైదరాబాద్: రేపటి (శుక్రవారం) నుంచి ఇంటర్ అడ్వాన్స్ సప్లమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. ఈ పరీక్షలు జూన్ 3 వరకు నిర్వహించనున్నారు. అయితే పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఐదు నిమిషాలు ఆలస్యంగా వచ్చినా పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తారు. ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ పరీక్షలు ఒకే రోజున నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఇంటర్ ఫస్టియర్ విద్యార్థలకు, మధ్యాహ్నం 2.30 గంటల నుండి సాయంత్రం 5.30 వరకు ఇంటర్ సెకండియర్ విద్యార్థులకు పరీక్షలు జరగనున్నాయి. అయితే ఉదయం 9.05 గంటలు, మధ్యాహ్నం 2.35 గంటల వరకు వచ్చేవారిని కూడా పరీక్ష రాసేందుకు అనుమతిస్తారు. పరీక్షల నిర్వహణకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 4,27,015 లక్షల మంది విద్యార్థులు 926 పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు రాయనున్నారు. శుక్రవారం నుంచి పరీక్షలు ప్రారంభమవుతున్నాప్పటికి రూ.2000 ఆలస్య రుసుముతో ఈనెల 23వ తేదీ (గురువారం) మధ్యాహ్నం 3 గంటల వరకూ చివరి నిమిషం వరకూ పరీక్ష ఫీజు చెల్లించేందుకు ఇంటర్ బోర్డు అధికారులు అవకాశం కల్పించారు. రూ.వెయ్యి ఫీజుతో ఈనెల 16వ తేదీ వరకు అధికారులు అవకాశమిచ్చినా ఫీజు చెల్లించని వారికోసం శుక్రవారం మధ్యాహ్నం వరకు మరోసారి అవకాశమివ్వడంతో సర్వత్రా బిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. విద్యార్థులు, పేరెంట్స్, కళాశాలల విజ్ఞప్తి మేరకే ఫీజు కట్టుకునేందుకు మరో అవకాశం ఇచ్చినట్లు బోర్డు అధికారులు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.