ఓయూలో ఘనంగా అంతర్జాతీయ మహిళా సదస్సు
ఓయూలో గివ్ టు గెయిన్‌మహిళా సుస్థిరత కేంద్రంగా మేధోమధనం
సికింద్రాబాద్, మార్చ్24 (విజయక్రాంతి): మహిళా సాధికారతలో ఓయూ మొదటి వరుసలో ఉందని ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కుమార్ మొలుగరం పేర్కొన్నారు. మహిళా దినోత్సవం-2026 కోసం ఐక్యరాజ్యసమితి నిర్దేశించిన నినాదం గివ్ టు గెయిన్ సుస్థిరత కోసం మహిళా శక్తి అనే అంశంపై ఓయూ ఠాగూర్ ఆడిటోరియంలో మూడు రోజుల అంతర్జాతీయ సదస్సును మంగళవారం ప్రారంభించారు.
ఈ సదస్సుకు ప్రొఫెసర్ కుమార్ మొలుగరం అధ్యక్షత వహించగా భారత సైన్యపు మాజీ అధికారిణి కెప్టెన్ మీరా సిద్ధార్థ దవే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 108 ఏళ్ల ఉస్మానియా విశ్వవిద్యాలయ చరిత్రలోనే ఇదో చారిత్రాత్మక మైలురాయిగా నిలువనుంది. ఈ సందర్భంగా ప్రొఫెసర్ కుమార్ మొలుగరం మాట్లాడుతూ ఈ సదస్సు కేవలం ఒక విద్యా కార్యక్రమం మాత్రమే కాదని ప్రపంచ సుస్థిరతలో మహిళల యొక్క విశిష్ట దృక్పథాలను భాగం చేయాలనే ఒక పిలుపుగా అభివర్ణించారు. ఈ మార్పుకు ఉస్మానియా విశ్వవి ద్యాలయం ఒక కేంద్ర బిందువుగా నిలవడం గర్వకారణంగా ఉందని అన్నారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి కెప్టెన్ మీరా సిద్ధార్థ దవే, తెలంగాణ ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ ప్రొఫెసర్ వి. బాలకిష్టా రెడ్డి, పద్మశ్రీ డాక్టర్ మంజుల అనగాని పద్మశ్రీ డాక్టర్ పి. రఘురామ్, ప్రముఖ నటి గౌతమి తడిమల్లా, ప్రొఫెసర్ రేఖా పాండే, ఓయూ రిజిస్ట్రార్ ఆచార్య జి. నరేష్ రెడ్డి, ఓఎస్డీ ప్రొ ఫెసర్ ఎస్.జితేంద్ర కుమార్ నాయక్ ప్రొఫెసర్ హమీదా బీ తదితరులు పాల్గొన్నారు.




