మసకబారిన కార్మికుల పండగ

01-05-2024 12:30:00 AM

కార్మికుల పోరాటాలకు, సాధించిన విజయాలకు గుర్తుగా జరుపుకునే మేడే ఇప్పుడు మొక్కుబడి తంతులాగానే మారింది. అసలు కార్మిక సంఘాల ఉనికే ప్రశ్నార్థకంగా మారిన ప్రస్తుత పరిస్థితుల్లో ‘కార్మికుల దినోత్సవం’ గురించిన స్పృహ అందరిలోనూ కొరవడుతున్నది. ఐటి, వ్యవసాయ, వాణిజ్య, నిర్మాణ తదితర రంగాలలో వున్న అసంఘటిత కార్మికులను పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. ఫలితంగా కార్మిక లోకం సమస్యలు పెరగడమే తప్ప తగ్గే సూచనలే లేవు. ఈ తరుణంలో తమ హక్కుల సాధన, సమస్యల పరిష్కారానికి అందరూ ముందుకు రావాల్సి ఉంది.

ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏటా మే 1వ తేదీని ‘ప్రపంచ కార్మిక దినోత్సవం’గా జరుపుకోవడం ఆనవాయితీ. అమెరికా, కెనడా, యూరప్, ఆసియా, లాటిన్ అమెరికాసహా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు గుర్తించిన ప్రభుత్వసెలవు దినం కూడా. మేడేను మనం ఎందుకు జరుపుకోవాలి? దాని ప్రాధాన్యం ఏమిటో తెలుసుకోవాలంటే మనం ఒక్కసారి 19వ శతాబ్దం నాటి రోజులకు వెళ్లాలి. అప్పట్లో కార్మికులకు ఎలాంటి హక్కులు ఉండేవి కావు. నిర్దిష్టమైన పని గంటలు కూడా ఉండేవి కావు. ఓ విధంగా చెప్పాలంటే కార్మికులు కట్టు బానిసల్లాగా వెట్టి చాకిరీ చేసేవారు. 1886లో ఎనిమిది గంటల పని రోజు పోరాటంలో భాగంగా మొట్టమొదటిసారి అమెరికాలో మేడేను జరుపు కొన్నారు.

ఆ ఏడాది మే 1వ తేదీన మెరుగైన పని పరిస్థితులు, తక్కువ పని గంటల కోసం డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా లక్షలాది మంది కార్మికులు సమ్మెకు దిగారు. మొదట్లో సమ్మె ప్రశాంతంగానే  మొదలైంది కానీ, మే 4వ తేదీన చికాగోలోని హే మార్కెట్ స్కేర్ వద్ద్ద కార్మికుల ప్రదర్శనలో బాంబు పేలుడు సంభవించి పలువు రు మృతి చెందగా, డజన్ల సంఖ్యలో గాయపడ్డారు. ఈ ఘటన కార్మిక చైతన్యంపై కట్టడికి కారణం కాగా, కార్మికుల సంఘీభావానికి, నిరసనకు గుర్తుగా మేడే మారడా నికి దారి తీసింది. అయితే, మిగతా దేశాల్లో దీనికి భిన్నమైన చరిత్ర ఉంది. ఉదాహరణకు యూరప్‌లో మేడేను వేసవి ప్రారంభానికి గుర్తుగా జరుపుకొనే గేలిక్ పండుగ ప్రారంభానికి గుర్తుగా ఆటపాటలు, డ్యాన్సింగ్ లాంటి వాటితో జరుపు కొంటారు. ఇక, ఫిన్లాండ్, స్వీడన్‌లలో పిక్నిక్‌లు, ఔట్‌డోర్ కార్యకలాపాలతో మేడేను జరుపుకొంటారు. యుకెలో  కూడా మేడే వేడుకల్లో  డ్యాన్స్‌లు, జానపద సంప్రదాయాలు ఉంటాయి. 

