27 June, 2026 | 1:34 AM

డ్రగ్స్ రహిత రాష్ట్రమే లక్ష్యం

27-06-2026 12:00 AM

చిన్నారుల భవిష్యత్తే తెలంగాణ ప్రగతి టాలీవుడ్ ప్రముఖులు 

సే నో టు డ్రగ్స్ సందేశాలు ఇవ్వాలి

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

శిల్పకళా వేదికలో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం

హైదరాబాద్, జూన్ 26 (విజయక్రాంతి)/శేరిలింగంపల్లి: చిన్నారుల భవిష్యత్తే రాష్ట్ర భవిష్యత్తు.. వారు ఎంతగా వృద్ధిలోకి వస్తే, తెలంగాణ రాష్ట్రం అంతగా అభివృద్ధి చెందుతుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం, అక్రమ మానవ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా శిల్పకళా వేదికలో శుక్రవారం ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో ఆయన ప్రసంగించారు.

తెలంగాణలో ఏ ఒక్కరూ మాదక ద్రవ్యాలకు బానిస కాకూడదన్నదే సీఎం రేవంత్‌రెడ్డి, రాష్ట్ర క్యాబినెట్ సంకల్పమని పేర్కొన్నారు. రాష్ట్రంలో డ్రగ్స్ అమ్మకాలకు గానీ, సరఫరా అనే మాటకే గానీ తావుండకూడదని తేల్చిచెప్పారు. ఆరోగ్యవంతమైన యువతను తయారుచేసే ప్రక్రియలో భాగంగా ప్రభుత్వం కఠిన చర్యలు చేపడుతోందని డిప్యూటీ సీఎం తెలిపారు. ఈ నార్కోటిక్స్‌కు వ్యతిరేకంగా ప్రత్యేకంగా ’ఈగిల్ ఫోర్స్’ డిపార్ట్మెంట్‌ను ఏర్పాటు చేశామని వెల్లడించారు.

ఈ విభాగం సంపూర్ణంగా పనిచేయడానికి అవసరమైన ఆర్థిక వనరులు, రవాణా వాహనాలు సమకూర్చామన్నారు. ప్రాణాలకు  ప్రమాదం ఉన్నప్పటికీ సమాజాన్ని కాపాడేందుకు పనిచేస్తున్న ఈ పోలీస్ ఉద్యోగ వ్యవస్థకు ప్రత్యేక ఇన్సెంటివ్స్ ఇచ్చే ప్రపోజల్‌ను ప్రభుత్వం తక్షణమే ఆమోదించి, వారిని ప్రోత్సహిస్తోందని అన్నారు. తల్లిదండ్రులు ఎన్నో ఆశలతో పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారని, వారి ఆశలను, ప్రభుత్వ ఆకాంక్షలను నిజం చేయడం కోసం ప్రతి ఒక్కరు ’సే నో టు డ్రగ్స్’ అని గళమెత్తాలని పిలుపునిచ్చారు.

ఇందుకోసం ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల్లో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. సమాజ శ్రేయస్సే బాధ్యతగా పటిష్టమైన పోలీస్ యంత్రాంగం అకుంఠిత దీక్షతో ముందుకు సాగుతోందని అన్నారు. పిల్లల భవిష్యత్తుకు ఆటంకం కలిగిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని, కఠిన నిర్ణయాలు తీసుకుంటామని హెచ్చరించారు. కేవలం చట్టాలు చేసినంత మాత్రాన అన్నీ అమలు కావని, సమాజంలో మార్పు రావాలని ఆయన అభిప్రాయపడ్డారు.

స్కూళ్లు, కాలేజీల్లో కౌన్సెలింగ్ ఇస్తూనే, సమాజాన్ని ప్రభావితం చేయగల నాయకులు, సెలబ్రిటీలు దీనిపై వీడియో, ట్వీట్ చేసి అవగాహన కల్పించాలని కోరారు. సినిమా రంగానికి సంబంధించిన హీరోలు, హీరోయిన్లు, నటులు, ప్రముఖ దర్శకులు, క్యారెక్టర్ ఆర్టిస్టులు ఇచ్చే చిన్న సందేశం అనేకమంది యువతీ యువకుల భవిష్యత్తును మారుస్తుందని పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో మాకూ బాధ్యత ఉందని భావించి, సినీ ప్రముఖులంతా ’సే నో టు డ్రగ్స్’ పై వీడియో రికార్డెడ్ సందేశాలు ఇవ్వాలని ఆయన పిలుపునిచ్చారు.

అవసరమైతే ఇన్ఫర్మేషన్ డిపార్ట్‌మెంట్, సినిమాటోగ్రఫీ శాఖ అధికారులను మీ వద్దకు పంపి ఆ సందేశాలను రికార్డ్ చేయించి, రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేయడానికి ప్రభుత్వం అన్ని సదుపాయాలు కల్పిస్తుందని అన్నారు. పోలీస్ యంత్రాంగం, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్తో పాటు ముఖ్యంగా ’ఈగిల్ ఫోర్స్’కు ప్రభుత్వం నుంచి సంపూర్ణ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు.