జెడి(ఎస్)కు గట్టి దెబ్బ

01-05-2024 12:20:00 AM

మాజీ ప్రధాని హెచ్‌డి దేవెగౌడ మనవడు, కర్నాటకలోని హాసప్ ఎంపీ ప్రజ్వల్ వేలాదిమంది మహిళలపై లైంగిక దౌర్జన్యాలకు పాల్పడినట్లు ఆరోపణలు రావడం రాజకీయంగా పెనుసంచలనం సృష్టించింది. లోక్‌సభ ఎన్నికల ప్రచారం కీలకదశకు చేరుకున్న తరుణంలో వెలుగుచూసిన ఈ ఉదంతం రాజకీయంగా జెడి(ఎస్)కు, దాని వ్యవస్థాపకుడు దేవెగౌడ, పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామికి గట్టి ఎదురుదెబ్బేనని చెప్పవచ్చు. ప్రజ్వ ల్‌తోపాటుగా ఆయన తండ్రి, దేవెగౌడ పెద్ద కుమారుడు రేవణ్ణను కూడా పార్టీనుంచి సస్పెండ్ చేయాలని సొంతపార్టీ నేతలనుంచే పెద్ద ఎత్తున డిమాండ్లు రావడంతో ప్రజ్వల్‌ను సస్పెండ్ చేయక తప్పలేదు. మంగళవారం జరిగిన పార్టీ కోర్ కమిటీ సమావేశంలో ప్రజ్వల్‌ను పార్టీనుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించిన కుమారస్వామి ఈ కేసు దర్యాప్తు పూర్తయ్యే వరకు సస్పెన్షన్ కొన సాగుతుందని స్పష్టం చేశారు. ఈ వ్యవహారంతో తనకు కానీ, దేవెగౌడకు కానీ ఎలాంటి సంబంధం లేదని, తమ కుటుంబాన్ని ఇందులోకి లాగవద్దని కూడా పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన అధికార కాంగ్రెస్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. ఉపముఖ్యమంత్రి డికె శివకుమార్‌తోపాటు కాంగ్రెస్‌లోని కొంతమంది నేతల ప్రమేయం ఉందన్నది ఆయన ప్రధాన ఆరోపణ. ‘అసభ్యకర వీడియోల్లో  ప్రజ్వల్ ముఖం కనిపిస్తోందా? అందు లో ఉన్నది అతనే అనే దానికి ఆధారాలేమిటి?’ అని కూడా కుమారస్వామి ప్రశ్నించారు. అయినా, తాము నైతిక బాధ్యతగా ప్రజ్వల్‌పై చర్యలు తీసుకున్నామని చెప్పారు. మరోవైపు ప్రజ్వల్‌కు సంబంధించినవిగా చెబుతున్న అసభ్యకర వీడియోల వ్యవహారంలో దర్యాప్తుకోసం కర్నాటక ప్రభుత్వం ముగ్గురు సభ్యులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేసింది. ఈ సిట్ ముందుగా హొళె నరసీపుర పోలీసు స్టేషన్‌లో  కేసు నమోదు చేసిన బాధితురాలి నుంచి వాగ్మూలాన్ని సేకరించింది.

దౌర్జన్యం జరిగిన రేవణ్ణ నివాసంలో తనిఖీలు నిర్వహించిన అనంతరం రేవణ్ణను, ప్రజ్వల్‌ను విచారిస్తుంది. అధికారులు వేలమంది మహిళలకు సంబంధించిన అశ్లీల వీడియోలు ఉన్నట్లుగా చెబుతున్న పెన్‌డ్రైవ్‌లు, ఇతర సాక్ష్యాలను సేకరించి దర్యాప్త్తు చేస్తున్నట్లు  రాష్ట్ర హోంమంత్రి డాక్టర్ జీ పరమేశ్వర్ తెలిపారు. ఈ నేపథ్యంలోనే ప్రజ్వల్ విదేశాలకు వెళ్లడం  చర్చనీయాంశంగా మారింది. ప్రజ్వల్ విదేశాలకు పారిపోయేందుకు ప్రధాని మోడీ సహా బీజేపీ పెద్దలు సహాయపడ్డారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఎన్నికల ప్రక్రియ అనంతరం విదేశాలకు వెళ్లాలనిప్రజ్వల్  ముందుగానే నిర్ణయించుకున్నారని, కేసు నమోదు కావడంతో విదేశాలకు పారిపోయాడనేది అబద్ధమని ప్రజ్వల్ తండ్రి రేవణ్ణ వాదిస్తున్నారు. దర్యాప్తుకు భయపడడం లేదనికూడా ఆయన స్పష్టం చేశారు. ఐదేళ్ల కిందటి ఘటనపై ఇప్పుడు ఫిర్యాదు చేయడం వెనుక రాజకీయాలు, కుట్రకోణం ఉన్నట్లు ఆరోపించారు. అరెస్టు చేయకుండా విచారించేలా ఆదేశాలు ఇవ్వాలని ఆయన న్యాయస్థానంలో పిటిషన్ కూడా వేయనున్నట్లు తెలుస్తోంది.

కేసు విషయం ఎలా ఉన్నప్పటికీ ఈ వ్యవహారంతో ప్రజ్వల్ రాజకీయ భవిష్యత్తుపై నీలినీడలు కమ్ముకున్నాయనేది మాత్రం సుస్పష్టం. మరోవైపు దేవెగౌడ కుటుంబంలోని వ్యక్తులపై వచ్చిన ఈ ఆరోపణలతో కుటుంబపార్టీగా ఉన్న జెడి(ఎస్) భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. వయోభారం కారణంగా దేవెగౌడ  దాదాపుగా క్రియాశీల రాజకీయాలకు దూరం కావడం, ఆయన వారసుడుగా కుమారస్వామి పార్టీ పగ్గాలను చేపట్టిన తరుణంలో  చోటు చేసుకున్న ఈ పరిణామం పార్టీకి గట్టి ఎదురుదెబ్బేనని అంటున్నారు. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తీవ్రంగా నష్టపోయిన పార్టీకి తిరిగి పూర్వవైభవం తీసుకు రావడానికి బీజేపీతో చేతులు కలిపినా లోక్‌సభ ఎన్నికల్లో ఎలాంటి ప్రయోజనం కలగక పోవచ్చని పరిశీలకుల అంచనా.  మరోవైపు కాంగ్రెస్‌కు ఇది అయాచితంగానే దొరికిన అస్త్రం అనే చెప్పాలి.