మేడే ఆవిష్కారం

పేరు ఏదయినా, ఎక్కడ మొదలైనా మే 1వ తేదీ అంటే కార్మికులంతా మెరుగైన పని పరిస్థితులు, మెరుగైన వేతనాలు, ఇతర కార్మికుల హక్కులను డిమాండ్ చేస్తూ ఒకచోట చేరడానికి గుర్తుగా నిలిచిపోయింది. చాలా దేశాల్లో కార్మిక సంఘా లు, ఇతర కార్మికుల సంస్థలు కార్మిక ఉద్యమం సాధించిన విజయాలను గుర్తు చేసుకుంటూ, పని పరిస్థితుల్లో మరింత మెరుగుదలను డిమాండ్ చేస్తూ ఊరేగింపులు, ర్యాలీలు, ఇతర కార్యక్రమాలు నిర్వ హిస్తుంటాయి. రాజకీయ చైతన్యానికి, సామాజిక న్యాయానికి పర్యావరణం మొదలుకొనియుద్ధ వ్యతిరేక ఉద్యమాల దాకా అనేక అంశాలపైన నిరసనలు, ప్రదర్శనలు జరిపే రోజుగాకూడా కూడా మేడే  నిలిచిపోయింది.

 పాతిక, ముప్ఫు ఏళ్ల క్రితం వరకు పరిశ్రమలు, ఇతర సంస్థల్లో కార్మిక సంఘాలు ఎంతో బలంగా ఉండేవి. చాలావరకు ఈ సంఘాలు కమ్యూనిస్టు పార్టీలకు అనుబంధమైన ఎఐటియుసి, సిఐటియుతో పాటుగా అప్పట్లో జాతీయ స్థాయిలో ప్రధాన పార్టీగా ఉండిన కాంగ్రెస్ పార్టీ అనుబంధ కార్మిక విభాగమైన ఎఐటియుసికి అనుబంధంగా ఉండేవి. వేతనాల పెంపులాంటి కార్మికుల డిమాండ్లపై యాజమాన్యాలు కూడా ఈ సంఘాల నేతలతో చర్చలద్వారానే పరిష్కరించుకుంటూ ఉండేవి. కొన్ని సందర్భాల్లో కార్మిక సంఘాలు చరిత్రాత్మకమైన సమ్మెలు చేపట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో జార్జి ఫెర్నాండెజ్ నేతృత్వంలో దేశవ్యాప్తంగా జరిగిన రైల్వే సమ్మె దీనికి ఓ ఉదాహరణ. 

అయిన వారికి ఆకుల్లో..

ముంబయిలోని జౌళి మిల్లుల్లో కార్మికులు జరిపిన సుదీర్ఘ ఆందోళన కూడా చరిత్ర పుటల్లో నిలిపోయిన ఘటనే. అయితే, కాలక్రమంలో కార్మిక సంఘాలు యాజమాన్యాలకు తొత్తులుగా మారిపోయి, నేతలు కార్మికుల ప్రయోజ నాలకన్నా సొంత ప్రయోజనాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ రావడంతో అవి తన ప్రాముఖ్యతను కోల్పోతూ వచ్చాయి. కార్మికులు సైతం తమ నేతలపై నమ్మకం కోల్పోయే స్థితికి చేరుకున్నారు. కార్మికుల్లో నెలకొన్న ఈ అనైక్యత యాజమాన్యాలకు వరంగా మారింది. దీన్ని సాకుగా చేసుకుని యాజమాన్యాలు కార్మిక సంఘాలను బలహీన పర్చడం మొదలు పెట్టాయి. దీనికి తోడు ప్రైవేటీకరణ ప్రభావం కూడా కార్మిక ఉద్యమలపై తీవ్ర ప్రభావం చూపించసాగాయి. ప్రైవే టు సంస్థలు ‘అయిన వారికి ఆకుల్లో, కాని వారికి కంచాల్లో’ అన్న చందంగా తమకు కావలసిన వారికి ప్రమోషన్లు, అధిక జీతాలు ఇస్తూ, మిగతా వారిపై వారు పెత్తనం చేసేలా చేయగలిగాయి. దీంతో కాలక్రమంలో కార్మిక సంఘాలు లేని పరిశ్రమలు, సంస్థలు తయారయ్యాయి. 

మారిన పరిస్థితులు

ఇన్ఫర్షేన్ టెక్నాలజీ (ఐటి) రంగ ప్రవేశంతో అసలు కార్మిక సంఘాల ఊసే లేని పరిస్థితి తయారయింది. యాజమాన్యాలు ఇష్టమైనంత కాలం ఉద్యోగాల్లో ఉంచుకోవడం, ఇష్టం లేకపోతే రాత్రికి రాత్రి ఇంటికి పంపించి వేయడం చేస్తున్నాయి. ఉద్యోగులు కూడా మెరుగైన వేతనాలకోసం కంపెనీ మారడం సర్వసాధారణమై పోయింది. ఈ పరిస్థితుల్లో కార్మిక వ్యవస్థ అంతా కూడా అవ్యవస్థీకృతంగా మారిపోయింది. దేశంలో కమ్యూనిస్టు పార్టీల ప్రాభవం మసకబారడం కూడా కార్మిక ఉద్యమం నీరుగారి పోవడానికి  ప్రధాన కారణంగా మారింది. ఒకప్పుడు  కమ్యూనిస్టుల కంచుకోటలుగా ఉండిన పశ్చిమ బెంగాల్, త్రిపుర లాంటి రాష్ట్రాలు ఇప్పు డు ఆ పార్టీల చేజారి పోయాయి. కేరళలో మాత్రమే ఇప్పటికీ కొంతమేరకు ఉభయ కమ్యూనిస్టు పార్టీల ఉనికి ఉంది.

 నీరు కారిన ఉద్యమం

ఈ పరిస్థితుల్లో దేశంలో మే డే జరుపుకోవడం అనేది కేవలం అలంకార ప్రాయంగా మారింది.  ఏవో మొక్కుబడిగా చిన్నపాటి సభలు, ఊరేగింపులు జరిపేసి, గతాన్ని గుర్తుకు చేసుకోవడానికి అది పరిమితమవుతోంది. కార్మికులకు సంబంధించిన సమస్యలపై పోరాడేందుకు అవసరమైన కార్యాచరణ ఇప్పుడు కరవై పోయింది. దీంతో ప్రస్తుతం కార్మికులు మరోసారి పాతకాలం పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. తమకు అండగా నిలిచి పోరాడే నేతలు, సంఘాల కోసం వాళ్లు ఎదురు చూస్తున్నారు. కార్మికులు మరోసారి సంఘటితంగా పోరాటాలు జరపా ల్సిన అవసరం ఇప్పుడు ఉంది. అయితే, ప్రస్తుత పరిస్థితులు అందుకు ఎంతమేరకు అనుకూలంగా ఉన్నాయని ప్రశ్నించుకుంటే సరైన సమాధానం లభించడం కష్టమే. 

కానీ, అసంఘటిత రంగంలోని కోట్లాదిమంది వ్యవసాయ, పారిశ్రామిక కార్మి కుల సమస్యలు తెలుసుకొని, వారి హక్కు ల పరిరక్షణకు, వేతనాల పెంపు, సరయిన పని పరిస్థితులు, యాజమాన్యాల శ్రమ దోపిడీ నుంచి వారికి రక్షణ కల్పించడం కోసం మళ్లీ ఉద్యమాలు జరగాల్సిన అవసరం ఎంతయినా ఉందనేది మాత్రం పచ్చి నిజం. రాబోయే రోజుల్లో ఇలాంటి ఉద్యమాలకు బీజం పడినప్పుడే మళ్లీ కార్మిక దినోత్సవాలకు సార్థకత లభిస్తుంది.


కె. రామకృష్ణ